Tollywood Actress: వేగానికి ప్రతి రూపాలు కథానాయికలు. హిట్టు మాట వినిపించడమే ఆలస్యం.. వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటారు. చేతిలో ఎన్ని చిత్రాలున్నా.. మరో మంచి కథ దొరికిందంటే చాలు పచ్చజెండా ఊపేస్తుంటారు. సమంత, కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక, కృతి శెట్టి తదితరులంతా ఇప్పుడిదే తరహాలో జోరు చూపిస్తున్నారు. అయితే కొందరు నాయికలు సినిమాల విషయంలో కాస్త నెమ్మదించారు. సరైన కథల కోసం ఎదురు చూస్తూ కొందరు.. ఆచితూచి ముందడుగేయాలన్న ఉద్దేశంతో మరికొందరు.. కొత్త కబురు వినిపించడంలో ఆలస్యం చేస్తున్నారు.
- గ్లామర్ పాత్రలతో మెప్పిస్తూనే.. అవకాశం దొరికినప్పుడల్లా నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనూ సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తోంది. ఇంత వరకు తెలుగులో మరో కొత్త చిత్రమేది ప్రకటించలేదు. ఆ మధ్య ఇద్దరు అగ్ర హీరోల చిత్రాల విషయంలో రకుల్ పేరు వినిపించినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం తాను పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదని, సవాల్ విసిరే పాత్రల కోసమే ఎదురు చూస్తున్నాని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పుడిందుకు తగ్గ సరైన కథ కోసమే ఆమె వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ నటించిన హిందీ చిత్రాలు 'అటాక్', 'రన్‌వే 34' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
- నటనా ప్రాధాన్యమున్న నాయిక పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన కథానాయిక సాయిపల్లవి. కెరీర్ ఆరంభం నుంచి కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్న ఈ అమ్మడు.. ఇటీవలే 'శ్యామ్ సింగరాయ్'తో పలకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'విరాటపర్వం'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. నిజానికి ఇవన్నీ మూడేళ్ల క్రితం ఒప్పుకొన్న ప్రాజెక్ట్‌లే. వీటి తర్వాత ఆమె తెలుగులో మరో కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. ప్రస్తుతం కొన్ని కథలు చర్చల దశలో ఉన్నట్లు ఆ మధ్య తెలిపినా..వాటిపై ఇంత వరకు ఏ స్పష్టత ఇవ్వలేదు.
- 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన నాయిక నిధి అగర్వాల్. ఈ సంక్రాంతికి 'హీరో'తో బాక్సాఫీస్ ముందు సందడి చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు జోడీగా 'హరి హర వీరమల్లు'లో నటిస్తోంది. దీని తర్వాత ఆమె చేయనున్న కొత్త చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఏప్రిల్ నుంచి ఓ హిందీ సినిమా ప్రారంభించనున్నట్లు ఆ మధ్య వెల్లడించింది.
- 'నన్ను దోచుకుందువటే', 'ఇస్మార్ట్ శంకర్' వంటి విజయాలతో తెలుగు వారికి దగ్గరైన కన్నడ కస్తూరి నభా నటేష్. గతేడాది ఆఖర్లో 'మ్యాస్ట్రో'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అమ్మడు.. ఇప్పటి వరకు తెలుగులో మరో కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. ఆ మధ్య ఓ యువ హీరో సినిమా విషయంలో ఆ పేరు ప్రచారంలోకి వచ్చినా.. అది కార్యరూపంలోకి రాలేదు.
- 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో తొలి అడుగులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన భామ మెహ్రీన్. గతేడాది 'మంచి రోజులు వచ్చాయి' సినిమాతో సినీప్రియుల్ని పలకరించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం 'ఎఫ్3'తో నవ్వులు పంచేందుకు సిద్ధమవుతోంది. దీని తర్వాత ఆమె తెలుగులో చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. తెలుగులో కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లు ఒప్పుకొన్నట్లు మెహ్రీన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంత వరకు దేనిపైనా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆమె కన్నడలో శివరాజ్‌కుమార్‌తో కలిసి ఓ సినిమా చేయనుంది.