కణకణ మండే నిప్పుకణాల్లాంటి సినిమాలకు ఆయన రూపకర్త. వ్యధార్త జీవుల యదార్థ గాథలకు వెండితెరరూపమిచ్చే సృష్టికర్త. నేటి భారతంలోని సరికొత్త పర్వాల సిగ్గుమాలినతనాన్ని నిగ్గదీసి అడిగే సృజనశీలి. వందేమాతర గీతం వరుస మారకూడదని, జాతి జీవనం సుభిక్షంగా ఉండాలని తాపత్రయపడ్డ వ్యక్తి ఆయన. ఆయనే... తెలుగులో విప్లవాత్మక దర్శకుడిగా గుర్తింపు పొందిన తొట్టెంపూడి కృష్ణ. ఈ దర్శకుడు తెరకెక్కించిన 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు', 'నేటి భారతం' వంటి సినిమాలు పురస్కారాలనూ అందుకున్నాయి. ఈతరం పిక్చర్స్ బ్యానర్‌పై పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు టి.కృష్ణ (అక్టోబర్ 21, 1986) వర్ధంతి నేడు.
నేపథ్యం
ఒంగోలు ప్రాంతంలోని టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో జనవరి 1, 1950న జన్మించారు. తల్లితండ్రులు తొట్టింపూడి వెంకటసుబ్బయ్య, రత్తమ్మ.
కెరీర్
డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాల్లో దర్శకునిగా రాణించాలని నిర్ణయించుకుని 1972లో గుత్తా రామినీడు దగ్గర 'తల్లీ కూతుళ్లు' చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. కానీ అక్కడి సినిమా వాతావరణం నచ్చక సొంతూరికి వచ్చేసి తన మామ నిర్వహిస్తున్న పొగాకు వ్యాపారం చూసుకుంటూ ఉండేవారు. అభ్యుదయ భావాలు గల కృష్ణ తనే సొంతంగా కథలు తయారు చేసుకొని వాటిని ఎవరికి ఎలా చెప్పాల్లో, ఎలా తీయాలో ఆలోచిస్తూ ఉండేవారు. అప్పట్లో నిడదవోలుకి వ్యాపార నిమిత్తం వస్తూపోతూ ఉండేవారు. అక్కడ ఒంగోలుకి చెందిన పోకూరి బాబురావు ఆంధ్రాబ్యాంక్‌లో పనిచేస్తూ ఉండేవారు. అతనితో టి.కృష్ణ సినిమాల గురించి చర్చలు జరిపేవారు. ఇద్దరూ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నటుడు మాదాల రంగారావు తీసిన 'యువతరం కదిలింది' చిత్రానికి టి.కృష్ణ, బాబురావులు నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు.
దర్శకత్వ బాధ్యతలు
తొలిసారి పోకూరి బాబురావు నిర్మాతగా ఈతరం పిక్చర్స్ పతాంకపై 'నేటిభారతం' చిత్రానికి దర్శకత్వం వహించారు కృష్ణ. ఈ సినిమా 1983లో పూర్తయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు, ఉత్తమ దర్శకుడిగా టి.కృష్ణకి, ఉత్తమ గేయరచయితగా శ్రీశ్రీకి నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత 1984లో 'దేశంలో దొంగలు పడ్డారు' చిత్రానికి దర్శకత్వం వహించారు.
'ప్రతిఘటన' అలా మొదలైంది
అప్పట్లో మద్రాసులోని టి.కృష్ణ తనతోటి మిత్రులతో కలిసి పాండిబజారులో ఓ కథ గురించి చర్చిస్తూ ఉన్నారు. పక్కనే భోజనం చేస్తున్న ఉషాకిరణ్ మూవీస్‌కి సంబంధించిన అట్లూరి రామారావు వీళ్లు చర్చించుకుంటున్న వాదన అంతా వింటున్నారు. టి.కృష్ణ వాదనలోని నిబద్ధతను గమనించి వాళ్లతో మాటలు కలిపిన రామరావు.. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ అధిపతి, నిర్మాత రామోజీరావుకి టి.కృష్ణను పరిచయం చేశారు. అప్పుడే ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావు.. రాజకీయ గుండాల అరాచక చర్యల మీద చిత్రం తీయాలని అనుకోవడం, దానికి టి.కృష్ణ దర్శకత్వం వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆ చిత్రమే 'ప్రతిఘటన'.