తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పరిశ్రమకు వరాల ఉత్సాహం.. సినీప్రముఖుల హర్షం - నాగార్జున వార్తలు

ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను మంగళవారం నుంచి తెరవడానికి ప్రభుత్వం అనుమతినివ్వడంపై సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తమవుతోంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. జీఎస్టీ రీయింబర్స్​మెట్​ సహా కనీస విద్యుత్​ ఛార్జీల రద్దు తదితర ప్రభుత్వ నిర్ణయాల పట్ల సినీ నటులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

tollywood celebrities thank Telangana CM for his promise to rescue Tollywood from COVID crisis
చిత్రపరిశ్రమకు వరాల ఉత్సాహం.. సినీప్రముఖల హర్షం

By

Published : Nov 24, 2020, 7:32 AM IST

సినిమా థియేటర్లు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకుడికే కాదు... సినీ పరిశ్రమ వర్గాల్నీ ఉత్సాహ పరిచేలా, కరోనా కష్టనష్టాల్ని మరిచి భరోసాతో ముందడుగు వేసేలా తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడం సహా... రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, థియేటర్లకు కనీస విద్యుత్‌ ఛార్జీల రద్దు, ప్రదర్శనల సంఖ్య పెంచుకోవడం, టికెట్‌ ధరల్లో సవరణలు చేసుకునే వెసులుబాటుపై కేసీఆర్‌ ప్రకటన చేయడంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమకు ఈ వరాలు ఊతమిస్తాయని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితోపాటు పలు చిత్రనిర్మాణ సంస్థలు, పలువురు హీరోలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

చిరంజీవి

"కరోనాతో కుదేలైన సినిమా రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సీఎం నేతృత్వంలో ఆయన విజన్‌కు తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీల రద్దు, ప్రదర్శనలు, టికెట్ల ధరల సవరణ వెసులుబాటు చర్యలు పరిశ్రమకు, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి."

- చిరంజీవి, కథానాయకుడు

నాగార్జున

"కరోనాతో నెలకొన్న అనిశ్చితి సమయంలో తెలుగు చిత్రసీమకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టారు కేసీఆర్‌. ఆయనకు కృతజ్ఞతలు."

- నాగార్జున, కథానాయకుడు

డి సురేశ్​ బాబు

"చిత్రసీమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు మాకు సంతృప్తినిచ్చాయి. ఇవన్నీ పరిశ్రమ మరికొంతకాలం సజావుగా మనుగడ సాధించడానికి కారణమవుతాయి. కనీస విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీల్ని రద్దు చేయాలని లాక్‌డౌన్‌ సమయం నుంచి అన్ని రాష్ట్రాలను మేం డిమాండ్‌ చేస్తున్నాం. థియేటర్లను మూసి వేసినప్పుడు, విద్యుత్‌ వాడనప్పుడు ఛార్జీలు కట్టమనడం న్యాయం కాదనే విషయాన్ని మేం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికు తీసుకెళ్లాం. ఆయన వెంటనే స్పందించి రద్దు చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ నిర్ణయం కూడా మంచి పరిణామం. బాగా ఆడే చిన్న సినిమాలకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ప్రదర్శనల్ని పెంచుకునే వెసులుబాటు అనేది సినిమాలతోపాటు ప్రేక్షకులకూ మంచిదే. వీటితోపాటు నిర్వహణ ఛార్జీల్ని కూడా పెంచుకునేలా అనుమతివ్వాలని కోరాం. కరోనా వల్ల శానిటైజర్లు, ఇతరత్రా చర్యలతో థియేటర్ల నిర్వహణ కష్టంగా మారుతోంది. దాన్నీ పరిగణనలోకి తీసుకుంటామని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మా సమస్యల్ని తీసుకెళుతున్నాం. థియేటర్లలో ప్రేక్షకులు యాభై శాతం మంది కాకుండా, 75 శాతమైనా ఉండేలా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం. సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వారం పది రోజుల్లో నెమ్మదిగా తెరుస్తారు. కానీ మన దగ్గర విడుదల చేసుకోవడానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. క్రిస్మస్‌ సమయానికి థియేటర్లు కుదుట పడతాయని భావిస్తున్నాం".

- డి.సురేశ్​బాబు, నిర్మాత

"40 వేల సినీ వర్కర్లకు ఆరోగ్య, రేషన్‌ కార్డులు ఇస్తున్నట్టు సీఎం ప్రకటించడం వల్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 9 శాతం రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. కనీస విద్యుత్‌ చార్జీల రద్దు, ప్రదర్శనలు, టికెట్‌ ధరల్లో వెసులుబాట్లతో వందలాది మంది ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు సంతోషిస్తున్నారు".

- ఎన్‌.శంకర్‌, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు

"కరోనా వల్ల చిత్రసీమ నష్టపోయింది. థియేటర్ల పరిస్థితి బాగోలేదు. ఇలాంటి తరుణంలో కేసీఆర్‌ ఇచ్చిన రాయితీలు, ఆయన తీసుకుంటున్న చర్యలు చిత్రసీమకు ఎంతో మేలు చేస్తాయి. థియేటర్లు తెరుచుకోవచ్చని జీవో గురించి ప్రదర్శనకారులంతా మాట్లాడుకుంటున్నాం".

- సునీల్‌ నారంగ్‌, నిర్మాత, ప్రదర్శనకారుడు

ఇదీ చూడండి... సినిమా హాళ్లు తెరుచుకోవడంపై ప్రభుత్వం ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details