దూసుకొస్తున్న 'వలిమై'
తమిళంలో క్రేజ్ ఉన్న హీరోల్లో అజిత్(Ajith) ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు. అక్కడే కాదు, తెలుగులోనూ ఆయన సినిమాలు అలరిస్తున్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'వలిమై'(Valimai). యువ కథానాయకుడు కార్తికేయ(Kartikeya) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బైక్ రేసుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. బైక్ గ్యాంగ్ ఆగడాలను ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఆటకట్టించడాన్న కథకు బలమైన భావోద్వేగాలను జోడించి హెచ్.వినోద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 24 తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 'వలిమై' విడుదల కానుంది.
బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర
రీఎంట్రీ తర్వాత అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్(Pawan Kalyan) జోరుమీదున్నారు. రానాతో కలిసి ఆయన నటించిన యాక్షన్ డ్రామా 'భీమ్లానాయక్'(Bheemla Nayak). మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్లు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’(Ayyappanum Koshiyum)లో మార్పులు చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫిబ్రవరి 25న తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లా నాయక్’ మాస్ జాతర షురూ కానుంది.
బాలీవుడ్ నుంచి మరో భారీ చిత్రం
వైవిధ్యమైన కథలతో పాటు భారీతనానికి పెద్ద పీట వేసే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali). ఆయన దర్శకత్వంలో అలియా భట్(Alia Bhatt) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’(Gangubai Kathiawadi). నటిగా ఎదుగుదామని ఎన్నో కలలు కన్న గంగా హరిజీవన్‌దాస్ అనే మహిళ మోసపోయి ఎలా కతియావాడికి చేరింది? అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటిని దాటుకుని ఒక శక్తిమంతమైన మహిళగా ఎదగడమే కాకుండా, ఎన్నికల్లో విజయం సాధించి డాన్‌గా ఎలా అయ్యింది? కథియావాడిలోని మహిళల అభ్యున్నతికి ఆమె ఏం చేసింది? అన్న కథకు ఫిక్షన్ జోడించి సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. హిందీతో పాటు, తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
ఓటీటీలో 'సెహరి'..
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన చిత్రం 'సెహరి'(Sehari). అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. కోటి, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అలరించింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి సెహరి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో
* ద ప్రొటేష్ (హాలీవుడ్) ఫిబ్రవరి 25