Tollywood controversy songs: 'ఊ అంటావా మావ.. ఉఊ అంటావా'.. 'పుష్ప' చిత్రంలోని ఈ పాట ప్రస్తుతం యువతను తెగ ఉర్రూతలూగిస్తోంది. ఇంద్రావతి చౌహాన్ గొంతు, డీఎస్పీ మ్యూజిక్, సమంత స్టెప్పులు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. అయితే ఈ సాంగ్ ఓ వైపు ట్రెండింగ్‌లో దూసుకుపోతూనే మరోవైపు విపరీతంగా విమర్శలను ఎదుర్కొంటోంది. పురుషుల స్వభావాన్ని కించపరిచేలా ఇందులో లిరిక్స్ ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ కొనసాగుతుండగానే.. తాజాగా హాట్ బ్యూటీ సన్నీ లియోనీ చిందులేసిన 'మధుబన్' మ్యూజిక్ వీడియోకు కూడా ఇదే సమస్య ఎదురైంది. ఈ పాటను నిషేధించాలని ఉత్తరప్రదేశ్ మథురకు చెందిన పలువురు పురోహితులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో అసభ్యకర స్టెప్పులు ఉన్నాయని వాటిని తొలగించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదితో పాటు గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్న సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం..
దిగు దిగు దిగు నాగ
Digu Digu Naga song: ఈ ఏడాది వివాదస్పదంగా మారిన పాటల్లో 'దిగు దిగు దిగు నాగ' ఒకటి. యువహీరో నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన సినిమా 'వరుడు కావలెను'లోని పాట ఇది. భక్తి పాటను ఐటెమ్ సాంగ్‌గా చేస్తారా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ, ఈ గీతాన్ని తీసేయాలంటూ కేసు కూడా పెట్టారు.
భుజ గోవిందం
యుగంధర్ దర్శకత్వం వహించిన 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాలోని 'భుజ గోవిందం'పై దుమారం చెలరేగింది. భక్తి గీతాన్ని అశ్లీలంగా చిత్రీకరించారనే వాదన వినిపించింది.
'మైసమ్మ' సాంగ్
జానపద గేయాలకు కూడా ఇలాంటి వివాదాలు తప్పలేదు. ఇటీవలే గాయని మంగ్లీ ఆలపించిన మైసమ్మ పాట కూడా కాంట్రవర్సీకి దారి తీసింది. ఈ సాంగ్‌లోని కొన్ని పదాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాటిని తొలిగించి కొత్త పాటను చిత్రీకరించారు.