'ఏందిరా... అబ్బి' అంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన శైలితో కూడిన యాసతో గుర్తింపుపొందారు నటుడు జయప్రకాశ్ రెడ్డి. ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రల్లో కొన్ని వందల చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు హీరో అవ్వాలని కోరిక ఉండేదట. అలా ఓ ప్రయోగాత్మక చిత్రంలో ప్రధానపాత్రలో నటించారు. ఇందులో కేవలం జయప్రకాశ్ రెడ్డి ఒక్కరే పాత్రధారి కావటం విశేషం.
'అలెగ్జాండర్'’ పేరుతో తెరకెక్కిందీ సినిమా. 'ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం' అనేది ట్యాగ్ లైన్. 'చైతన్యరథం', 'ఎర్రమల్లెలు', 'యువతరం కదలింది', 'ఎర్రమట్టి' వంటి విప్లవాత్మక సినిమాలు చేసిన ధవళ సత్యం ఈ సినిమా దర్శకుడు. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. రిటైర్డ్ మేజర్ ఒక హెల్ప్‌లైన్ ద్వారా కొందరి సమస్యలను తీర్చడం కథాంశం.