మన హీరోయిన్లు కన్ను గీటి కుర్రకారు గుండెను మీటుతారు.. కొంటెగా నవ్వి అభిమానుల మనసులు కొల్లగొడతారు. వెన్నెలే చిన్నబోయేలా మెరిసే ఈ సుందరాంగులకు ఎంతటి అందగాడు వరుడుగా సరిపోతాడో తెలుసా! ఈ చందమామలు ఎంతటి గుణవంతుడిని భర్తగా రావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలని ఉందా! అయితే చదివేయండి.
అది గమనించాలి
"పెళ్లంటే రెండు మనసులు మ్యాచ్ కావాలి. ఒకరి ఆలోచనలపై మరొకరికి గౌరవం ఉండాలి. ఎదుటివారి వృత్తిని కూడా గౌరవించాలి. అలాంటి మనసున్నవాడే నాకు వరుడుగా కావాలి. నేను కొన్ని భావోద్వేగాలకు గురవుతుంటా. నటన పట్ల నేను అంకిత భావంతో ఉంటా. నన్ను ఇష్టపడే వ్యక్తులు నా వృత్తికి, నా ఆలోచనలకి గౌరవం ఇవ్వాలనుకుంటా. నాలాంటి అమ్మాయిలు జీరో నుంచి మొదలుపెట్టి కెరీర్ నిర్మించుకుంటున్నారు. జీవితంలోకి వచ్చే వ్యక్తి అది గమనించాలి."
- లక్ష్మీ రాయ్
రాముడు కావాలి
"నాకు రాముడి లాంటి మంచి మనిషి కావాలని కోరుకుంటా. ఇక సిక్స్‌ప్యాక్ రాముడైతే మరింత మంచిది. నన్ను చేసుకునేవాడు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని పెద్దగా కోరికలు లేవు. మంచిగా నవ్వించే వ్యక్తయితే చాలు. ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక డ్రీమ్ ఉంది. చాలా సింపుల్‌గా ఇంటి భోజనమో, లేక జంక్ ఫుడ్డో తీసుకుంటూ హాయిగా టీవీ చూస్తూ ఒకరికొకరం కబుర్లు చెప్పుకోవాలని కోరికగా ఉంది."