సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ఎవరైనా సరే.. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయులు పోషించిన పాత్ర ఎంతో విలువైంది. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం జరుపుకొంటున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు తమ జీవితాల్లోని గురువులను గుర్తు చేసుకున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు.
"బోధన కేవలం ఓ వృత్తి మాత్రమే కాదు.. అది ఓ బాధ్యత. విద్యార్థులకు ఏ అంశంపై ఆసక్తి ఉందో గుర్తించి, వారిని ఆ మార్గంలో నడిపించగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉంటుంది. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు" -మోహన్‌బాబు
"కొత్త విషయాలు నేర్చుకోవడానికి హద్దంటూ లేదు. కరోనా విజృంభిస్తున్న ఇటువంటి తరుణంలోనూ విద్యార్థులకు అండగా ఉంటూ.. పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నా జీవితంలో నాకు స్ఫూర్తిగా నిలిచిన వారికి, విద్య నేర్చుకునేందుకు సాయం చేసిన ఉపాధ్యాయులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు" -మహేశ్‌బాబు
"ఈ ప్రపంచానికి నువ్వు(ఉపాధ్యాయుడ్ని ఉద్దేశిస్తూ) కేవలం ఓ టీచర్ మాత్రమే కావొచ్చు. కానీ మీ విద్యార్థులకు మాత్రం ఓ హీరో. పిల్లల ఆలోచనల్ని, సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి నా సెల్యూట్. టీచర్లు నిజంగా హీరోలు. మా ఎర్లీ లర్నింగ్ సెంటర్ (ekam) స్కూల్ కోసం పనిచేస్తున్న అద్భుతమైన బృందానికి ధన్యవాదాలు. చిన్నారుల జీవితాల్లో మార్పు తీసుకొని రావడానికి మీరు చూపిస్తున్న చొరవ నాలో స్ఫూర్తి నింపింది." -సమంత
"నా ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. నా ప్రియమైన గౌరికి (మూడేళ్ల క్రితం బెంగళూరులో హత్యకు గురైన పాత్రికేయురాలు) ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నా. కొందరు పిరికి వ్యక్తులు మూడేళ్ల క్రితం నిన్ను మాకు దూరం చేశారు. కానీ ఎటువంటి భయంలేని నీ ఆత్మ మాతోనే ఉంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం" -ప్రకాశ్‌రాజ్