తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాక్సాఫీసును గెలవాలని.. అదృష్టాన్ని పరీక్షించుకోవాలని!

ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీసును ఏలిన కొంతమంది దర్శకులు ఇప్పుడు హిట్​ కోసం సతమతమవుతున్నారు. హిట్లతో పరిశ్రమ చూపంతా తమ వైపు తిప్పుకున్న వారే.. ఇప్పుడు డీలాపడ్డారు. తిరిగి విజయం కోసం, తమ పూర్వ వైభవం కోసం జోరు పెంచారు. వైఫల్యాలకు కుంగిపోకుండా.. తామని తాము నిరూపించుకునేందుకు, కొత్త చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

these telugu directors are ready to prove with the new movies
బాక్సాఫీసును గెలవాలని.. అదృష్టాన్ని పరీక్షించుకోవాలని!

By

Published : Dec 23, 2020, 6:56 AM IST

"సినీ పరిశ్రమలో విజయమే ప్రాతిపదిక. అది ఉంటే... అంతా మన వెంటే ఉంటారు. అది లేనప్పుడు మనల్ని పలుకరించేవారూ ఉండరు"- ఎంతో మంది దర్శకులు, నటుల నుంచి వివిధ ఇంటర్వ్యూల్లో వినిపించిన మాటలివి. అలా ఒకప్పుడు బాక్సాఫీసుపై దండెత్తి వసూళ్ల వర్షం కురిపించిన దర్శకులు.. ఆ తర్వాత కాలంలో ఎదురైన పరాభావాల వల్ల నెమ్మదించారు. వరుస విజయాలు, ఇండస్ట్రీ హిట్లతో పరిశ్రమ చూపునంతా తమవైపునకు తిప్పుకున్న వారే.. పూర్వ వైభవం కోసం మళ్లీ జోరు పెంచారు. ఓటమితో కుంగిపోకుండా.. తమ బలం చూపేందుకు నూతన సినిమాలతో సిద్ధమవుతున్నారు.

దర్శకుడు శ్రీనువైట్ల, మంచు విష్ణు

'ఢీ' మేజిక్‌ రిపీట్‌ అవుతుందా?

'ఢీ', 'రెడీ', 'దూకుడు' లాంటి వరస విజయాలతో శ్రీనువైట్ల టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను భారీగా కొల్లగొట్టారు. కామెడీ పంచులతో థియేటర్లలో నవ్వులు పూయించారు. ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఆ సినిమాల్లోని డైలాగ్స్‌ చక్కర్లు కొడుతూనే ఉంటాయి.. 'ఆగడు' పరాజయం పాలవడం, ఆ తర్వాత వచ్చిన సినిమాలూ ఆశించిన ఫలితాలను ఇవ్వక పోవడం వల్ల రేసులో కాస్త వెనకబడి పోయారు ఆయన. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో విజయవంతమైన 'ఢీ' చిత్రం సీక్వెల్‌తో వస్తున్నారు. మంచు విష్ణుతో కలిసి తిరిగి ఆనాటి మేజిక్‌ చేస్తారా లేదా? అనే విషయం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మెహర్​ రమేష్​

మరో 'మెగా' అవకాశం

మెహర్‌ రమేశ్‌ 'కంత్రీ'తో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసినా.. ప్రభాస్‌తో చేసిన 'బిల్లా' సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగులో తెరకెక్కిన స్టైలిష్‌ డాన్‌ చిత్రంగా ఆ సినిమాకు స్థానం ఉంది. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలేవీ గొప్పగా విజయం సాధించలేదు. ఎన్టీఆర్‌తో కలిసి రెండో సారి ఆయన చేసిన 'శక్తి' బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఆ తర్వాత వెంకటేష్‌తో చేసిన 'షాడో' అదే బాట పట్టింది. దీంతో ఆయన అప్పటినుంచి మెగాఫోన్‌ పట్టలేదు. ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఇటీవలే 'బిగ్‌బాస్‌' షోలో స్వయంగా చిరంజీవే ఆ విషయాన్ని వెల్లడించడం వల్ల 'వేదాళం' రీమేక్‌ కన్ఫ్‌ర్మ్‌ అయ్యింది.

పూజా హెగ్డేతో 'బొమ్మరిల్లు' భాస్కర్​

భాస్కర్‌కు హిట్‌ కావాలి

మొదటి సినిమా 'బొమ్మరిల్లు'తోనే మంచి విజయం సాధించారు భాస్కర్‌. ఆ తర్వాత కాలంలో ఆ సినిమా పేరే తన ఇంటి పేరు అయింది. అల్లు అర్జున్‌తో 'పరుగు' చేసి విజయాన్ని అందుకున్నారు. కానీ మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో తీసిన 'ఆరెంజ్‌' ఫలితంతో సందిగ్ధంలో పడిపోయారాయన. దీంతో కాస్త విరామం తీసుకుని రామ్‌ పోతినేనితో 'ఒంగోలుగిత్త' తీశారు. అదీ మోస్తారుగానే ఆడింది. ఆ తర్వాత మలయాళ చిత్రం 'బెంగళూర్‌ డేస్‌' చిత్రాన్ని తమిళంలో 'బెంగళూర్‌ నాట్‌కల్‌' పేరుతో రీమేక్‌ చేసినా ఫలితం లేకపోయింది. రెండేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టారాయన. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా 'మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌' సినిమాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. టీజర్‌ ఇదివరకే విడుదలై అలరిస్తోంది.

సంతోష్​ శ్రీనివాస్​
'అల్లుడు అదుర్స్​' పోస్టర్​

ఆ ఆనందాలు పంచేనా?

రామ్‌తో తీసిన తొలి చిత్రంతోనే ఘనవిజయాన్ని అందుకున్నారు దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌. 2011లో విడుదలైన 'కందిరీగ' సినిమా ఆ ఏడాది టాప్‌ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో 'రభస', రామ్‌తో 'హైపర్‌' సినిమాలతో వచ్చారు. అవి ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. చాన్నాళ్ల తర్వాత ఆయన తన లక్‌ను పరీక్షించుకునేందుకు మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా 'అల్లుడు అదుర్స్‌' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సోనూసూద్‌కు తొలుత నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను అనుకున్న చిత్రబృందం తర్వాత దాన్ని మంచి పాత్రగా మార్చింది. బాక్సాఫీసు దగ్గర మళ్లీ సత్తా చాటుతాడేమో చూద్దాం.

ఇదీ చూడండి:'ఈ సినిమా వల్ల నా పెళ్లి రెండేళ్లు వాయిదా'

ABOUT THE AUTHOR

...view details