వివాహబంధంలో అడుగుపెట్టిన తర్వాత కొంతమంది తారలు.. సినిమాలపై ఆసక్తి చూపకపోవచ్చు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం పెళ్లి అనేది తమ లక్ష్యాలకు అడ్డుకాదని అంటున్నారు. వివాహం చేసుకున్నా.. గ్లామర్ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అలా పెళ్లి తర్వాత కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
సోనమ్ కపూర్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వారసురాలిగా చిత్రసీమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సోనమ్ కపూర్. ఈమె 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహమాడారు. అయితే సోనమ్ తన పెళ్లి తర్వాత 'సంజు', 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా', 'ది జోయా ఫ్యాక్టర్', 'ఏకే వర్సెస్ ఏకే' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె 'బ్లైండ్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
మాధురీ దీక్షిత్
1984లో విడుదలైన 'అబోద్' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టిన మాధురీ దీక్షిత్.. కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. 1999లో శ్రీరామ్ నేనే అనే గుండె సంబంధిత వైద్యుడ్ని మాధురీ వివాహమాడారు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఐశ్వర్యారాయ్
'ఇరువార్' అనే తమిళ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశారు హీరోయిన్ ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత 'ఔర్ ప్యార్ హోగయా' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను 2007లో ఐశ్వర్య వివాహమాడారు. పెళ్లి తర్వాత అనేక చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.
ప్రియాంకా చోప్రా
తలపతి విజయ్ నటించిన 'తమిజాన్' అనే తమిళ చిత్రంతో సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంకా చోప్రా. ఆ తర్వాత వరుస హిట్లతో కొద్ది సమయంలోనే స్టార్ హోదా అందుకున్నారు. 2000వ ఏడాదికిగానూ మిస్ వరల్డ్ టైటిల్‌ను అందుకున్నారు. అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి.. 2018లో వివాహమాడారు. ఆ తర్వాత కూడా అటు హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.
దీపికా పదుకొణె
'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా దీపికా పదుకొణె ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'ఓమ్ శాంతి ఓమ్' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి.. హిట్ సీక్రెట్‌గా మారారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌ను ప్రేమించి.. 2018లో వివాహమాడారు. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు దీపిక. ఆమె భర్త రణ్వీర్తో కలిసి '83' చిత్రంలో నటించగా.. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలోనూ హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకున్నారు దీపిక.