ప్రతీ పండక్కి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శక నిర్మాతలు వినూత్న పంథా ఎంచుకుంటున్నారు. ప్రోమో, ట్రైలర్లు, టీజర్లు, ఫస్ట్‌లుక్, పోస్టర్లు విడుదల చేస్తూ అభిమానులకు చేరువవుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకటి ప్రేమికుల దినోత్సవానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ముగ్గురు యువ హీరోలు ఈ రోజున సందడి చేసేందుకు రానున్నారు. వాటి విశేషాలు ఇవిగో...
వరల్డ్ ఫేమస్ లవర్
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్ర విడుదల తేదీ గురించి టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
'96' తెలుగు రీమేక్...
శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న తమిళ రీమేక్ '96' విషయంలోనూ ఇదే సందేహం. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ, డబ్బింగ్ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది సామ్. అది మినహా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ, ప్రేమికుల దినోత్సవం రోజున ఈ సినిమా సర్ప్రైజ్గా రానుందని సమాచారం.
చైతన్య, సాయి పల్లవి ప్రేమకథ...
టాలీవుడ్ హీరో నాగ చైతన్య కూడా లవర్స్‌డే రోజునే తన సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నాడట. చైతూ, సాయి పల్లవితో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ చిత్రం విడుదల తేదీపై అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. 'ఎన్‌సీ 19' వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకొంటోంది.
ప్రస్తుతం ఈ మూడు చిత్రాల విడుదల తేదీపై ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. వాళ్లే ఒక్కో చిత్రానికి ఒక్కో విడుదల తేదీ ఖరారు చేసి.. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు పెడుతున్నారు. ఈ మూడు ప్రాజెక్టులూ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.