సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం గురించి నటి కంగనా రనౌత్, భాజపా ఎంపీ రవికిషన్ చేసిన ఆరోపణలపై.. ప్రముఖ నటి, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠను కొంతమంది దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని జయ రాజ్యసభ శూన్యగంటలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ ప్రముఖులు జయా బచ్చన్‌కు మద్దతుగా నిలిచారు.
జయ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. నటి తాప్సీ స్పందించింది. తను ఎప్పటికీ ఇటువంటి విషయాలకు, అవగాహన కల్పించే ప్రచారాలకు మద్దతుగా నిలుస్తానని పేర్కొంది.
ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఆమె ఎప్పుడూ ఎదురు నిలబడతారని నటుడు ఫర్హాన్ అక్తర్ తెలిపాడు. కాగా నిర్మాత అనుభవ్ సిన్హా కూడా జయా బచ్చన్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు. ఇండస్ట్రీ నుంచి పేరు తెచ్చుకుని.. బాలీవుడ్ పేరును అప్రతిష్ఠపాలు చేయొద్దని నటి, రాజకీయనాయకురాలు నగ్మా అన్నారు.
ప్రతి రంగంలోనూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ.. అనైతిక చర్యలకు పాల్పడే వారు ఉంటారని అంత మాత్రాన అందరూ చెడ్డవారు కాదని నటుడు, నిర్మాత నిఖిల్ ద్వివేది పేర్కొన్నారు.
కాగా జయా బచ్చన్ వ్యాఖ్యలకు స్పందించిన కంగన.. అలా మాట్లాడటం సరికాదని చెప్పింది. తన స్థానంలో జయ కూతురు శ్వేతా, తనయుడు అభిషేక్ బచ్చన్ ఉన్నా ఇలానే మాట్లాడతారా? అంటూ ప్రశ్నించింది.