తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త సినిమా కబురు ఎప్పుడు చెబుతారో? - నిధి అగర్వాల్​ వార్తలు

గతంలో ఒకేసారి రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్​ తారలు.. ప్రస్తుతం కాస్త నెమ్మదించారు. సినిమాల్లో అచితూచి అడుగులు వేయ్యాలని కొంతమంది ఆశిస్తుండగా.. అవకాశాలు లేక మరికొంతమంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు నటిస్తున్న కొత్త చిత్రాల కబురును వినిపించడంలో ఆలస్యం చేస్తున్నారు.

Tollywood heroines are waiting for new movie opportunities
కొత్త సినిమా కబురు ఎప్పుడు చెబుతారో?

By

Published : Oct 19, 2020, 7:57 AM IST

'ఆలస్యం.. అమృతం.. విషం'.. - ఈ మాటకు తగ్గట్లుగానే కథానాయికల సినీ కెరీర్‌ ఎప్పుడూ జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతుంటుంది. చక్కనైన విజయం ఒకటి ఖాతాలో పడిందంటే చాలు.. వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు హొయలొలికిస్తుంటారు. సెట్స్‌పై ఎప్పుడూ రెండు మూడు చిత్రాలతో.. చేతిలో మరికొన్ని కొత్త కథలతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. సమంత, అనుష్క, శ్రుతిహాసన్‌, తదితరులంతా ఇలా బిజీగా గడిపేసిన వాళ్లే. మంచి కలయిక అనిపిస్తే చాలు.. చేతిలో ఎన్ని చిత్రాలున్నా మరొక దానికి పచ్చజెండా ఊపేసే వాళ్లు. అందుకే వాళ్ల కాల్షీట్లు ఎప్పుడో కానీ ఖాళీగా కనిపించేవి కావు. ఈ మధ్య వరుస మారింది. కొత్త, పాత అని తేడా లేకుండా చాలా మంది కథానాయికలు సినిమా విషయంలో కాస్త నెమ్మదించారు. ఆచితూచి అడుగెయ్యాలన్న ఉద్దేశంతో కొంతమంది.. అవకాశాల కోసం ఎదురు చూస్తూ మరికొంత మంది.. కొత్త కబురు వినిపించడంలో ఆలస్యం చేస్తున్నారు.

సమంత

కథానాయికల సినీ కెరీర్‌ పరిధి తక్కువ. వేగంలో మాత్రం ఈ అందాల బుట్టబొమ్మలదే పైచేయి. ఈ విషయంలో మిగతా నాయికల కంటే ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది సమంత. పదేళ్ల సినీ కెరీర్‌లో ఏ ఏడాదీ.. రెండు కంటే తక్కువ సినిమాలు చేసిన దాఖలాలు లేవు. గతేడాదీ ఆమె నుంచి తెలుగు, తమిళ భాషల్లో మూడు చిత్రాల వరకు వచ్చాయి. కానీ, 'ఓ బేబీ' తర్వాత ఇప్పటి వరకు సామ్‌ నుంచి మరో కొత్త కబురేమీ అందలేదు. ఈ ఏడాది 'జాను'తో తెరపై మెరిసినా.. అదీ 'ఓ బేబీ' కన్నా ముందుగా ఒప్పుకొన్నదే. త్వరలో తమిళంలో నయనతారతో కలిసి ఓ చిత్రం చేయబోతుంది. తెలుగులో కొత్తగా ఏ చిత్రాన్నీ ప్రకటించలేదు. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో రానున్న సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్టుల విషయంలో ఆమె పేరు వినిపిస్తోంది.

అనుష్క

ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తున్న అనుష్క సైతం కొత్త సినిమా ప్రకటించాల్సి ఉంది. ఆమె ఇటీవలే 'నిశ్శబ్దం' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే దీని తర్వాత ఆమె చేయబోయే కొత్త చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాలకు సంతకాలు చేసినట్లు సమాచారం. వీటిపై ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

శ్రుతి హాసన్​

'ప్రేమమ్‌' తర్వాత తెలుగు తెరకు దూరమైన శ్రుతిహాసన్‌.. ఇప్పుడు మళ్లీ 'క్రాక్‌' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. దీని తర్వాత ఆమె తెలుగులో చేయబోయే చిత్రమేదీ ఇంకా ఖరారవ్వలేదు. పవన్‌ కల్యాణ్‌కు జోడీగా 'వకీల్‌సాబ్‌' చిత్రంలో కనిపించబోతున్నా.. అది అతిథి పాత్ర లాంటిదే.

నిధి అగర్వాల్​

'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రంతో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకొంది నిధి అగర్వాల్‌. ఈ విజయం తర్వాత ఆమె నుంచి మరో కొత్త కబురేమీ అందలేదు. తెలుగులో యువ హీరో అశోక్‌ గల్లాకు జోడీగా ఓ చిత్రం చేస్తున్నప్పటికీ.. అది కొత్తగా ఒప్పుకొన్న చిత్రం కాదు.

సాయి పల్లవి

సాయిపల్లవి 'పడిపడిలేచే మనసు' తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. అడపాదడపా 'మారి 2', 'ఎన్జీకే' లాంటి అను వాదాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం 'లవ్‌స్టోరీ', 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇవన్నీ గతంలో ఒప్పుకొన్న చిత్రాలే. వీటి తర్వాత ఆమె తెలుగులో చేయబోయే చిత్రమేదన్నది స్పష్టత లేదు.

రాశీ ఖన్నా

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో కుర్రకారును అలరించిన రాశీ ఖన్నా.. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య వరకు వరుసగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత తెలుగులో మరో కొత్త కబురేదీ వినిపించలేదు. తమిళంలో హీరో సూర్య చిత్రంతో పాటు మరో కొత్త సినిమాకూ పచ్చజెండా ఊపింది.

ABOUT THE AUTHOR

...view details