తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకే కుటుంబంలో రెండు తరాలతో నటించిన నాయికలు! - రకుల్​ప్రీత్​ సింగ్​

చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్​ ఒకే హీరోతో అనేక సినిమాల్లో నటించిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు వయసుకు మించిన పాత్రల్లో నటించి మెప్పించిన కథానాయికలూ ఉన్నారు. కానీ, ఒకే కుటుంబంలో, తండ్రీ కొడుకులిద్దరితో కలిసి నటించిన హీరోయిన్లు మాత్రం అరుదుగా ఉంటారు. అలా తండ్రీ కొడుకుల సినిమాల్లో నాయికగా నటించిన తారలెవరో తెలుసుకుందామా.

tollywood heroines who worked with both father and son
ఒకే కుటుంబంలో రెండు తరాలతో నటించిన నాయికలు

By

Published : Sep 4, 2020, 6:48 PM IST

Updated : Sep 4, 2020, 7:45 PM IST

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా గట్టిగా పదేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది ప్రస్తుతం దశాబ్దాలకు పైగా సినీపరిశ్రమల్లో పాతుకుపోతున్నారు కొందరు హీరోయిన్లు. అలాగే వయసుతో సంబంధం లేకుండా అటు తండ్రి ఇటు కొడుకు సరసన నటించడానికి గ్రీన్​ సిగ్నల్​ ఇస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకుల సినిమాల్లో హీరోయిన్​గా చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కథానాయికలెవరో చూద్దాం.

మెగా హీరోలతో

లక్ష్మీ కల్యాణం చిత్రంతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన కాజల్​ అగర్వాల్​.. రామ్​ చరణ్​ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'మగధీర' చిత్రంతో స్టార్​ హోదా పొందింది. ఆ తర్వాత చరణ్​తో కలిసి 'నాయక్'​, 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లో ఆడిపాడింది. తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'ఖైదీ నెం.150'లో హీరోయిన్​గా నటించి మెప్పించింది. దీంతో తండ్రీకొడుకులైన చిరు, చరణ్​ల సినిమాల్లో హీరోయిన్​గా నటించిన ఘనత కాజల్​ సాధించింది.

తనలోని విభిన్నమైన నటనతో పాన్​-ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది నటి తమన్నా. 2005లో విడుదలైన 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీబ్యూటీ దశాబ్దానికి పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. రామ్​ చరణ్ సరసన 'రచ్చ' సినిమాలో నటించి.. ఆ తర్వాత అతడి తండ్రి మెగాస్టార్​ చిరంజీవి కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'సైరా' చిత్రంలోనూ ఎంపికైంది. కాజల్​ అగర్వాల్​ తర్వాత చిరు, చెర్రీలతో కలిసి నటించిన ఘనతను తమన్నా సొంతం చేసుకుంది.

అక్కినేని వారసులతో

పంజాబీ భామ రకుల్​ప్రీత్​ సింగ్​ బాలీవుడ్​లో అరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన చిత్రాల ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. దక్షిణాది చిత్రాలతో పాటు ఉత్తరాది సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది రకుల్​. ఈ నటి టాలీవుడ్​లో అక్కినేని నాగచైతన్య సరసన 'రారండోయ్​ వేడుకచూద్దాం' చిత్రంలో నటించి హిట్​ అందుకుంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు 2'లో హీరోయిన్​గా ఛాన్స్​ కొట్టేసింది. దీంతో అక్కినేని రెండు తరాలతో హీరోయిన్​గా నటించిన ఘనత రకుల్​ దక్కించుకుంది.

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. తన​ నటనతో విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. 'భలే భలే మగాడివోయ్​', 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి చిత్రాలతో సూపర్​హిట్లను ఆమె ఖాతాలో వేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో పాటు అతడి కుమారుడు నాగచైతన్య నటించిన 'యుద్ధం శరణం' సినిమాలోనూ నటించి మెప్పించింది.

Last Updated : Sep 4, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details