తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రోజా: వెండితెరపై తారగా.. రాజకీయాల్లో రాణిగా - తెలుగు సినిమా వార్తలు

ఇటు వెండితెర...అటు రాజకీయాల్లో రాణిస్తూ ఇప్పటికీ అభిమానుల మెప్పు పొందుతున్న నటి, నాయకురాలు రోజా. స్వతంత్ర శైలితో ముందుకు దూసుకుపోయిన ఆమె నైజమే.. రోజాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే బుల్లితెరపై జబర్దస్త్​​ టీవీషోలో జడ్జ్​గా వ్యవహరిస్తున్న నవ్వుల రోజా పుట్టిన రోజు నేడు.

వెండితెరపైనే తారగా... రాజకీయాలలో రాణిగా

By

Published : Nov 17, 2019, 9:46 AM IST

Updated : Nov 17, 2019, 12:05 PM IST

నటనతో వెండితరపై మెప్పిస్తూ.. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఇప్పటికీ తన ఉనికి చాటుకుంటున్న వ్యక్తి రోజా. పూర్తి పేరు రోజా సెల్వమణి. ఇటు చిత్ర సీమలో, అటు రాజకీయాలలో మొదట మాటలు పడ్డా, తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని విజయాల బాటపట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూ, మరో వైపు జబర్దస్త్​ కామెడీ షోలో జడ్జ్​గా వ్యవహరిస్తున్న నవ్వుల రోజా పుట్టిన రోజునేడు. ఆమె జన్మదినం సందర్భంగా కొన్ని రోజా జీవితంలోని ఆసక్తికర విషయాలు మీకోసం.

రోజాగా మారిన శ్రీలత

రోజా 1972, నవంబర్‌ 17న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో నాగరాజరెడ్డి, లలిత దంపతులకు జన్మించారు. రోజాకు కుమారస్వామి రెడ్డి, రామప్రసాద్‌ రెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. కొన్నాళ్ల తరువాత వీరి కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. రోజా అసలు పేరు శ్రీలత. రోజా కూచిపూడి నాట్యం నేర్చుకొన్నారు. సినిమాల్లోకి రాకముందు ప్రదర్శనలు చేసేవారు.

సినీ ప్రస్థానం

తెలుగు సినిమాతో మొట్టమొదటిసారి చిత్రసీమకు పరిచయమయ్యారు రోజా. సర్పయాగం అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్​ సరసన నటించిన 'ప్రేమ తపస్సు' సినిమా రోజాకు తెలుగులో రెండవ సినిమా. 1991నుంచి 2002 వరకు దక్షిణ భారత చిత్ర సీమలో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలోనూ రోజా అనేక సినిమాల్లో నటించారు. ఆర్​కే సెల్వమణి దర్శకత్వంలో ప్రశాంత్​, రోజా హీరోహీరోయిన్లుగా చెంబుమతి సినిమాలో నటించారు.

రోజాకు తమిళంలో మొదటి సినిమా ఇది. ఈ మూవీ విజయం సాధించడం వల్ల రోజాకు తమిళ్​స్టార్​ శరత్​ కుమార్​తో 'సురియన్'​ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా ఘన విజయం పొంది తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ముఠా మేస్త్రీ, భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం, అన్నమయ్య, అన్న, పెద్దన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శుభలగ్నం, శ్రీ కృష్ణార్జున విజయం వంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రజినీకాంత్​, చిరంజీవి, బాలకృష్ణ, విష్ణువర్ధన్​, రవిచంద్రన్​, కృష్ణ, మమ్ముట్టి, శరత్​ కుమార్​, అక్కినేని నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించింది రోజా. ఇలా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమా పరిశ్రమలలో మొత్తం 100 సినిమాలకు పైగా నటించారు.

రాజకీయ ప్రస్థానం

1999లో తెలుగు దేశంలో చేరిన రోజా.. ఆ పార్టీ తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో టీడీపీని వదిలి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మరోసారి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయదుందుభి మోగించారు. ప్రస్తుతం రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

బుల్లితెరపై

ఈటీవీలో ప్రసారమవుతోన్న జబర్దస్త్‌ షోకు రోజా.. జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో లక్కా కిక్కా అనే షోకి హోస్ట్‌ చేశారు రోజా. తమిళనాడులో ఈ షో భారీ విజయం అందుకొంది. కుటుంబ సమస్యలు పరిష్కరించే టీవీ షో బతుకు జట్కాబండికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వ్యక్తిగత జీవితం

తమిళ సినిమా దర్శకుడైన ఆర్​.కె. సెల్వమణిని రోజా 2002, ఆగష్టు 10న వివాహమాడారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఎన్నో పురష్కారాలు

1991లో ‘సర్పయాగం’ సినిమాకు నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకొన్నారు. 1994లో ‘అన్న’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును సంపాదించుకున్నారు. 1998లో ‘స్వర్ణక్క’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ‘ఉన్నిదతిల్‌ ఎన్నై కొడుతేన్‌’ అనే తమిళ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చిత్ర పురస్కారాన్ని 1998లో అందుకొన్నారు. ఇదే సినిమాకు ఉత్తమ నటిగా సినిమా ఎక్సప్రెస్‌ తమిళ్‌ పురస్కారాన్ని సొంతం చేసుకోగలిగారు. 2013లో ‘మోడరన్‌ మహాలక్ష్మి’ అనే టీవీ షోకి ఉత్తమ యాంకర్‌గా మాటీవీ అవార్డును అందుకొన్నారు. 2018లో ఎవర్గీన్ర్‌ హీరోయిన్‌గా జీ తెలుగు అప్సర అవార్డును అందుకొన్నారు.

ఇవీ చూడండి.. 'మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు..'

Last Updated : Nov 17, 2019, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details