తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జనతా కర్ఫ్యూ'కు సినీ ప్రముఖుల మద్దతు - janatha karfu news

ఆదివారం జరగబోయే 'జనతా కర్ఫ్యూ'ను విజయవంతం చేయాలని పలువురు టాలీవుడ్​ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'జనతా కర్ఫ్యూ'కు సినీ ప్రముఖుల మద్దతు
రాజమౌళి ఎన్టీఆర్

By

Published : Mar 21, 2020, 9:05 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు సినీ ప్రముఖులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ఎన్టీఆర్‌, రాజశేఖర్‌, బోయపాటి శ్రీను తదితరులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభిమానులను, ప్రజలను కోరారు.

జనతా కర్ఫ్యూ

ఇప్పటివరకూ మందులేని కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మందని మోదీ, గురువారం రాత్రి జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అందుకు నాందిగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా 'జనతా కర్ఫ్యూ' పాటించాలని కోరారు.

'ఆదివారం జరిగే 'జనతా కర్ఫ్యూ'లో భాగంగా ప్రతి భారతీయుడు ఇంట్లోనే ఉండాలని, బయటికి రాకూడదని కోరుతున్నా. ఐకమత్యంగా కరోనా వైరస్‌పై పోరాడుదాం' అని రాజమౌళి ట్వీట్‌ చేశాడు.

'కొవిడ్‌-19ను జయించాలంటే మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే 'జనతా కర్ఫ్యూ'ను విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం' అని ఎన్టీఆర్‌ అన్నాడు.

'వీలైనంత వరకు ఇంటిలో ఉందాం. జాగ్రత్తలు తీసుకుందాం. ప్రస్తుతానికి మనకున్న ఒకే ఒక్క పరిష్కారం ఇది. ముందు జాగ్రత్త చర్యలతో ఒకరినొకరం కాపాడుకుందాం. రేపు జరగబోయే 'జనతా కర్ఫ్యూ'లో పాల్గొనడం మర్చిపోకండి. ఈ వైరస్‌తో పోరాడుతున్న మన సైనికులను ప్రశంసిద్దాం' అని రాజశేఖర్‌ ట్వీట్‌ చేశాడు.

ఒకప్పుడు శుభ్రత అవసరమని, ఇప్పుడు బాధ్యతను దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓ వీడియోను షేర్‌ చేశాడు.

'కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శం. మన ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సూత్రాలు మన పెద్దలు మనకిచ్చిన ఆస్తులు. క్రమశిక్షణతో వాటిని పాటిస్తే.. దేన్నైనా ఢీకొట్టగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకానొక సమయంలో శుభ్రత అనేది అవసరం.. ఇప్పుడు బాధ్యత. మోదీ గారికి మద్దతుగా ఉందాం.. ఆయన సూచనల్ని పాటిద్దాం' అని బోయపాటి అన్నాడు.

'ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనమంతా మన ఇళ్లలో ఉందాం. ఈ కష్ట సమయంలో ఐకమత్యంగా పోరాడుదాం. నేను జనతా కర్ఫ్యూను పాటిస్తున్నా.. మీరూ పాటిస్తారని ఆశిస్తున్నా' అని వెంకటేశ్ అభిమానులకు చెప్పాడు.

'రేపు మనమంతా ఇంట్లో ఉందాం. ఏ ఇంట్లో, ఎవరికీ, ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడదాం. మన ఇల్లు, మన దేశం, మన బాధ్యత.. జనతా కర్ఫ్యూ' అని అనిల్‌రావిపూడి ట్వీట్‌ చేశాడు.

'కరోనా వైరస్‌ ఎంతో ప్రమాదకరం. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అందరూ ఎవరి ఇంటిలో వారు ఉండేందుకు ప్రయత్నించండి. మన ప్రధాని జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతు తెలుపుదాం. మన కోసం వైద్యులు ఎంతో కష్టపడుతున్నారు. వారి కోసం చప్పట్లు కొడదాం' అంటూ మంచు మనోజ్ వీడియోను షేర్‌ చేశాడు.

అంతేకాదు మాలీవుడ్‌ హీరో మోహన్‌లాల్‌, కోలీవుడ్‌ హీరో ధనుష్‌, జనతా కర్ఫ్యూకు మద్దతిచ్చారు. ఆదివారం ఇంటిలోనే ఉండాలని అభిమానుల్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details