తెలంగాణ

telangana

ETV Bharat / sitara

OTT MOVIES: ఓటీటీలో ఓహో అనిపించారు!

థియేటర్​లో తన సినిమాను విడుదల చేయాలనేది ప్రతి దర్శకుడి కల. అయితే ప్రస్తుత తరంలో ఓటీటీలో తమ మొదటి చిత్రాన్ని రిలీజ్ చేసి, శెభాష్ అనిపించుకున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? ఏ సినిమాలతో ఆకట్టుకున్నారు.

TOLLYWOOD DIRECTORS FIRST MOVIE OTT RELEASE
OTT MOVIES: ఓటీటీలో ఓహో అనిపించారు!

By

Published : May 30, 2021, 8:21 AM IST

Updated : May 30, 2021, 9:31 AM IST

వెనకటి రోజుల్లో అవకాశాలు దొరక్క సినిమా కల పగటికలగానే మిగిలిన ఔత్సాహికుల కథలెన్నో వినిపించేవి. ఈ డిజిటల్‌ యుగంలో ప్రతిభ ఉండాలే కానీ అవకాశాలకు కొదవలేదు. అందుకు నిదర్శనమే ఈ దర్శకులు. తమ మొదటి సినిమాల్ని ఓటీటీల్లో విడుదలచేసి హిట్‌లు అందుకున్నారు.

ఐటీ నుంచి సినిమాల్లోకి...

ఐటీ రంగంలో పనిచేసేవాడు శ్రీకాంత్‌ నాగోతి. సినిమాలంటే ప్రత్యేకమైన ఇష్టం. తాను చూసిన సామాన్యుల, వాస్తవ కథల్ని తెరకెక్కించాలనేది అతడి తపన. ఆ ప్రయత్నంలో తీసిన సినిమా ‘భానుమతి రామకృష్ణ’. ఈ పేరే చాలామందిని ఆకర్షించింది. నవీన్‌ చంద్ర, సలోనీ లూథ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ముప్ఫైల్లోకి అడుగుపెట్టినా పెళ్లికాని వ్యక్తులుగా దీన్లో కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా భానుమతి చుట్టూ తిరుగుతుంది. ఆధునిక మహిళ ఆలోచనలూ, అభిరుచులూ, సవాళ్లను దీన్లో చూపించారు. ‘దీన్ని థియేటర్‌లో రిలీజ్‌ చేయాల్సి వస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో. ఓటీటీలు అందుబాటులో ఉండటంవల్ల ఈ ప్రాజెక్టు సాధ్యమైంద’ని చెబుతాడు శ్రీకాంత్‌.

శ్రీకాంత్‌ నాగోతి

నలుపూ తెలుపుల కలర్‌ ఫొటో...

ఓటీటీలో వచ్చినా... థియేటర్‌ రిలీజ్‌కి ఏమాత్రం తక్కువ కాని హిట్‌ టాక్‌ అందుకుంది సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కలర్‌ ఫొటో’. బీటెక్‌ చదివిన సందీప్‌ సినిమా అవకాశాల కోసం 2013లో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. మొదట్లో చాయ్‌ బిస్కెట్‌ నిర్మాణ సంస్థ కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ తీసేవాడు.

సందీప్ రాజ్

‘కలర్‌ ఫొటో’ హీరో సుహాస్‌ వాటిలో నటించేవాడు. ‘కలర్‌ ఫొటో’ నిర్మాత సాయి రాజేష్‌ అందించిన కథకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు సందీప్‌. నల్లగా ఉండే ఇంట్రావర్ట్‌ అబ్బాయి తెల్లగా ఉండే చురుకైన అమ్మాయితో ప్రేమలో పడటం ఈ సినిమా కథ. సుహాస్‌, చాందిని చౌదరి హీరో హీరోయిన్లు. రంగు, కులం లాంటి అంశాలపైన దీన్ని తీశారు. దీన్లో సునీల్‌ విలన్‌గా కనిపించడం మరో ప్రత్యేకత.

స్నేహితులే చేతులు కలిపి...

ఓటీటీలో రిలీజైన ప్రేమకథా చిత్రం... ‘మా వింత గాధ వినుమా’. దీని దర్శకుడు ఆదిత్య మండల. ‘క్షణం’... దర్శకుడు రవికాంత్‌ పారెపు దగ్గర ఏడీగా పనిచేశాడు. విశాఖకు చెందిన వీళ్లిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. రవికాంత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’లో హీరోగా నటించాడు సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు రచయిత కూడా. ‘క్షణం’ సినిమాకీ పనిచేశాడు. ఆదిత్య, సిద్ధూలకు ‘క్షణం’ నుంచే పరిచయం. తాను రాసుకున్న ‘మా వింత గాధ...’ కథను ఆదిత్యకు వినిపించాడు సిద్ధు. అతడికి బాగా నచ్చిందని చెప్పడంతో దర్శకత్వ బాధ్యతలూ అప్పగించాడు. వీరి స్నేహితులే నిర్మాతలుగా మారి సినిమా తీశారు. సీరత్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది.

director adithya

దర్శకులే నిర్మాతలై...

సామాన్యుల నుంచి విమర్శకుల వరకూ అందరి ప్రశంసల్నీ అందుకుంటోంది ‘సినిమా బండి’. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఓ ఊళ్లో ఒక వ్యక్తికి వీడియో కెమెరా దొరుకుతుంది. దాంతో సినిమా తీసి, ఊరి కష్టాలు తీర్చాలనుకుంటాడు. అందుకోసం పడ్డ కష్టాలనే సినిమాలో చూపించాడు దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల. ఈ కథని తెలుగువాళ్లైన బాలీవుడ్‌ దర్శక ద్వయం రాజ్‌, డీకేలకు వినిపించాడు ప్రవీణ్‌. వాళ్లకు నచ్చి నిర్మించేందుకు అంగీకరించారు. వైజాగ్‌కు చెందిన ప్రవీణ్‌... ‘వైవా’ బృందంతో కలిసి కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాడు. ఈ సినిమాకి ముందు బెంగళూరులో షార్ట్‌ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీలూ, సినిమాలకు కెమెరామేన్‌గా పనిచేశాడు.

ప్రవీణ్ కండ్రేగుల

కంబాలపల్లి కథలు

పట్టణాలూ పల్లెలకీ కంప్యూటర్‌ అందుబాటులోకి వస్తోన్న 2000 సంవత్సరం నేపథ్యంలో తీసిన సినిమా ‘మెయిల్‌’. కంప్యూటర్‌ కోర్సు చేయాలని తపన పడే ఓ కాలేజీ కుర్రాడి కథ ఇది. తెలంగాణాలోని కంబాలపల్లి అనే ఊళ్లో దీన్ని చిత్రీకరించాడు దర్శకుడు ఉదయ్‌ గుర్రాల. దీన్లో ప్రధానంగా పల్లె జీవనం కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఫొటోగ్రఫీ విభాగంలో డిగ్రీ చేసిన ఉదయ్‌ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా మారాడు. తనలోని దర్శకుణ్ని పరీక్షించుకోవడానికి ‘స్వేచ్ఛ’ అనే షార్ట్‌ఫిల్మ్‌ తీశాడు. తర్వాత మెయిల్‌ కథని స్వప్నాదత్‌కు వినిపించగా నిర్మించేందుకు ఆమె అంగీకరించారు. నటుడు ప్రియదర్శి మినహా అందరూ కొత్తవాళ్లే దీన్లో నటించడం విశేషం.

డైరెక్టర్ ఉదయ్
Last Updated : May 30, 2021, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details