Sirivennela Seetharama Sastry death: సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని తెలుగు సినిమా పాటలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కష్టమని అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు సంగీతానికి ఆయన పేరు పర్యాయపదంగా మారిపోయిందని చెప్పారు. ఫిలిం ఛాంబర్లో సిరివెన్నెల భౌతికకాయాన్ని సందర్శించుకున్న ఆయన.. అత్యంత గొప్ప వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోయిందని పేర్కొన్నారు.
Venkatesh on Sirivennela Seetharama Sastry
సాహిత్య రంగంలో ఓ దిగ్గజాన్ని కోల్పోయామని అగ్ర కథానాయకుడు వెంకటేశ్ అన్నారు. 'నా కెరీర్ ప్రారంభం నుంచి సిరివెన్నెలతో పనిచేశాను. 'స్వర్ణకమలం' నుంచి మొన్న వచ్చిన 'నారప్ప' వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. సాహిత్య రంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని వెంకటేశ్ పేర్కొన్నారు.
Nagarjuna on Sirivennela
ఫిలిం ఛాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి అగ్ర కథానాయకుడు నాగార్జున నివాళులర్పించారు. సిరివెన్నెలతో స్నేహం ఎప్పటి నుంచో ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకున్నారు.
"'తెలుసా.. మనసా' పాటను ఆయన పక్కన ఉండి రాయించుకున్నాను. నాన్నగారితో కలిసి చేసిన సినిమాలో 'ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా' పాట కూడా శాస్త్రిగారే రాశారు. స్వర్గంలో కూడా దేవుళ్లకు ఇవే పాటలు, మాటలు వినిపిస్తారని అనుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని నాగార్జున పేర్కొన్నారు.