పెళ్లి తర్వాత తన జీవితంలో అనూహ్యంగా మార్పులేవి జరగలేదని చెప్పారు టాలీవుడ్ యువ హీరో నిఖిల్. ఆయన గత ఏడాది 'అర్జున్ సురవరం'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఆ తర్వాత 'కార్తికేయ 2' షూటింగ్ ఆరంభించారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. నిఖిల్ మేలో తన ప్రేయసి పల్లవి వర్మను వివాహం చేసుకున్నారు. కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫాంహౌస్‌లో శుభకార్యం జరిగింది. కాగా ఆయన తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని వైవాహిక జీవితం ఎలా ఉందని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. చాలా సంతోషంగా ఉన్నా. 'ఎటువంటి మార్పులు లేవు. ఇప్పటికీ పాత నిఖిల్ లానే ఉన్నా' అని సమాధానం ఇచ్చారు.
వెన్నెల కిశోర్ గురించి చెప్పండి?
నిఖిల్: హాస్యాస్పదం.. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. రియల్ లైఫ్‌లో చాలా ఫిట్‌గా ఉంటాడు.
దక్షిణాదిలో మీకు ఇష్టమైన ఆహారం?
నిఖిల్: గుంటూరు బిర్యానీ.
'కార్తికేయ 2'లో కూడా సర్పం ఉందట..?
నిఖిల్: సర్పాలు ఉంటాయి.
ప్రభాస్ గురించి ఒక్కమాట చెప్పండి?
నిఖిల్: మా ప్రభాస్ భాయ్ బంగారం
మీకు స్ఫూర్తి ఎవరు?
నిఖిల్: అందులో సందేహం లేదు.. మెగాస్టార్ చిరంజీవి. చిన్నప్పుడు గ్యాంగ్‌లీడర్ సినిమా చూసి స్కూల్‌లో డైలాగ్‌లు చెప్పేవాడ్ని.
మీకు పెంపుడు కుక్కలు లేవా?
నిఖిల్: ఇంత వరకు లేవు. కానీ నాకు ఓ బాబు పుట్టినప్పుడు తెచ్చుకుంటా.
మీ అభిమానుల గురించి ఒక్కమాట చెప్పండి?
నిఖిల్: నా ఆక్సిజన్. విజయం, అపజయాల్లో నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు.
యువత ఎలా ఉండాలి, సలహాలు ఇవ్వండి?
నిఖిల్: యువతకు అవి చెప్పకూడదు. వాళ్లకి ఉత్తమంగా ఉండటం తెలుసు. మీ లక్ష్యాల్ని సాధించేందుకు కృషి చేస్తూ.. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోండి.
మీ మిత్రుడు ఎవరు?
నిఖిల్: దర్శకుడు చందూ మొండేటి.
'హ్యాపీడేస్' చూసి చాలా మంది బీటెక్ జీవితం ఇంత బాగుంటుందా అని బీటెక్ చేశారు. కానీ ఆపై సినిమా చూసి మోసపోయాం అనుకున్నారు. ఇలాంటివి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
నిఖిల్: ఈ ప్రశ్న నా దర్శకుడు శేఖర్ కమ్ములను అడగండి.
మీకు ఇష్టమైన వెబ్ సిరీస్?
నిఖిల్: నాకు గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టం.