కొంత కాలంగా తెలుగులో పీరియాడిక్ కథల సందడి మెండుగా కనిపిస్తోంది. వర్తమానంలో సాగే కథలు కాకుండా, వెనుకటి రోజులకి వెళ్లి అప్పటి గాథల్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు. దాంతో ఆ సినిమాలు ప్రత్యేకతని సంతరించుకుంటున్నాయి. అవి ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేయడానికి అలాంటి నేపథ్యంతో కూడిన చిత్రాలు ముస్తాబవుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఆర్ఆర్ఆర్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా అగ్రదర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్నదే. 1920 కాలాల్ని ఆవిష్కరించే చిత్రమిది. రాజమౌళి చిత్రం అంటే నేపథ్యమే కాదు, వాటిలోని భావోద్వేగాలూ ప్రత్యేకమే. కథానాయకుల్ని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లుగా చూపిస్తుండడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.
రాధేశ్యామ్
ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథ 1970 కాలాన్ని ఆవిష్కరించబోతోంది. ఆయన నటిస్తున్న 'రాధేశ్యామ్' ఆనాటి అందాలను ఆవిష్కరిస్తూ, యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతుండటం విశేషం. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ లవ్‌స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
పవన్-క్రిష్ చిత్రం
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతంది. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో రాబిన్ హుడ్ తరహా దొంగ పాత్రలో కనువిందు చేయనున్నారు పవన్. ఈ మూవీ కోసం 17వ శతాబ్దం నాటి చార్మినార్ సెట్‌ను రూపొందించారు. అక్కడే యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.