ఈటీవీ అంటే తెలుగు జీవితాల్లో ఒక భాగం. తరాలు మారుతున్నా సరే... ప్రేక్షకుల హృదయాల్లో ఆ స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. నిత్యనూతనంగా అందరి మనసుల్నీ దోచేస్తోంది. స్వచ్ఛమైన వినోదాన్ని ఆస్వాదించాలన్నా... హాయిగొలిపే సంగీతం వినాలన్నా... ప్రామాణికతతో కూడిన సమాచారం తెలుసుకోవాలన్నా గుర్తుకొచ్చేది ఈటీవీనే. అప్రయత్నంగా చేయి ఈటీవీ మీట వైపు వెళుతుంది. పాతికేళ్లుగా ఈటీవీ మనందరి టీవీగా కొనసాగుతూ అలరిస్తోంది. ఈటీవీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మన సినీ ప్రముఖులు తమ అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించారు....
"టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, టీవీని 24గంటలు వీక్షించేలా చేసిన ఘనత మన దేశంలో ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు గారికే దక్కుతుంది. ఆయన నాలాంటి వారికి గురుసమానులు, పితృ సమానులు. 25 సంవత్సరాల పాటు ఈటీవీ అప్రతిహతంగా సాగిపోవడానికి ఆయన కృషి, అకుంఠిత దీక్ష కారణం. ఆయన తెలుగు చరిత్ర ఉన్నంతవరకూ గుర్తుండిపోయే గొప్ప లక్ష్య సాధకులు. ఈటీవీ మొదటి వార్షికోత్సవానికి, రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పుడూ విశిష్ట అతిథిగా హాజరయ్యా. ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ వేడుకలోనూ పాలుపంచుకోవటం, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవటం ఎనలేని గౌరవంగా భావిస్తున్నా."
- చిరంజీవి, కథానాయకుడు
"25సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి నా అభినందనలు. ఎన్నో కార్యక్రమాలతో మమ్మల్ని అలరిస్తున్నారు. ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా."
- వెంకటేష్, కథానాయకుడు
"25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ప్రత్యేక శుభాకాంక్షలు. ఈటీవీ రెండున్నర దశాబ్దాల పాటు అంచెలంచెలుగా ఎదగడాన్ని చూస్తే సంతోషంగా ఉంది. రామోజీరావు, ఈటీవీ బృందానికి నా అభినందనలు."
- మహేశ్‌బాబు, కథానాయకుడు
"1995నుంచి 2020. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఈటీవీ. ఈటీవీ అంటే ఒక సంచలనం. 1995-96 మధ్య కాలంలో ఫలానా సమయానికి ఫలానా కార్యక్రమం వస్తుందని తెలుసుకుని ఈటీవీ పెట్టుకుని టీవీ ముందు కూర్చునేవాణ్ని. నాకు బాగా నచ్చిన కార్యక్రమం...పాడుతా తీయగా. సినిమాలోని పాటలు చూసినప్పుడు ఆ పాటలు మళ్లీ చూడాలనిపిస్తోంది. చూసే అవకాశం ఉండదు. ఈటీవీలో ఆ పాటలు చూడటం నాకు బాగా గుర్తు. స్నేహితులతో కూడా మాట్లాడుకునేవాళ్లం. అలాగే ఈటీవీ న్యూస్... నాటి నుంచి నేటి వరకు ఈటీవీ న్యూస్ అంటే అదో స్టాంప్. నిజమైన, ప్రామాణికమైన సమాచారానికి ఈటీవీ ఒక స్టాంప్. ఇప్పుడు కూడా అంతే."
- నాగార్జున, కథానాయకుడు
"దక్షిణాదిన తొలి శాటిలైట్ ఛానల్ ఈటీవీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నా శుభాభినందనలు. నంది అవార్డులతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను ఈటీవీ అందుకుంది. గోల్డెన్‌జూబ్లీతో పాటు మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఈటీవీ సిబ్బందికి నా ప్రత్యేక శుభాభినందనలు".
- పవన్‌కల్యాణ్, కథానాయకుడు
"అన్నదాతలకు, మహిళలకు, తెలుగు భాష అభివృద్ధికి, వంటలకు, సంగీత ప్రియులకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేసి... ఈటీవీ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 20ఏళ్ల క్రితం నా మొదటి సీరియల్ శాంతినివాసంతో ఈటీవీతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు మా ద్వారా ఈటీవీ చేయించినందుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లోనూ మన ప్రయాణం ఇలాగే సాగాలని కోరుకుంటున్నా".