స్వాతంత్ర్య దినోత్సవం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా 'ఖడ్గం.' ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో ప్రసారమవుతుంది. ఈ దేశభక్తి సినిమాను చాలా మంది చూడటానికి ఇష్టపడతారు. అయితే మార్పుకోరుకునే వారికి అనేక దేశభక్తి కథలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ వేదికల్లో వెబ్‌సిరీస్ రూపంలో ఇవి ఇప్పటికే అలరిస్తున్నాయి. ఈ పంద్రాగస్టుకు మీరూ వీటిపై ఓ లుక్కేయండి.
ది ఫ్యామిలీ మ్యాన్(The family man)..
ది ఫ్యామిలీ మ్యాన్.. ఓ స్పై డ్రామా సిరీస్. ఇప్పటికి రెండు భాగాలు వచ్చాయి. రెండింటికీ మంచి ఆదరణ లభించింది. ఓ నిఘా ఆఫీసర్.. అటు దేశాన్ని ఉగ్రవాదుల నుంచి రక్షిస్తూనే తన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది కథ. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది ఈ వెబ్ సిరీస్. మనోజ్ బాజ్పేయీ నటన ఈ వెబ్ సిరీస్ స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక ఆలస్యం చేయకుండా అమెజాన్ ప్రైమ్‌లో మీరూ ఈ సిరీస్ చూసేయండి.
ది ఫర్గాటెన్ ఆర్మీ- ఆజాదీ కే లియే(The Forgotten Army - Azaadi ke Liye)...
నిజ జీవతాల ఆధారంగా కబీర్ ఖాన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సారథ్యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యులు.. దేశ స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా పోరాటం చేశారనేది కథ. విక్కీ కౌశల్ సోదరుడు సన్నీ కౌశల్, శర్వారి వా కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఇది అందుబాటులో ఉంది.
కోడ్ ఎమ్(Code M)..
ఓ ఎన్కౌంటర్ చుట్టూ సాగే కేసుపై ఆధారపడిన ఇది. ఎన్కౌంటర్ కారణంగా ఓ ఆర్మీ అధికారి, ఇద్దరు ముష్కరులు మరణించారని కేసు మూసేస్తారు. కానీ అక్కడ ఎన్‌కౌంటర్‌కు మించిన వ్యవహారం ఉందని తెలుసుకున్న ఓ న్యాయవాది.. కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మిగిలిన కథ. న్యాయవాదిగా మానికా మెహ్రా మంచి ప్రదర్శన చేసింది. రజత్ కపూర్, సీమా విశ్వాస్, తనూజ్ విర్వాని నటన కథకు కీలకం. ఇది ఏఎల్టీ బాలాజీ, జీ5లో అందుబాటులో ఉంది.
జీత్ కి జిద్(Jeet Ki Zid)...
ఆర్మీ స్పెషల్‌ఫోర్స్ ఆఫీసర్ మేజర్ దీపేంద్ర సింగ్ సెంగార్ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ సిరిస్ జీత్ కి జిద్. కార్గిల్ యుద్ధం సమయంలో పక్షవాతానికి గురైనప్పటికీ.. జీవిత పోరాటాన్ని సెంగార్ సాగించిన తీరును చక్కగా చూపించారు. విశాల్ మంగోల్కర్ దర్శకత్వంలో అమిత్ సాద్.. మేజర్ దీపేంద్రగా చక్కటి నటను ప్రదర్శించారు. ఇది జీ5 యాప్‌లో అందుబాటులో ఉంది.
అవ్రోధ్- ది సీజ్ వితిన్(Avrodh: The Siege Within)...
2016 ఉరి లక్షిత దాడుల నేపథ్యంలో సాగుతుంది ఈ కథ. 'ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్' పుస్తకం దీనికి మూలం. అమిత్ సాధ్, నీరజ్ కబి లీడ్ రోల్స్‌లో నటించారు. రాజ్ ఆచార్య తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్ సోనీలివ్‌లో అందుబాటులో ఉంది.
రెజిమెంట్ డైరీస్(Regiment Diaries)...
ఈ వెబ్ సిరీస్‌లో భారత సైనికుల కథలను చిత్రీకరించారు. నిజ జీవితంలోని వ్యక్తులు, వారికి జరిగిన ఎన్నో సంఘటనల సమూహం ఈ రెజిమెంట్ డైరీస్. ఇంటర్వ్యూలు, చారిత్రక ఫుటేజీలతో కథలు అద్భుతంగా ముందుకు సాగుతాయి. సోనీలివ్‌లో ఇది చూడవచ్చు.