శ్రీముఖి ప్రధానపాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ 'క్రేజీ అంకుల్స్' సినిమాలో కీలకపాత్ర పోషించిన రాజారవీంద్ర ఆ సినిమా విశేషాలతో పాటు.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
- నేను గతంలో జయసుధగారితో 'ఆంటీ' అనే సినిమా చేశా. జనరేషన్ గ్యాప్ రావడం వల్ల ఇప్పుడు అంకుల్స్ అయ్యాం(నవ్వుతూ). మంచి ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ ఇది. కరోనా వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌లో కొంతకాలంగా మంచి సినిమాలు రావడం లేదు. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. థియేటర్‌కు వచ్చిన వారంతా కరోనాను మరిచిపోయి హాయిగా నవ్వుకుంటారు.
- ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే. 50ఏళ్ల వయసున్న వ్యక్తికి పెళ్లయి.. పిల్లలు పుట్టి.. వాళ్లకు కూడా పిల్లలు పుట్టి.. సమయం అంతా మనవలు, మనవరాళ్లతో ఆడుకునేందుకే సరిపోతుంది. ఆ తర్వాత భార్య, భర్త మధ్య కాస్త గ్యాప్ వస్తుంది. ఆ సమయంలో చిన్న ఆనందం కోసం ఫేస్‌బుక్, వాట్సాప్ ఛాటింగ్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్ని తప్పులు చేశాడన్నదే నా పాత్ర.
- రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నేను కనిపించనున్నా. మనోగారిది బంగారం దుకాణం, భరణిగారు వడ్డీ వ్యాపారం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. భవిష్యత్తులో మనం ఎలా ఉండాలనే యాంగిల్లో యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
- ఈ సినిమాలో కొత్తకోణం ఏంటంటే.. ముగ్గురు మధ్య వయసున్న వ్యక్తులు కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేయడం సరదాగా ఉంటుంది. ముగ్గురూ స్నేహితులు కావడం.. ఒకరికి తెలియకుండా.. ఒకరు అమ్మాయిని పడేయాలని చూడటం బాగా కట్టుకుంటాయి.
- సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం ఉండవు. కుటుంబంతో సహా చూడగలిగే సినిమా ఇది. యాంకర్‌గా శ్రీముఖి అందరికీ తెలిసిన వ్యక్తే. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మనోగారితో పాటు కొన్ని షోలు కూడా చేసింది. మాకు కూడా కొత్తేం కాదు. అందరం కలిసి సరదాగా ఆడుతూపాడుతూ ఈ సినిమా చేశాం.
- నేను చేసిన సినిమాల్లో విలన్ పాత్రలే ఎక్కువ. అయితే.. నేను బయట చాలా సరదాగా ఉండే మనిషిని. నా అప్పీరెన్స్ ఎలాగూ విలన్‌లాగే ఉంటుంది(నవ్వుతూ). కాబట్టి.. సీరియస్ పాత్రలు చేయాలంటే కేవలం డైలాగ్స్ చెబితే సరిపోతుంది. కానీ కామెడీ విషయంలో అలా ఉండదు. మంచి టైమింగ్ ఉండాలి. నిజానికి కామెడీ పాత్రలు చేయడం చాలా కష్టం. గతంలో 'ఆంటీ' సినిమాలో కామెడీ పాత్ర చేశా. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో చేశాను.
- కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎవరికి వైరస్ వచ్చినా అందరికీ ఇబ్బందే. సినిమా షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి. అందుకే వేగంగా పూర్తి చేశాం. మొదట ఈ సినిమాను ఓటీటీకి ఇద్దాం అనుకున్నాం. సినిమా థియేటర్‌కు వెళితేనే బాగుంటుంది అనిపించింది. అందుకే థియేటర్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమాలో పోసానిగారి పాత్ర కూడా చాలా నవ్విస్తుంది.
- నాకు సినిమా అంటే పిచ్చి. ఒకవేళ సినిమా అవకాశాలు లేకపోతే.. ఆర్టిస్టులకు, టెక్నిషియన్లకు కాఫీ, టీ ఇచ్చుకుంటూ ఇక్కడే బతుకుతానని ఎన్నోసార్లు చెప్పా. నా దగ్గరికి వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని నేను వదులుకోను. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని ఏం పెట్టుకోను.
- నా విషయానికొస్తే నా కెరీర్‌లోనే ఎక్కువ సినిమాలు చేసింది కరోనా సమయంలోనే. నాకు తెలిసి హైదరాబాద్‌లో 100నుంచి 120 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఓటీటీ రావడం వల్ల అవకాశాలు ఇంకా పెరిగాయి. రెమ్యునరేషన్ కూడా ఎవరికి తగ్గలేదు. పెరిగిందనే చెప్పాలి. నేను మొదటి నుంచి జీవితాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ ప్రభావం నా కెరీర్ మీద పడిందనుకుంటా(నవ్వుతూ). ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నా సమయం లేదు.
- ఈవీవీ సత్యనారాయణగారు గొప్ప డైరెక్టర్. ఎందుకంటే.. ఆయన పెద్ద స్టార్లతో సినిమాలు చేసి.. ఆ తర్వాత చిన్నచిన్న సినిమాలు కూడా చేసేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. చిన్న సినిమాలకు పెద్ద డైరెక్టర్లు రావడం లేదు. చిన్న సినిమాలను తీసిన పెద్ద డైరెక్టర్ ఈవీవీ ఒక్కరే.
- 'ఆచార్య'లో ఒక మంచి పాత్ర చేశా. 'రోజ్ విల్లా' అనే చిత్రంలో కీలకపాత్రతో పాటు సొహైల్ సినిమాలో కూడా మంచి పాత్ర చేస్తున్నా. టీవీలకు కూడా అతిథిగా చేస్తున్నా. వెబ్‌సిరీస్‌ల్లో కూడా నటిస్తున్నా. ఈ వయసులో డైరెక్షన్, ప్రొడక్షన్ అంటే రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుతానికి నటనకే పరిమితం కావాలనుకుంటున్నా.
- ఓటీటీలో సినిమా హిట్టా, ఫట్టా అనే విషయాన్ని అంచనా వేయలేం. సినిమా ఫలితాన్ని నిర్ణయించేది థియేటర్ మాత్రమే. థియేటర్లను బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కోసం ఓటీటీకి సినిమాలు ఇస్తూ వెళ్తే ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సినిమా మీద ఆధారపడి ఎంతోమంది ఉన్నారు.. అని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.