కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించగానే ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. థియేటర్లు మూసుకుపోయాయి. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు ఎలా రావాలి అన్న తరుణంలో ఓటీటీ రూపంలో ఓ సరికొత్త మార్గం తెరపైకి వచ్చింది. దాంతో ప్రముఖ దర్శకులూ తమ మనసులు మార్చుకుని కొత్త కథలకు శ్రీకారం చుట్టారు. అలా తమిళ దర్శకుడు మణిరత్నం కూడా ఓ వెబ్‌సీరీస్ నిర్మాణానికి తెరలేపారు.
మణిరత్నం 'నవరస' కథలకు హీరోలు వీళ్లేనా! - మణిరత్నం సూర్య
ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'నవరస' పేరిట ఓ వెబ్‌సిరీస్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లుగా తెరకెక్కే ఈ సిరీస్‌లో తొమ్మిది మంది హీరోలు నటించనున్నారు. అయితే వారెవరన్న దానిపై ఇంకా స్పష్టతరాలేదు. కానీ వీరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
'నవరస' పేరిట తొమ్మిది ఎపిసోడ్లను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మణిరత్నం. నిర్మించే తొమ్మిది ఎపిసోడ్లలో ఒక్కో కథానాయకుడు నటిస్తారు. అలా ప్రతి ఎపిసోడ్‌కి దర్శకుడు కూడా మారిపోతారు. అలా దర్శకులుగా ప్రముఖ కథానాయకులు సిద్ధార్థ్, అరవింద స్వామితో పాటు గౌతమ్ మేనన్, సుధా కొంగర, కేవీ ఆనంద్, జయేంద్ర, బిజోయ్ నంబియార్, కార్తిక్ నరేన్‌లు ఎంపికయ్యారు. ఇక హీరోలుగా మన దక్షిణాదికే చెందిన నాగార్జున, నాగచైతన్య, నాని, కార్తికేయ, సూర్య, ఫహాద్ ఫాజిల్ వంటి వాళ్లతో మణిరత్నం సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద మణిరత్నం నిర్మాణానికే పరిమితమౌతారా లేక తనదైన శైలిలో దర్శకత్వం కూడా చేస్తారన్న విషయం తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే.