చిత్రసీమలో కళ మొదలైంది. లాక్‌డౌన్ కారణంగా బోసిపోయిన పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. అగ్ర నాయకుల నుంచి డెబ్యూ నటుల వరకు అందరూ కొత్త చిత్రాలు మొదలెడుతున్నారు. వాయిదా పడిన కథల్ని పునఃప్రారంభిస్తున్నారు. మంగళవారం మూడు కొత్త చిత్రాలకు ముహూర్తం కుదిరింది.
అమలాపురంలో 'కోతి కొమ్మచ్చి'
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న కథానాయకులుగా తెరకెక్కుతోన్న చిత్రం 'కోతి కొమ్మచ్చి'. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసరాల్లో నేడు చిత్రీకరణ మొదలైంది. రిద్ధి కుమార్, మేఘ చౌదరి నాయికలు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ స్వరాలు సమకూరుస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్ పతాకంపై ఎమ్‌ఎల్వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
రాజ్ తరుణ్ 15వ చిత్రం
రాజ్ తరుణ్ 15వ చిత్రాన్ని శాంటో (మోహన్ వీరంకి) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. వెన్నెల కిశోర్ కీలక పాత్రధారి. పూజా కార్యక్రమాలతో నేడు లాంఛనంగా మొదలైందీ చిత్రం. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం: స్వీకర్ అగస్థి.
సెహరి
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు హర్ష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సెహరి'. విర్గో పిక్చర్స్ పతాకంపై అద్వైయ జిష్ణురెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. జ్ఞానసాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ తనయుడు బాబీ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టారు. సెహరి టైటిల్‌ను దిల్ రాజు ఆవిష్కరించారు. హర్ష్ సరసన సిమ్రన్ చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కథానాయకుడి తండ్రి పాత్రలో నటిస్తుండటం విశేషం.