తెలంగాణ

telangana

ETV Bharat / sitara

DRUGS CASE: మళ్లీ తెరపైకి టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు.. సినీ వర్గాల్లో కలవరం - telangana varthalu

నాలుగేళ్ల కిందట సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసు మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులకు మనీలాండరింగ్ కింద తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న చిత్ర పరిశ్రమలో మళ్లీ కలకలం నెలకొంది. అయితే కొంత మంది తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెబుతుండగా.. కావాలనే ఈ కేసును తెరపైకి తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందిపెడుతున్నారని మరి కొంతమంది వాపోతున్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఇలాంటి కేసునుసాధ్యమైనంత త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు.

DRUGS CASE: మళ్లీ తెరపైకి టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు.. సినీ వర్గాల్లో కలవరం
DRUGS CASE: మళ్లీ తెరపైకి టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు.. సినీ వర్గాల్లో కలవరం

By

Published : Aug 28, 2021, 3:23 AM IST

2017 జులైలో 30 లక్షల విలువైన డ్రగ్స్...

ముగ్గురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు...

విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడి...

అంతే.... ఒక్కసారిగా యావత్ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.

డ్రగ్స్ కేసులో ఫలాన నటుడు, నటీ అంటూ ఒక్కొక్కటిగా పేర్లు బయటికి రావడం, వారంతా ఎక్సైజ్ శాఖ ఎన్​ఫోర్స్​మెంట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు ముందు హాజరుకావడంతో డ్రగ్స్ కేసు కీలకంగా మారింది. ఈ క్రమంలో 12 మందిపై కేసులు నమోదు చేసి విచారించిన అధికారులు... పెద్ద మొత్తంలో డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు జరిపినట్లు దర్యాప్తులో తేల్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు 11 ఛార్జిషీట్​లను కోర్టులో దాఖలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి క్లీన్​చిట్ ఇచ్చింది. ఇక కేసు ముగిసిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో పెద్ద మొత్తంలో మనీలాండరింగ్ జరిగిందని భావించిన ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్... కేసులో సంబంధం ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్​సింగ్, రానా, నవదీప్, తనీష్, ముమైత్ ఖాన్ సహా ఇతర ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది.

మళ్లీ తెరపైకి..

ఈడీ నోటీసులు జారీ చేయడంతో మళ్లీ తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది. ముగిసిందనుకున్న కేసు వెంటాడుతుండటం పట్ల ఆయా సినీ నటీనటుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈడీ జారీ చేసిన నోటీసులు కొంత మందికే అందాయని తెలుస్తోంది. మిగతా వారెవరూ ఈ కేసును పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. కానీ నోటీసుల్లో ఫలాన తేదీనా ఫలాన వ్యక్తి హాజరుకావాలని పేర్కొంటూ జారీ చేయడంపై సినీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది పెద్ద పెద్ద సినిమాలు చేస్తుండటంతో ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డ్రగ్స్​ తీసుకోవడంతో పాటు అమ్మడం, స్టాక్​ చేయడం, డీలర్​షిప్​ చేయడం అన్ని తప్పులే. కాదనడం లేదు. డ్రగ్స్​ తీసుకోవడం సూసైడ్​ లాంటిది. సూసైడ్​ చేసుకునే వాడిని శిక్షిస్తానంటున్నారు... హత్య చేసే వాన్ని కదా శిక్షించాల్సింది. హత్య చేసే వాళ్లు ఎవరంటే.. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్​ అమ్మేవాళ్లు. ఎలా వాళ్లు వారికి డ్రగ్స్​ అలవాటు చేసి వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. డబ్బులతో కొనుక్కుని వాళ్ల ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు.. అయినా వాళ్లు చేసేది తప్పే వాళ్లను శిక్షించండి.. కానీ ఎవరైతే చిన్నపిల్లలను చెడగొడుతున్నారో వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదు. వాళ్లను ఏం చేశారు?. ఈ మూడేళ్లుగా వాళ్లను పట్టుకోకుండా ఈ పన్నెండు మంది మీద కేసు ఎందుకు వచ్చింది. ఒక్కో సినిమాపై 300 మందికి పైగా జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాళ్లకు ఇబ్బందిగానే ఉంటుంది. -తమ్మారెడ్డి భరద్వాజ, సినీ ప్రముఖులు

సమయాన్ని వృథా చేయొద్దు..

అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంలో కక్ష్యసాధింపు ధోరణిగా అనిపిస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఈ కేసులో 60 మందికిపైగా ఉన్నారని చెప్పారని, అందులో ఇప్పుడు కేవలం 12 మంది సినిమా వాళ్లకే నోటీసులు జారీ చేయడం సమంజసంగా లేదన్నారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం అర్థరహితమన్నారు. మనీలాండరింగ్ కేసులో ఎంతో మంది కోటీశ్వరులు దేశం దాటి పారిపోయారని ఆరోపించిన తమ్మారెడ్డి... డ్రగ్స్ కేసులో నటీనటులు మనీలాండరింగ్​కు ఎంత పాల్పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ కేసులో నిందితులుగా తేలితే కఠినంగానే శిక్షించాలని, కానీ ఇలా సమయాన్ని వృథా చేయడం సరికాదని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.

ప్రభుత్వాలు సమస్య వచ్చినపుడు సమస్యకు పరిష్కారం వెతకాలి లేక సమస్యను అక్కడితో ఆపేయాలి. సమస్యను మూణ్నాలుగేళ్లకోసారి బయటకు తీసి, టీవీల్లో హడావిడి చేయడం.. దేనికోసం ఇది. మనీలాండరింగ్​ కేసులు మన దేశంలో కొన్ని వందల వరకు ఉన్నాయి. పెద్దపెద్ద కేసులు ఉన్నారు. కొంత మంది డబ్బులు తీసుకుని పారిపోయారు. వాళ్లందరినీ వదిలేసి.. ఒక వేళ వీళ్లు డ్రగ్స్​ తీసుకున్నా ఎంత మొత్తంలో ఇచ్చి ఉంటారు. వీళ్ల మీద కేసులు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అయిపోతోంది. నేను అడిగిన ఆ 50 మంది పరిస్థితి ఏంటో మీడియా బయటకు తీయించాలి. -తమ్మారెడ్డి భరద్వాజ, సినీ ప్రముఖులు

సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలి..

డ్రగ్స్ కేసులో మిగతా వారిని మినహాయించి సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం యావత్ సినీ పరిశ్రమకు చెడ్డపేరు తీసుకొస్తుందని పలువురు అగ్ర నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నా... ప్రభుత్వ యంత్రాంగం ఆ ముఠాలను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా తేల్చి సినీపరిశ్రమపై నెలకొన్న అపవాదును చెరిపివేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: డ్రగ్స్​ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు

ABOUT THE AUTHOR

...view details