తెలంగాణ

telangana

భాగ్యనగరికి అండగా మేము సైతమంటూ..

By

Published : Oct 21, 2020, 7:52 AM IST

విపత్తులు ఎదురైన ప్రతిసారీ ప్రజల్ని ఆదుకునేందుకు ముందుండే తెలుగు సినీ తారలంతా మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలు, భాగ్యనగరవాసులకు అండగా నిలిచేందుకు కలిసి కట్టుగా కదిలి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు.

tollywood celebrities donates to CM relief fund for hyderabad floods
భాగ్యనగరికి బాసటగా మేము సైతమంటూ..

"గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కురిసిన కుండపోత వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయలయ్యారని"ని ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు కథానాయకుడు చిరంజీవి. ఈ ప్రకృతి బీభత్సంతో అల్లాడుతున్న వారికోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎవరికి వీలైనంత సాయం వాళ్లు చేయాలని పిలుపునిచ్చారు చిరు.

నాగార్జున, చిరంజీవి
  • "తెలంగాణలో భారీ వర్షపాతం వల్ల సంభవించిన ఈ వినాశనం మనమెప్పుడూ ఊహించనిద"న్నారు మహేశ్​ బాబు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తన వంతుగా రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల తెలియజేశారు.
  • తెలంగాణలో వరద నష్టానికి తన వంతు సాయంగా సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు హీరో ప్రభాస్‌.
  • హీరో నాగార్జున వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం ప్రకటించారు. ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. "భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లో నివసిస్తున్న కొంత మంది జీవితాలు నాశనమయ్యాయి. తక్షణ సహాయక చర్యల కోసం తెలంగాణ సీఎం రూ.550 కోట్లు విడుదల చేయడం ప్రశంసించదగ్గ విషయం. నేనూ నా వంతుగా ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నా" అన్నారు.
    మహేశ్​ బాబు, ఎన్టీఆర్​
  • "వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లో అనేక మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. అందుకే నా వంతు సాయంగా రూ.50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నా" అన్నారు ఎన్టీఆర్‌. ఈ సమయంలో మనమంతా కలిసి హైదరాబాద్‌ను తిరిగి నిర్మించుకుందామని సందేశమిచ్చారు తారక్‌.
  • హీరో రామ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25లక్షలు విరాళం ప్రకటించి.. తెలంగాణ ప్రభుత్వానికి తన మద్దతును, ప్రేమను అందిస్తున్నట్లు తెలియజేశారు.
  • "గతంలో కేరళ, చెన్నైల కోసం ఒక్కటయ్యాం. ఆర్మీ కోసం నిలబడ్డాం. కరోనా కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడ్డాం. ఇప్పుడు మన నగర ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకొద్దామ"ని పిలుపునిచ్చారు విజయ్‌ దేవరకొండ. తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10లక్షలు విరాళం అందిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారాయన.
    రామ్​, విజయ దేవరకొండ

మేము సైతం..

భారీ వర్షాలతో నష్టపోయిన భాగ్యనగర వాసుల్ని ఆదుకునేందుకు కథానాయకులతో పాటు పలువురు అగ్ర దర్శకులు, నిర్మాతలూ ముందుకొచ్చారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత ఎస్‌.రాధాకృష్ణ అండగా నిలిచారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.10లక్షలు విరాళం అందిస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

"హైదరాబాద్‌కు తీరని నష్టం జరిగింది. ఈ సమయంలో బాధితుల సహాయార్థం నావంతు సాయంగా రూ.5లక్షలు విరాళమిస్తున్నా"అని దర్శకుడు హరీశ్​ శంకర్​ పేర్కొన్నారు. "కుండపోత వర్షాల వల్ల నేను నివసిస్తున్న నగరం నా కళ్ల ముందే బాధపడుతుంద"ని ఆవేదన చెందారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. భాగ్యనగరాన్ని ఆదుకునేందుకు తన వంతుగా రూ.5లక్షలు విరాళం ప్రకటించారు.

వరద సహాయక చర్యల కోసం తన వంతుగా రూ.5లక్షలు సాయం ప్రకటించారు నిర్మాత బండ్ల గణేశ్​. వరద బాధితుల కోసం వెయ్యి కేజీల బియ్యంతో పాటు ఐదు వందల దుప్పట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత మహేశ్​ కోనేరు. స్ఫూర్తి ఆర్గనైజేషన్‌ ద్వారా ఈ సాయాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details