టాలీవుడ్లో ఆధ్యాత్మిక చిత్రాలు చాలానే వచ్చాయి. ప్రేక్షకుల్నీ అలరించాయి. శివునిపైనా కొన్ని సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. కొంతమంది అగ్రహీరోలు మహాదేవుడి పాత్రలో మెప్పించారు. ఈరోజు మహా శివరాత్రి సందర్భంగా శివుని పాత్రలో నటించి అలరించిన ఆ హీరోలెవరో చూద్దాం.
ఎన్టీఆర్
రాముడు, కృష్ణుడ్ని తలచుకుంటే తెలుగు ప్రేక్షకుల మదిలో టక్కున మెదిలేది నందమూరి తారక రామారావు రూపమే. ఆ పాత్రలో అంతలా లీనమైపోయారు మరి. అయితే ఈ పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ మెప్పించారు ఎన్టీఆర్. 'దక్షయజ్ఞం', 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' వంటి సినిమాల్లో శివుడి పాత్రను పోషించి రక్తికట్టించారు.
ఏఎన్నాఆర్
ఆధ్యాత్మిక పాత్రలు తక్కువగా చేసినా.. జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. ఈయన కూడా శివుడి పాత్రలో మెరిశారు. పూర్తి పాత్ర చేయకపోయినా 'మూగ మనసులు' చిత్రంలో 'గౌరమ్మ నీ మొగుడెవరమ్మా' పాటలో కొన్ని సన్నివేశాల్లో శంకరుని పాత్రలో కనిపిస్తారు ఏఎన్నాఆర్.
శోభన్ బాబు
టాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో ముందు వరుసలో నిలుస్తారు శోభన్ బాబు. ఈయన పలు పౌరాణిక పాత్రల్లోనూ మెరిశారు. అలాగే 'పరమానందయ్య శిష్యుల కథ' చిత్రంలో శివుడి పాత్రలో అలరించారు.
కృష్ణంరాజు
యాక్షన్ చిత్రాలతో రెబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. ఈయన 'వినాయక విజయం' చిత్రంలో మహాదేవుడి పాత్ర పోషించారు. కమలకర కామేశ్వరావు ఈ చిత్రానికి దర్శకుడు.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఈయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీ మంజునాథ' చిత్రంలో శివుడి పాత్ర పోషించారు. అర్జున్, సౌందర్య ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అలాగే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'ఆపద్భాంధవుడు' సినిమాలోని ఓ పాటలో శంకరుడిగా దర్శనమిచ్చారు. వీటికంటే ముందు 'పార్వతీ పరమేశ్వరులు' చిత్రంలో 'నాదనిలయుడే శివుడు' అనే పాటలో కాసేపు శివుడిగా కనిపించారు మెగాస్టార్.
నాగార్జున
ఈతరం హీరోల్లో ఆధ్యాత్మిక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే. ఈయన 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'శిరిడి సాయి' వంటి చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాగే భారవి దర్శకత్వంలో తెరకెక్కిన 'జగద్గురు ఆదిశంకర' చిత్రంలో శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు.
జగపతి బాబు
కుటుంబకథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు జగపతిబాబు. ఈయన 'పెళ్లైన కొత్తలో' చిత్రంలోని ఓ పాటలో శివుడి పాత్రలో కనిపించారు.
మరికొందరు..
వీరే కాక శ్రీకాంత్, సుమన్, ప్రకాశ్ రాజ్, మల్లిఖార్జున రావు, రాజనాల, నాగ భూషణం, రావు గోపాలరావు తదితరులు శివుడి పాత్ర పోషించి మెప్పించారు.