తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా తగ్గాక ఈ హీరోల నుంచి డబుల్ ధమాకా

కరోనా ప్రభావంతో సినిమాల విడుదలలు నిలిచిపోయాయి. అయితే సాధారణ పరిస్థితులు వచ్చాక రెట్టింపు వినోదం ఇచ్చేందుకు పలువురు హీరోలు సిద్ధమవుతున్నారు. వారిలో నాని, నాగచైతన్య, వెంకటేశ్​లు ఉన్నారు.

naga chaitanya venaktesh nani
నాగచైతన్య- వెంకటేష్- నాని

By

Published : May 1, 2021, 7:08 AM IST

కరోనా అన్ని సినిమాలకూ బ్రేకులేసింది. నిన్న మొన్నటిదాకా ధైర్యంగా చిత్రీకరణలు చేస్తూ వచ్చిన ఆ కొన్ని సినిమాలు ఆగిపోక తప్పలేదు. ఇంకో నెల రోజులు గడిస్తే తప్ప చిత్రీకరణల పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. అంతా అనుకూలం అనిపిస్తే... అప్పుడు రంగంలోకి దిగి, మిగిలిన సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎంతైనా... ఒకసారి ఆగిపోయిన బండి మళ్లీ మునుపటి వేగం అందుకోవాలంటే సమయం పడుతుంది కదా. సినిమాలు కూడా అంతే. పైపెచ్చు ప్రేక్షకులు వెంటనే థియేటర్లకు వస్తారో లేదో కాబట్టి... నింపాదిగానే చిత్రీకరణలు చేసుకుందాం అనుకుంటున్న చిత్రబృందాలు చాలానే. తమ అభిమాన హీరోను ఇప్పటికప్పుడే తెరపైన చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఇంకొంత కాలం ఎదురు చూపులు తప్పదు. అయితే అందరి హీరోల మాటేమో కానీ.. కొద్దిమంది ఇప్పటికే ఒక సినిమాను సిద్ధం చేసేసి, రెండో సినిమానూ దాదాపుగా చివరి దశకు తీసుకొచ్చినవాళ్లు చాలా మందే కనిపిస్తున్నారు. ఎప్పుడు థియేటర్లు తెరిచినా వీళ్ల సినిమాలు సిద్ధంగా ఉంటాయన్నమాట. కొంచెం విరామంతోనే రెండో సినిమానూ రేసులో దింపుతారు.

లవ్​స్టోరి మూవీలో నాగచైతన్య, సాయిపల్లవి

తొలి దశ కరోనా తగ్గాక.. చిత్రీకరణలు ఊపందుకున్నాక, విడుదల తేదీల్ని ప్రకటించడంలో పోటీపడ్డాయి చిత్ర బృందాలు. గతేడాది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి ఎలాగైనా ఈ సంవత్సరం తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిందే అని హీరోలు తీవ్రంగా చెమటోడ్చారు. లక్ష్యాల్ని నిర్దేశించుకుని పని చేశారు. చిత్రీకరణల్లో ఆ వేగం చూశాక.. దాదాపు సినిమాలు చెప్పిన సమయానికే విడుదలయ్యేలా కనిపించాయి. కొన్ని చిత్రాలు ఎప్పట్లాగే నత్తనడకన సాగాయి. కానీ కరోనా మరోసారి పంజా విసరడం వల్ల అన్ని, సినిమాలూ ఆగిపోయాయి. ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అయితే కొద్దిమంది కథానాయకులు గతేడాది నుంచీ ఒకే సినిమాపైనే ఉంటే... కొద్దిమంది దొరికిన నాలుగు నెలల కాలంలో తమ చిత్రాల్ని తెరపై చూసుకున్నారు. మరో కొత్త ప్రాజెక్టు కోసం రంగంలోకి దిగారు. ఇంకొంతమంది విడుదల ముంగిట ఆగిపోవల్సిన పరిస్థితి. అయినా సరే.. ఆ హీరోలంతా మేం వరుసగా రెండు సినిమాలతో మురిపిస్తాం అంటూ ఇప్పుడు రెండో సినిమానూ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

టక్​ జగదీష్​ సినిమాలో నాని

నాగచైతన్య ‘లవ్‌ స్టోరి’, నాని ‘టక్‌ జగదీష్‌’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’ సినిమాలు కరోనా రెండో దశ ఉద్ధృతితో విడుదలకు నోచుకోలేకపోయాయి. రెండు మూడు వారాల వ్యవధిలో విడుదల కావల్సిన ఈ సినిమాలన్నీ ఇప్పుడు సాధారణ పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ కథానాయకులు వీటితోపాటు.. కొత్త సినిమాల పనులపైనా దృష్టి పెట్టారు. దాంతో అవీ సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ని పూర్తి చేసిన వెంటనే, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘థ్యాంక్‌ యూ’ కోసం రంగంలోకి దిగారు. ఆ చిత్రం దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అలాగే నాని ‘టక్‌ జగదీష్‌’ పూర్తయిందో లేదో, ఆ వెంటనే ‘శ్యామ్‌ సింగరాయ్‌’ పనులు మొదలుపెట్టారు. ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘అంటే.. సుందరానికి’ ఇప్పటికే షురూ అయ్యింది. రానా దగ్గుబాటికి ఇటు ‘విరాటపర్వం’, అటు పవన్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌ చిత్రం. వెంకటేష్‌ మొదట ‘నారప్ప’ కోసం రంగంలోకి దిగారు. ఆ తర్వాత ‘దృశ్యం2’ చేశారు. రెండూ విడుదలకి ముస్తాబవుతున్నాయి. కరోనా తగ్గాక వరుసగా రెండు సినిమాలతో, రెట్టింపు వినోదంతో అలరించనున్న హీరోలు వీళ్లే మరి!

ABOUT THE AUTHOR

...view details