కరోనా లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైంది టాలీవుడ్ అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్. ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పిందీ అందాల ముద్దుగుమ్మ.
"మానసికంగా ఫిట్‌గా ఉండేందుకు నేను రెండు మార్గాలు ఎంచుకున్నా. మెదడును చురుగ్గా ఉంచడం కోసం ఆన్‌లైన్‌లో చెస్ నేర్చుకుంటున్నా. ఈ ఆటపై అవగాహన ఉంది కానీ పూర్తిస్థాయిలో పట్టు లేదు. ఇప్పుడు ఎత్తులకు పైఎత్తులతో ఎవరినైనా బోల్తా కొట్టించగలనని అనిపిస్తోంది. ఇక మనసును ఉత్తేజంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటున్నా. రోజూ ఇంట్లో అమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇతిహాసాల గురించి కాసేపైనా చర్చిస్తున్నా. అమ్మమ్మ భాగవత కథలను చక్కగా చెబుతోంది. నేను శ్రద్ధగా భగవద్గీత శ్లోకాల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఇలాంటి సమయంలోనే దూరదర్శన్‌లో రామాయణ్, మహాభారత్ సీరియళ్లను పునఃప్రసారం చెయ్యడం భలే కలిసొచ్చింది. వాటిని బాగా ఆస్వాదిస్తున్నా"