తెలుగులో పాన్ ఇండియా సినిమాల హవా 'బాహుబలి' చిత్రాలతో మొదలైంది. అవి సాధించిన విజయం, వసూళ్లు మరింత ధైర్యంగా అడుగేయడానికి కారణమయ్యాయి. అందరికీ తెలియాల్సిన కథ ఉందనుకుంటే చాలు.. దాన్ని ఓ భాషకో, ప్రాంతానికో పరిమితం చేయడానికి దర్శకనిర్మాతలు ఇష్టపడటం లేదు. మరిన్ని హంగులు జోడించి దానికి పాన్ ఇండియా కలర్ ఇస్తున్నారు. దాంతో వాటి స్థాయి, మార్కెట్ మరింత విస్తృతం అవుతోంది. అలా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవ్వడమే లక్ష్యంగా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి బాలీవుడ్ మద్దతూ లభిస్తోంది.
బాహుబలితో మొదలై..
'బాహుబలి' చిత్రాలతో భాషల మధ్య సరిహద్దులు చెరిగిపోయాక.. 'సైరా నరసింహారెడ్డి', 'సాహో' సినిమాలు ఆ పరంపరను కొనసాగించాయి. ఇప్పుడు ప్రభాస్‌తో పాటు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మంచు విష్ణు, మంచు మనోజ్, విజయ్ దేవరకొండ జాతీయ స్థాయిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాన్ ఇండియా బాట పట్టిన టాలీవుడ్ తారలెవరో చూద్దాం.
అందుకే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్
రెబల్‌స్టార్ ప్రభాస్ 'బాహుబలి' ఇచ్చిన జోష్‌తో వరుస పాన్ ఇండియా చిత్రాలు తీస్తున్నారు. ఈ హీరో నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనం అని అభిమానులు భావిస్తుండగా ఏకంగా నాలుగు పాన్ ఇండియా చిత్రాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా.. నాగ్అశ్విన్తో సైన్స్ ఫిక్షన్ మూవీ, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో 'ఆదిపురుష్', 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో 'సలార్' సినిమా చేస్తున్నారు డార్లింగ్. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.
పవన్ కల్యాణ్-క్రిష్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ ఇందులో కనిపించనున్నారని టాక్. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని చూస్తోంది చిత్రబృందం. దీంతో పవన్ జాతీయ స్థాయి సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనా కరోనా కారణంగా నిలిచిపోయింది. లాక్డౌన్ ఆంక్షలు తొలగిన నేపథ్యంలో త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.
ఆర్ఆర్ఆర్
'బాహుబలి' చిత్రాల తర్వాత దర్శకధీరుడు జక్కన్న చెక్కుతున్న మరో కళాఖండం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, తారక్ హీరోలు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచీ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ పాన్ ఇండియా కథను కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.