వరుస సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ హీరోలు నిర్మాణ రంగంపై తమదైన ముద్రవేస్తున్నారు. అటు హీరోలుగా సినిమాల్లో నటిస్తూనే ఇటు నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ అగ్ర, యువ హీరోలు నిర్మాతలుగా మారి మంచి విజయాలను అందుకున్నారు. మరికొందరు నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మాతలుగా మారిన హీరోలపై ఓ లుక్కేద్దాం!
తండ్రి హీరోగా తనయుడు నిర్మాతగా
'ఖైదీ నంబర్ 150' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంతో రామ్‌చరణ్ నిర్మాతగా మొదటి అడుగు వేశాడు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్లకు పైగా వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా. చిరంజీవి 'సైరా'కు చెర్రీనే నిర్మాత. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌ను పెట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చిరు-కొరటాల శివ మూవీ 'ఆచార్య'కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
'శ్రీమంతుడు'తో మొదలు పెట్టి
'శ్రీమంతుడు'తో నిర్మాతగా మారాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్) పతాకంపై తెరకెక్కిన ఆ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం' మహేశ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇటీవల విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు'తో కథానాయకుడిగానే కాకుండా నిర్మాతగానూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు అడివి శేష్ 'మేజర్'కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
యువ దర్శకులను ప్రోత్సహించేందుకు
విభిన్నకథతో తీసిన చిత్రం 'అ!'తో నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ సినిమా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. కాజల్, రెజీనా, నిత్యామేనన్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా.. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకప్ విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. విశ్వక్‌సేన్ 'హిట్'తో ఈ ఏడాది నిర్మాతగా నాని మంచి విజయాన్ని అందుకున్నాడు. మంచి కథలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించడానికి తాను ముందుంటానని ఇటీవలే చెప్పుకొచ్చాడు నాని.
సరికొత్త ప్రయత్నం
'అర్జున్ రెడ్డి'తో అభిమానుల రౌడీగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి 'మీకు మాత్రమే చెప్తా'ను నిర్మించాడు. 'పెళ్లి చూపులు'తో తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్‌ను కథానాయకుడిగా పరిచయం చేశాడు.
రీఎంట్రీతో రెండు బాధ్యతలు
'అహం బ్రహ్మస్మి' సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు కథానాయకుడు మంచు మనోజ్. 'ఒక్కడు మిగిలాడు' సినిమా తర్వాత దాదాపు మూడేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్.. గతేడాది ఎంఎం ఆర్ట్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు హీరోగా 'అహం బ్రహ్మస్మి' చిత్రాన్ని ఈ బ్యానర్‌పైనే మంచు నిర్మలా దేవి, మంచు మనోజ్ నిర్మిస్తున్నారు.