తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అగ్రహీరోల సినిమాల్లో ఈ తారలు ఖరారైనట్టేనా? - ప్రభాస్​ ఆదిపురుష్​

టాలీవుడ్​ అగ్ర కథానాయకులకు జోడీగా కొత్త భామలను ఎంపిక చేస్తున్నాయి చిత్రబృందాలు. ముందుగా ఒక హీరోయిన్​ను ఎంపిక చేయాలనుకున్నా వాళ్లకు తీరిక లేకపోవడం.. చిత్రంలో ఖరారైనట్లు ప్రకటించిన తర్వాత డేట్లు సర్దుబాటు చేయలేక చిత్రాల నుంచి తప్పుకున్న సందర్భాలు పరిశ్రమలో చాలా జరిగాయి. ఇప్పుడు హీరోలు బాలకృష్ణ, పవన్​ కల్యాణ్​, ప్రభాస్​ చిత్రాల కోసం పలువురు నాయికలు ప్రచారంలో ఉన్నారు. అయితే ఈ సినిమాల్లో వీరే నటిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.

These Heroines are advertising as having a chance in Star Heroes movies
అగ్రహీరోల సినిమాల్లో ఈ తారలు ఖరరైనట్టేనా?

By

Published : Nov 25, 2020, 7:54 AM IST

సినిమాల్లో కథానాయికల ఎంపిక ఓ పెద్ద ప్రహసనం. హీరోతో కలిసి కెమెరా ముందుకు వచ్చేవరకూ జోడీ గురించి పక్కాగా చెప్పలేని పరిస్థితి. సినిమాకు క్లాప్‌ కొట్టడానికి ముందే పలు పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు చిత్రబృందాలే స్వయంగా కథానాయికల పేర్లని ఖరారు చేస్తుంటాయి. అంతలోనే మరో కొత్త భామని రంగంలోకి దింపుతుంటారు. చిత్రీకరణ షురూ అయ్యేవరకూ మార్పులు, చేర్పులు... ఎంపిక గురించి తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉంటాయి. త్వరలో పట్టాలెక్కనున్న అగ్ర తారల చిత్రాలకు సంబంధించి ఇప్పటికే పలువురు భామల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి వీళ్లే ఆయా సినిమాల్లో కనిపిస్తారా? లేక ఆలోపు కొత్త కథానాయికల పేర్లు తెరపైకొస్తాయా?

ఇప్పటికైతే వీళ్లూ!

బాలకృష్ణ - బోయపాటి శ్రీను సినిమా కోసం కథానాయికల ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగానే సాగింది. మొదట ప్రయాగ మార్టిన్‌ అనే కొత్త భామ ఎంపిక దాదాపుగా ఖరారైంది. చివరి నిమిషంలో ఆమె స్థానంలో సయేషా సైగల్‌ ఎంపికైంది. ఏమైందో ఏమో కానీ... కెమెరా ముందుకి సయేషాకు బదులుగా ప్రగ్యా జైశ్వాల్‌ వెళ్లింది. ఇలా సినిమా షురూ అయ్యేసరికి పలువురు భామలు మారారు. కథా చర్చలు, పారితోషికం, డేట్ల సర్దుబాటు... ఇలా కథానాయికల ఎంపిక విషయంలో చాలా లెక్కలే ఉంటాయి. అన్నీ అనుకున్నట్టు కుదిరితేనే కోరుకున్న భామ తెరపై కనిపిస్తుంది. లేదంటే మార్పులు తప్పనిసరి.

