తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దర్శకుల కొత్త కథలు.. అలా మొదలు - koratala siva chiaranjeevi acharya

లాక్​డౌన్​తో దొరికిన విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న పలువురు టాలీవుడ్ దర్శకులు.. కొత్త కథలు రాసి, వాటిని తీసేందుకు కూడా సిద్ధమయ్యారు. స్టార్ హీరోలతో ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తుండటం వల్ల కొత్త కథల్ని త్వరగా తెరకెక్కించాలని భావిస్తున్నారు.

దర్శకుల కొత్త కథలు.. అలా మొదలు
త్రివిక్రమ్-కొరటాల శివ-సుకుమార్

By

Published : Sep 7, 2020, 6:52 AM IST

దర్శకులకు విరామం ఉండదు. పగటి పూట సెట్లోనూ... సాయంత్రం స్క్రిప్టు పనులతోనూ బిజీ అయిపోతుంటారు. కరోనాతో తెచ్చిన విరామంలో తారలు, ఇతర సాంకేతిక నిపుణులు ఖాళీగా గడిపారేమో కానీ... దర్శకులు మాత్రం కలం చేతపట్టి ఆ సమయాన్ని పక్కాగా సద్వినియోగం చేసుకున్నారు. అప్పటిదాకా ఎవరి సినిమాలతో వాళ్లు... తెరకెక్కిస్తున్న ఆ కథే తమ ప్రపంచంగా భావిస్తూ గడుపుతున్న వారంతా.. ఊహించని రీతిలో మరో కొత్త కథను మొదలుపెట్టాల్సి వచ్చింది. అలా తయారైన ఆ కొత్త కథలు సైతం ఒకొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి.

పవన్‌కల్యాణ్‌తో సినిమా కోసం రంగం సిద్ధం చేసుకున్న దర్శకుడు క్రిష్‌.. కొన్నాళ్లు చిత్రీకరణ చేశారు. కరోనా ఆయన ప్రణాళికల్ని తారుమారు చేసింది. ఆ సినిమా తిరిగి ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో క్రిష్‌ మరో కథతో రంగంలోకి దిగారు. వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ జంటగా ఆ చిత్రాన్ని తీస్తున్నారు. ఒకే షెడ్యూల్‌లో, పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం చేస్తున్న 'వకీల్‌సాబ్‌'ని పూర్తయ్యేలోపే తమ సినిమాను ముగించేయాలనే సంకల్పంతో రంగంలోకి దిగారు. వేగం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్‌ అందుకు తగ్గట్టుగానే చిత్రీకరణ జరుపుతున్నారు. క్రిష్‌ మాత్రమే కాదు... ఇప్పటికే సినిమాల్ని ప్రకటించిన చాలా మంది దర్శకులు మధ్యలో మరో చిత్రాన్ని పట్టాలెక్కిద్దామా? అనే ఆలోచనలో ఉన్నారు. కరోనాతో వచ్చిన విరామం వల్ల కథానాయకుల ప్రణాళికలు కూడా తారుమారయ్యాయి. దాంతో వాళ్లు చేయాలనుకున్న సినిమాలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. దర్శకులు అప్పటిదాకా ఎదురు చూడకుండా మధ్యలో అందుబాటులో ఉన్న హీరోలతో మరో సినిమా తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరికొంతమంది కథల్ని సిద్ధం చేసి వేరే దర్శకులకు అప్పగిస్తున్నారు.

సురేందర్ రెడ్డి- క్రిష్

ఈ విరామంలో అఖిల్‌తో?

పవన్‌కల్యాణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రానుంది. ఇటీవలే అందుకు సంబంధించిన ప్రకటన వచ్చింది. అయితే పవన్‌ కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌'తోపాటు, క్రిష్‌, హరీష్‌శంకర్‌లతో సినిమాలు పూర్తి చేయాలి. ఆ లెక్కన చాలా సమయమే పడుతుంది. అందుకే సురేందర్‌ రెడ్డి ఈ విరామంలో అఖిల్‌తో ఓ సినిమాను తీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

మరో దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఒక పక్క పవన్‌కల్యాణ్‌ కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తూనే, మరోపక్క తాను రాసిన కథతో, సునీల్‌ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమాను ప్రారంభించారు. దీనికి దర్శకత్వం వహించేది ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

సుకుమార్‌ కూడా 'పుష్ప' కోసం లాక్‌డౌన్‌ కంటే ముందే రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కరోనా ఉద్ధృతితో ఆగిపోవాల్సి వచ్చింది. ఈ విరామంలో ఆయన ఓటీటీ వేదికల కోసం, తన సొంత సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలో తీయాలనుకున్న సినిమాల కోసం కథలు సిద్ధం చేశారు. ఆ కథల్ని సుకుమార్‌ శిష్యులు తెరకెక్కించనున్నారు.

రాసేశారు...

చిరంజీవితో 'ఆచార్య' చేస్తున్నారు కొరటాల శివ. కరోనా విరామంలో ఆయన పూర్తిగా కొత్త కథలపైనే దృష్టి పెట్టారు. తదుపరి అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్టును సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఒక పాన్‌ ఇండియా స్థాయి చిత్రం కోసం స్క్రిప్టుని సిద్ధం చేశారు. ప్రస్తుతం తీస్తున్న 'ఫైటర్‌'(వర్కింగ్‌ టైటిల్‌) పూర్తివగానే, పాన్‌ ఇండియా సినిమా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

శేఖర్ కమ్ముల-పూరీ జగన్నాథ్-హరీశ్ శంకర్

'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్‌ కోసం స్క్రిప్టు సిద్ధం చేశారు త్రివిక్రమ్‌. ఆ పనులన్నీ పూర్తి కావడం, ఎన్టీఆర్‌ ఖాళీ అవ్వడానికి సమయం పట్టేలా ఉండటం వల్ల ప్రస్తుతం త్రివిక్రమ్‌ వేరే కథలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' తెలుగు రీమేక్‌ కోసం త్రివిక్రమ్‌ స్క్రిప్టు సిద్ధం చేయనున్నారని తెలిసింది. పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం.

'లవ్‌స్టోరీ'ని పూర్తి చేసే పనిలో ఉన్న శేఖర్‌ కమ్ముల కూడా తదుపరి చిత్రం కోసం స్క్రిప్టు సిద్ధం చేశారు. మన దర్శకుల్లో చాలా మందికి సినీ నిర్మాణంపైనా ఆసక్తి ఉంది. పలువురు దర్శకులకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మరికొంతమందికి నిర్మాణ సంస్థలతో ప్రత్యేకమైన అనుబంధాలు ఉన్నాయి. దాంతో వాటికి సంబంధించిన వ్యవహారాల్నీ అన్నీ తామై చక్కబెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details