తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరంజీవితో ఫొటో దిగితే చాలనుకున్నా.. కానీ' - దర్శకుడు బాబీ బర్త్​డే స్పెషల్​

మెగాస్టార్​ చిరంజీవితో తాను చేసే సినిమా ఎలాంటి కథతో తెరకెక్కనుంది? ఆ కథకు స్ఫూర్తి ఏంటి? వంటి విషయాలను తెలిపారు దర్శకుడు కేఎస్​ రవీంద్ర(బాబీ). ఆగస్టు 1(ఆదివారం) ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్​ గురించి చెప్పుకొచ్చారు. ఆ విశేషాలేంటో చూద్దాం..

chiranjeevi
చిరంజీవి

By

Published : Aug 1, 2021, 7:03 AM IST

"మాస్‌ సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. నేను చూసిన చిత్రాల ప్రభావం అది" అంటున్నారు దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ). రచయితగా ప్రయాణం మొదలుపెట్టి... మెగాఫోన్‌ చేతపట్టిన దర్శకుల్లో ఈయన ఒకరు. 'పవర్‌', 'జై లవకుశ' చిత్రాలతో మాస్‌ పవర్‌ అంటే ఏమిటో బాక్సాఫీసుకు రుచి చూపించారు. 'వెంకీమామ'తో మరో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

మీ పుట్టినరోజు... స్నేహితుల దినోత్సవం రెండూ ఒకే రోజు వచ్చాయి. కచ్చితంగా స్నేహితులు గుర్తుకొస్తారు కదా...!

చిన్నప్పుడు పుట్టినరోజు వచ్చిందంటే మా ఇల్లు స్నేహితులతో నిండిపోయేది. అప్పట్లో వారితో కలిసి బాగా తిరిగేంత స్వేచ్ఛనిచ్చేవారు మా నాన్న. వాళ్లతోనే ఆ రోజు గడిచిపోయేది. గుంటూరు బాయ్స్‌ అని మాకొక వాట్సాప్‌ గ్రూప్‌ ఉంటుంది. అందులో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాం. చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంటాం. ఎవరూ ఏమీ మరిచిపోలేదు

ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి?

నా అభిమాన కథానాయకుడు చిరంజీవి సర్‌కు దర్శకుడిగా యాక్షన్‌... కట్‌ చెప్పబోతున్నా. అదే ఈసారి ప్రత్యేకత. నా జీవితంలో మరిచిపోలేనంత కిక్‌ ఇచ్చే విషయమిది. చిరంజీవితో ఫొటో దిగితే చాలనుకునే స్థాయి నుంచి, ఆయనతో సినిమా చేసే స్థాయికి రావడం అంటే అదొక ప్రత్యేకమైన అనుభూతి.

బాబీ

మీరు చూసిన మంచి స్నేహం గురించి చెప్పమంటే ఏం చెబుతారు?

నాకూ, నా భార్య అనూషకీ మధ్యనున్న స్నేహం అని చెబుతాను. 19 యేళ్ల స్నేహబంధం మాది. తను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమించుకున్నాం. తను ఎమ్‌.టెక్‌ పూర్తి చేశాక పెళ్లి చేసుకున్నాం. తనను పెళ్లి చేసుకునే సమయానికి నేను చిత్ర పరిశ్రమలో సోలో రైటర్‌ను కూడా కాదు. చాలీ చాలని ఇంట్లో, డబ్బుతో ప్రయాణం మొదలుపెట్టా. అప్పుడు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉండేదో, ఇప్పుడు అంతే. కార్లు మారినా, ఇల్లు మారినా తనేం మారలేదు. నాకు సంబంధించిన మంచి చెడులేవైనా సరే, తనతోనే మొదట పంచుకుంటా. చిత్ర పరిశ్రమలో స్నేహితులంటే చక్రవర్తిరెడ్డి, కోన వెంకట్‌, మోహనకృష్ణ. బాధ అయినా, ఆనందమైనా ఈ ముగ్గురితోనే పంచుకుంటా. మనకు నచ్చినోడు, మనల్ని నమ్మినోడైన మన స్నేహితుడి నుంచి లభించే నైతికబలం ఎంతో ప్రత్యేకమైనది.

చిరంజీవికి ఎలాంటి కథతో సినిమా చేస్తున్నారు? ఆ కథకి స్ఫూర్తి ఏమిటి?

ఒక అభిమానికీ, స్టార్‌కీ మధ్య అనుబంధమే ఈ కథకు స్ఫూర్తి. మొత్తంగా చిరంజీవే స్ఫూర్తి. అభిమాన కథానాయకుడికి ఇలాంటి పరిచయ సన్నివేశాలు ఉండాలి, ఆయన తెరపై కనిపిస్తే ఇలా విజిల్స్‌ కొట్టాలని అనుకుంటుంటాం కదా. అలాంటి కొన్ని మూమెంట్స్‌ నా దగ్గర ఎప్పట్నుంచో ఉన్నాయి. అవే రెండేళ్లుగా సీరియస్‌గా నాతో ఈ కథ రాయించాయి. తొలిసారి ఆయనకి కథ చెబుతున్నప్పుడు చిన్న భయం, బెరుకు, ఆనందం అన్నీ కలగలిసిన అనుభూతి కలిగింది. గంటసేపు కథ చెప్పాక ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. అభిమానులకి ఏం కావాలో అలాగే ఉంటుందీ చిత్రం. 'ఘరానా మొగుడు', 'గ్యాంగ్‌లీడర్‌', 'రౌడీ అల్లుడు'... ఇలా నేనేది చూసి విజిల్స్‌ కొట్టానో అలాగే ఉంటుంది. దసరా నుంచి చిత్రీకరణ మొదలు కానుంది.

చిరంజీవి

ఇదీ చూడండి: ఒకేసారి.. రెండు చిత్రాల్లో మెగాస్టార్ బిజీ

ABOUT THE AUTHOR

...view details