ప్రగ్యా జైశ్వాల్

అగ్ర తారల సినిమాలకు కథానాయికల్ని ఎంపిక చేయడంపై వ్యూహంతో వ్యవహరిస్తుంటారు దర్శకనిర్మాతలు. తగిన జోడీ, బడ్జెట్టు, పాత్ర పరిధికి తగ్గట్టుగా ఆయా భామలు అందుబాటులో ఉంటారా? అనే విషయాల్ని పరిగణనలోకి తీసుకునే ఎంపిక చేస్తుంటారు. అందుకే మిగతా విషయాల కంటే కూడా కథానాయికల ఎంపిక ప్రక్రియ కాస్త సుదీర్ఘంగానే సాగుతుంటుంది. కొన్నాళ్లుగా ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌ తదితర అగ్ర కథానాయకుల సినిమాల్లో కథానాయికలు వీళ్లే అంటూ పెద్దయెత్తున ప్రచారం సాగుతోంది. చిత్రబృందాలు ఆయా కథానాయికలతో సంప్రదింపులు జరుపుతుండటమే అందుకు కారణం.

రష్మిక

రష్మికకే ఆ అవకాశమా?

తక్కువ సమయంలోనే అగ్ర తార స్థాయికి చేరిన కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప'లో నటిస్తున్న ఆమె తెలుగుతోపాటు, తమిళంలోనూ అవకాశాల్ని అందుకొంటోంది. ఎన్టీఆర్‌ సినిమాలోనూ ఆమే నటించే అవకాశాలున్నట్టు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందని సమాచారం. ప్రధాన కథానాయిక పాత్ర కోసం పలువురు భామల్ని పరిశీలించినట్టు తెలుస్తోంది. రష్మిక, కియారా అడ్వాణీల్లో ఒకరు ఎంపికయ్యే అవకాశాలున్నాయని, రేసులో రష్మికనే ముందుందని తెలిసింది. మరో కథానాయిక పాత్ర కోసం దిల్లీకి చెందిన ఓ కొత్త భామ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరి కెమెరా ముందుకు వచ్చేదెవరన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

కృతి సనన్​, కియారా అడ్వాణీ

హిందీ నుంచే...

ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో 'ఆదిపురుష్‌' రూపొందనుంది. 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు ఇప్పటికే షురూ అయ్యాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించే భామ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. మొదట దక్షిణాది కథానాయికల పేర్లే వినిపించినా, ఇప్పుడు హిందీ భామలే రంగంలోకి దిగొచ్చని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కారణంగా ఆ మార్కెట్‌కు తగ్గ భామల్నే ఎంపిక చేయాలనేది చిత్రబృందం వ్యూహంగా తెలిసింది. కియారా అడ్వాణీ, కృతిసనన్‌, అనన్యపాండే తదితర కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్‌తో జట్టు కట్టే అవకాశం ఎవరిని వరిస్తుందో!

ఆ ముగ్గురూ

పవన్‌కల్యాణ్‌ వరుసగా సినిమాల్ని ప్రకటించారు. వెంట వెంటనే పట్టాలెక్కనున్న వీటి కోసం కథానాయికల్ని ఎంపిక చేయడం దర్శకనిర్మాతలకు కత్తిమీద సాములా మారింది. హీరోల ఇమేజ్‌, ఆయా సినిమాల మార్కెట్‌ స్థాయికు తగిన జోడీని వెతకడం కోసం చిత్రబృందాలు పెద్దయెత్తునే కసరత్తులు చేస్తుంటాయి. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న సినిమాల విషయంలో పలువురు భామల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

నిధి అగర్వాల్

ముఖ్యంగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్‌ కల్యాణ్‌ 27వ చిత్రం కోసం ఇప్పటిదాకా ముగ్గురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్‌ భామ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇందులో మరో కథానాయిక పాత్ర కూడా ఉందని, అందులో సాయిపల్లవి, నిధి అగర్వాల్‌... నటిస్తారని టాలీవుడ్‌ వర్గాలు చెప్పు కొన్నాయి. పవన్‌తో జోడీ కట్టే విషయంలో నిధి పేరు ఇటీవల ట్విటర్‌లోనూ ట్రెండింగ్‌ అయ్యింది. చిత్రబృందాలు ఏ విషయాన్నీ అధికారికంగా ప్రకటించడం లేదు. అంతా ఓకే అనుకున్నాక, సరైన సమయంలోనే పేర్లని ప్రకటించే యోచనలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details