ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నవ్వుకు దూరమైపోతున్నారు. అందుకే లాఫింగ్ క్లబ్‌లు పెట్టుకొని మరి నవ్వుకునే పరిస్థితులు తెచ్చుకున్నారని అంటున్నాడు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. టాలీవుడ్లో వినోదాత్మక చిత్రాలు తీయడంలో ముందుంటాడీ డైరక్టర్. తన కొత్త సినిమా 'తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్ట విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విలేకర్లతో సోమవారం ముచ్చటించాడు. సినిమా విశేషాలను పంచుకున్నాడు.
- ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం?
ప్రస్తుతం డబ్బు సంపాదన, ఉద్యోగ ఒత్తిడులు కారణంగా ప్రతి ఒక్కరూ నవ్వుకు దూరమైపోతున్నారు. సినిమా.. దీనికి ఓ చక్కటి పరిష్కారం చూపుతుందని భావిస్తున్నాను. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, నరేశ్ వంటి హీరోల చిత్రాలు కడుపుబ్బా నవ్వులు పంచేవి. ఇటీవల కాలంలో ఈ తరహా సినిమాల సంఖ్య బాగా తగ్గింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని వినోదాల విందు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిపోతుంది. కుటుంబంతో హాయిగా చూసి నవ్వుకునేలా ఉంటుంది.
- 'తెనాలి రామకృష్ణ' టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు?
తెలివితేటలున్న వాళ్లు లాయర్లు. వారికుండే ప్రధాన లక్షణం.. తిమ్మిని బమ్మిని చేసైనా కేసు గెలవడం. ఇలా చేసేవాడే తెనాలి రామకృష్ణ. అందుకే ఈ పేరు మీదగానే సినిమా టైటిల్ ఖరారు చేశాం. తను ఎంతో ప్రేమించే, గౌరవించే వ్యక్తికి అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఈ రామకృష్ణ ఎలా బయటపడేశాడనేదే ఈ చిత్ర కథాంశం. రామకృష్ణ పాత్రలో చమత్కారం, హాస్యం, సీరియస్‌నెస్‌తో పాటు అన్ని కోణాలు ఉంటాయి.
- 'జాలీ ఎల్‌ఎల్‌బి'కి ఈ సినిమా రీమేక్ అంటున్నారు?
ఈ చిత్రానికి 'జాలీ ఎల్‌ఎల్‌బి'కి ఎలాంటి సంబంధం లేదు. పూర్తిగా కొత్త కథ ఇది. ఎలాంటి గొడవైనా సర్దుకుపోతే ఇబ్బందులుండవు అనే కోణంలో తొలి భాగంలోని హీరో పాత్ర కనిపిస్తుంది. ద్వితియార్థానికి వచ్చేసరికి సర్దుకుపోవడానికి వీలులేని ఓ కేసు కథానాయకుడికి ఎదురవుతుంది. అందులో నుంచి అతడెలా బయటపడ్డాడు? సమస్యను ఎలా పరిష్కరించాడన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఇందులో సందీప్ పాత్ర కొత్తగా ఉంటుంది. తెలివైన లాయర్‌ను అనుకుని భ్రమలో జీవించే ఓ సరదా యువతిగా హన్సిక కనిపిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది.