కథానాయకులు ఎన్ని రకాల హీరో పాత్రలు చేసినా.. వాళ్లు సినీప్రియుల మదిలో రియల్ హీరోలుగా చిరస్థాయిగా మిగలడానికి చేసే తొలి పని ఏంటో తెలుసా..!
తెల్లవాడి గుండెల్లో కసిగా కత్తి దింపడమే.. ఇది వెండితెరపై ఎవర్‌గ్రీన్ హిట్ ఫార్ములా.. హీరోయిజానికి ఓ సరికొత్త శక్తిని అద్దుతూ.. ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలిస్తుంది..
ఒకసారి అలాంటి పాత్రల్లో నటించాక ఏ నటుడైనా సినీప్రియుల్లో రియల్ హీరోగా మారిపోక తప్పదు.. అందుకే ప్రతి నటుడూ తన సినీ కెరీర్‌లో ఒక్క స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలోనైనా నటించాలని కోరుకుంటాడు.
ఇప్పుడు తెరపైకి 'సైరా నరసింహారెడ్డి'గా అడుగు పెట్టబోతున్న చిరంజీవిని ఇలాంటి కలే 12 ఏళ్ల పాటు కుదురుగా ఉండనివ్వలేదు. కానీ, ఎట్టకేలకు ఆ కల ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. కానీ, ఆయన కన్నా ముందుగానే తెలుగు తెరపై స్వాతంత్య్ర సమరయోధులుగా సందడి చేసి మెప్పించిన అగ్ర తారలు కొందరు ఉన్నారు. వీరిలో సూపర్‌స్టార్ కృష్ణను తెలుగు తెరపై సమరయోధుల కథలకు ఊపిరిలూదిన హీరోగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన 'అల్లూరి సీతారామరాజు' చిత్ర విజయమిచ్చిన స్ఫూర్తితో తర్వాతి తరంలో వచ్చిన ప్రతి అగ్ర హీరో ఆ బాటలో నడిచి తమ కలను నిజం చేసుకుని మంచి విజయాలనూ ఖాతాలో వేసుకున్నారు. కొందరు నిజమైన సమరయోధుల జీవిత కథల్లో నటించి మెప్పిస్తే.. మరికొందరు కల్పిత గాథలతో కనిపించి బ్రిటీష్ వారిపై అలుపెరుగని పోరు చేసి ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలించారు. ఇలా తెలుగు తెరపై ఇప్పటి వరకు వచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల జీవితగాథలను పరిశీలిస్తే.. ముందుగా అందరికీ గుర్తొచ్చేది మన్యం వీరుడు అల్లూరి విజయగాథే.
అల్లూరి సీతారామరాజుతో ఆరంభం
స్వాతంత్రోద్యమ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రాలనగానే తెలుగులో తొలుత అందరి మదిలో మెదిలే చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. ఇప్పుడీ బాటలో వస్తోన్న విప్లవ వీరుల చిత్రాలన్నింటికీ ఈ అల్లూరే స్ఫూర్తి. స్వతంత్రం కోసం బ్రిటీష్ పాలకుల్ని ఎదిరించి ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాధారంగా సూపర్‌స్టార్ కృష్ణ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించి.. తానే నటించారు. కృష్ణ చేసిన ఈ సాహసం అప్పట్లో ఓ సంచలనం. అప్పట్లో ఈ కథ ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు వంటి వారి వద్దకు వెళ్లినా ఈ తరహా కథలు ఎవరు చూస్తారనే ఉద్దేశంతో ఇందులో నటించేందుకు ముందుకు రాలేదు. కానీ, కృష్ణ మాత్రం సాహసించి అపురూప దృశ్యకావ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన 100వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో 19 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. తెలుగులో వచ్చిన తొలి కలర్ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. తెల్లవాడి తుపాకీ గుండెలపై ఉన్నా స్వాతంత్య్ర నినాదమే శ్వాసగా చివరి రక్తపు బొట్టు వరకు బ్రిటీష్ వారితో పోరాడి కోట్లాది మందిలో పోరాట స్ఫూర్తిని రగిలించాడు మన్యం వీరుడు అల్లూరి.
తెల్లవారిని హడలెత్తించిన భారతీయుడు
బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన తర్వాతి తరం హీరోల్లో కమల్‌హాసన్ పేరు చెప్పుకోవాలి. కమల్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన 'భారతీయుడు'తో ఈ అద్భుత దృశ్యం తెరపై ఆవిష్కృతం అయింది. వాస్తవానికి ఈ సినిమా ఆద్యంతం ఇదే బ్యాక్‌డ్రాప్‌లో నడవదు. కేవలం సేనాపతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మాత్రమే ఈ తెల్లవారిపై పోరు కనిపిస్తుంది. ఈ పోరాటాన్నే ఆయుధంగా చేసుకుని ఆ తర్వాత అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు సేనాపతి. ఇలా ఓ అద్భుతమైన సమరయోధుడిగా కమల్ ఒదిగిపోయిన విధానానికి, ఆ పాత్రలో ఆయన పండించిన హీరోయిజానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అప్పట్లో ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది.
బోస్‌గా మారి ముచ్చటతీర్చుకున్న వెంకీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథ స్ఫూర్తితో వెంకటేష్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన చిత్రం 'సుభాష్ చంద్రబోస్'. ఈ చిత్ర నేపథ్యమూ బ్రిటీష్ వారిపై పోరాటం నేపథ్యంలోనే సాగుతుంది. అయితే ఇది నిజ జీవిత గాథ కానప్పటికీ.. ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ ఉద్యమ స్ఫూర్తితో తెరకెక్కించడం విశేషం. ఇందులో వెంకీ రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో తెల్లవారిపై అలుపెరుగని పోరు చేసి వీరమరణం పొందిన యోధుడు చంద్రబోస్‌గా కనిపించగా.. మరో పాత్రలో నేటి తరానికి ప్రతినిధిగా కనిపించి అలరిస్తాడు.
'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బాలయ్య