తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉషోదయాన.. తారల ఆశోదయం! - కొత్త ఏడాదిలో రకుల్

2021... ఎన్నో కలలను, మరెన్నో ఆశయాలను, ఇంకెన్నో ఆనందాలను.. తోరణాలుగా కట్టి మనల్ని స్వాగతించింది నేటి సూర్యోదయంలా..! ఇక ఈ సరికొత్త డైరీని అందంగా నింపుకోవడమే మన కర్తవ్యం. మేం అదే పనిలోనే ఉన్నామని చెబుతున్నారు మన కథానాయికలు. రంగుల ప్రపంచంలో తారాజువ్వల్లా వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మలు గతేడాదిలో నేర్చుకున్న పాఠాలేమిటో? కొత్త యేడాది కోసం తీసుకున్న నిర్ణయాలేమిటో? ఓసారి చూద్దాం.

Tollywood actresses new year plans
ఉషోదయాన.. తారల ఆశోదయం!

By

Published : Jan 1, 2021, 6:57 AM IST

2020... ఎన్నో జ్ఞాపకాల్ని, మరెన్నో భావోద్వేగాల్ని, ఇంకెన్నో విషాదాల్ని భారంగా మోసుకుంటూ నిష్క్రమించింది నిన్నటి సూర్యాస్తమయంలా..! అయితే... రంగుల ప్రపంచంలో ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ముందడుగు వేస్తున్న సినీతారలు కొత్త ఏడాది నేపథ్యంలో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

గ్యాంగ్‌తో గోవాలో

కొత్త యేడాదికి స్వాగతం పలికేందుకు తన స్నేహితులతో కలిసి గోవా వెళ్లింది రష్మిక మందన్న. నా గోవా గ్యాంగ్‌తో కలిసి ఒక అందమైన ప్రదేశంలో గడుపుతున్నానని ఇన్‌స్టా ద్వారా ఆమె చెప్పింది. సెలవుల కోసం ఆ గ్యాంగ్‌తో కలిసి తరచూ అక్కడికే వెళుతుంటుంది రష్మిక. కొత్త యేడాది సందర్భంగా తీసుకున్న నిర్ణయాలంటూ ఏమీ లేవని చెప్పుకొచ్చిందామె. '2020 కోసం చేసుకున్న తీర్మానాలు ఏమయ్యాయో తెలుసుగా?' అంటూ నవ్వేసింది రష్మిక. "సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయింది. నా జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని అందరికీ తెలుసు. ఇది కొత్త యేడాది. కలలు కనండి. చేయాలనుకున్నది చేయండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి" అంటూ సెలవిచ్చింది రష్మిక.

రష్మిక మందాన

గంగా తీరాన

చాలా యేళ్ల తర్వాత అమ్మానాన్నలతో కలిసి కొత్త యేడాదికి స్వాగతం చెబుతున్నా అంటోంది లావణ్య త్రిపాఠి. సంబరాల కోసం తల్లిదండ్రులతో కలిసి, గంగానది తీరంలోని ఓ రిసార్ట్‌కి వెళ్లింది లావణ్య. "అమ్మానాన్నలతో కలిసి గడిపేందుకు ఇంతకుమించిన అందమైన ప్రదేశం మరొకటి ఉండదేమో" అంటూ కొత్త యేడాది ప్రణాళికల్ని వివరించింది.

"2020 చాలా విషయాల్ని నేర్పింది. ముఖ్యంగా జీవితం ఎంత చిన్నదో, ఇక్కడ మనం ఎంత బాధ్యతగా ఉండాలో అర్థమయ్యేలా చేసింది. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది. ఒక రకంగా గతేడాది నేర్చుకున్న కొత్త పాఠాలతో, ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నట్టుగా ఉంది. యోగా చేయడం మొదలు పెట్టా. ఆ అలవాటుని కొనసాగిస్తా" అని చెప్పింది.

లావణ్య త్రిపాఠి

గొప్ప పాఠాలు

"2020 అందరికీ ఎన్నో కష్టాలు కలిగించింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. ఏడాది ఆరంభంలో మూడు చిత్రాలకు సంతకాలు చేశా. ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా..మార్చిలో లాక్‌డౌన్‌ పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్ని రోజులు ఏం చెయ్యాలి? ఏంటి? అని మైండ్‌ బ్లాక్‌ అయిపోయినట్లయింది. కానీ, కుటుంబంతో కలిసి హ్యాపీగా గడిపే అవకాశమొచ్చినందుకు సంతోషంగా అనిపించింది. 'మనం ఎంత గొప్ప వాళ్లమైనా.. జరిగే దాన్ని మార్చలేం' అని అర్థమైంది. అందుకే అందరూ ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి" అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్‌.

అనుపమ పరమేశ్వరన్

కుటుంబంతో హైదరాబాద్‌లోనే

"కొవిడ్‌ - 19 నెగిటివ్‌ సాధించి 2020కి ముగింపు పలికా. జనవరి 2 నుంచే మళ్లీ చిత్రీకరణలతో బిజీ అయిపోతాను. కొన్నాళ్లపాటు సెలవులు లేకుండా పని చేయాల్సి ఉంటుంది. గతేడాది చాలా విషయాల్నే నేర్పింది. ఎంత డబ్బు, ఎంత పేరు ఉన్న వాళ్లయినా కరోనా వల్ల ఇళ్లకే పరిమితమయ్యారు. అందరూ సమానమే అనే సంకేతాన్నిఇచ్చింది కరోనా మహమ్మారి. వాసన, రుచిని కోల్పోయేలా చేసే కరోనా...మనమేమిటో ఒకసారి మనకి తెలియజేసింది. రుచుల్ని ఆస్వాదిస్తున్న మనం కృతజ్ఞతతో ఉండాలనే విషయాన్ని చాటిచెప్పింది. కొవిడ్‌ పరీక్షల్లో నాకు పాజిటివ్‌ అని తేలాక నా కోసం మా అమ్మ హైదరాబాద్‌కి వచ్చింది. మా నాన్న ఇక్కడే ఉన్నారు. వాళ్ల మధ్యే కొత్త ఏడాది సంబరాల్ని జరుపుకోనున్నా" అని చెప్పింది రకుల్‌.

రకుల్ ప్రీత్ సింగ్

చాలా నేర్పింది

"నా కలలు, కళ, నా మనసు, నా నమ్మకాలు..ఇలా 2020 నా గురించి నాకు చాలానే నేర్పించింది. ఈ విశ్వం నుంచి నేను నేర్చుకున్న పాఠాలకిగానూ ఎంతో కృతజ్ఞతతో ఉన్నా. మరిన్ని పాఠాల్ని నేర్చుకునేందుకు, మరిన్ని మలుపుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా" అని శ్రుతి హాసన్ చెప్పింది.

శ్రుతి హాసన్

ఇదీ చదవండి:ఇది పోరాటం కాదు.. మహా సంగ్రామం..

ABOUT THE AUTHOR

...view details