తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోలీస్ స్టోరీ పట్టు.. హిట్టు కొట్టు! - వైల్డ్​ డాగ్ వార్తలు

వెండితెరపై తమ అభిమాన హీరో ఎన్ని పాత్రలు పోషించినా.. ఖాకీ చొక్కా వేయగానే మురిసిపోతుంటారు అభిమానులు. లాఠీతో ఠీవిగా నిలబడితే చాలు.. ఆ కిక్కే వేరప్పా అంటూ చొక్కా ఎగరేస్తారు. అలాగే మన హీరోలు కూడా మంచి కథ దొరికితే చాలు ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచేందుకు పోలీస్​ పాత్రల్లో దుమ్ము దులిపేస్తుంటారు. అదే హిట్​ ఫార్ములాతో టాలీవుడ్​లో అనేక సినిమాలు సూపర్​హిట్​గా నిలిచాయి. ఈ నేపథ్యంలో పోలీస్​ పాత్రలతో బిగ్​స్క్రీన్​పై సందడి చేసిన హీరోలెవరో చూద్దాం.

these heroes Will get hit with police stories?
పోలీస్ స్టోరీ పట్టు.. హిట్టు కొట్టు!

By

Published : Feb 9, 2021, 9:23 AM IST

వెండితెరపై హీరోయిజం పండించడానికి కథానాయకులకు ఎన్ని తరహా పాత్రలైనా దొరకొచ్చు. కానీ, సినీప్రియుల మదిలో రియల్‌ హీరోగా ముద్ర వేయించుకోవాలనుకున్న ప్రతిసారీ వాళ్లు చూసేది పోలీస్‌ కథలవైపే. మాస్‌ హీరోగా విలన్‌ గ్యాంగ్‌ను చితక్కొట్టినా.. ఫ్యాక్షనిస్టుగా తొడగొట్టి శత్రుమూకల గుండెల్లో రైళ్లు పరుగెత్తించినా.. చారిత్రక యోధుడిగా కత్తి యుద్ధాలతో వందల మందిని మట్టికరిపించినా.. తమ అభిమాన హీరో ఖాకీ చొక్కా ధరించి ప్రతినాయకుల ముందు లాఠీతో ఠీవిగా నిలబడితే చాలు మురిసిపోతుంటారు సినీప్రియులు.

అందుకే మంచి కథ దొరికినప్పుడల్లా తెలుగు కథానాయకులు యూనీఫాంతో తెరపై అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. పోలీసు కథలతో ఇటీవల విడుదలైన అనేక చిత్రాలు విజయవంతం కాగా.. మరికొన్ని పోలీస్​ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

పోలీస్​ పాత్రలే హిట్​ ఫార్ములా!

పోలీస్‌ కథలు వెండితెరకు దొరికిన ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములా. ఈ ఖాకీ కథలతోనే సినీప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్టార్లు ఉన్నారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల కాలం నుంచి తెలుగు తెరపై పోలీస్‌ కథలు సందడి చేస్తున్నప్పటికీ.. ఈ కథలతో స్టార్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లలో సినీప్రియులకు బాగా గుర్తుండేది సాయికుమార్‌, విజయశాంతి, శ్రీహరి లాంటి వారే. నేటి తరానికి వస్తే పోలీస్‌ కథలతో ఎక్కువగా సత్తా చాటిన వాళ్లలో రవితేజ, ఎన్టీఆర్‌ (బాద్‌షా), పవన్ ‌కల్యాణ్‌ (గబ్బర్‌సింగ్‌), మహేష్‌బాబు (పోకిరి, దూకుడు), రామ్‌చరణ్ ‌(ధృవ) లాంటి స్టార్లే గుర్తొస్తారు.

ఎక్కువగా ఈయనే

ఈతరంలో అందరి కంటే ఎక్కువసార్లు ఖాకీ చొక్కా తొడిగింది రవితేజనే. 'విక్రమార్కుడు', 'ఖతర్నాక్‌', 'మిరపకాయ్‌', 'పవర్‌', 'టచ్‌ చేసి చూడు' వంటి చిత్రాల్లో పూర్తిస్థాయి పోలీస్‌గా మురిపించిన ఈ మాస్‌రాజా.. 'ఇడియట్‌', 'వెంకీ', 'కిక్‌' తదితర చిత్రాల్లో ఆఖరికి ఖాకీ చొక్కా తొడిగినట్లుగానే చూపిస్తారు.

'క్రాక్​' సినిమాలో పోలీస్​గా రవితేజ

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మాస్​ మహారాజ్​ రవితేజ హీరోగా 'క్రాక్​' చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసింది. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు విశేషాదరణ దక్కింది. ఇందులో ముగ్గురు విలన్లపై పోలీస్​ హీరోయిజం చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు.

మరోసారి శర్వా..

'రాధ' కోసం ఖాకీ దుస్తులు ధరించిన యువ కథానాయకుడు శర్వానంద్‌.. యూవీ క్రియేషన్స్‌ నిర్మించబోతున్న కొత్త సినిమా ఓ చక్కటి పోలీస్‌ కథతోనే రూపొందనున్నట్లు తెలుస్తోంది.

'రాధ' చిత్రంలో శర్వానంద్​

చెర్రీ.. ముచ్చటగా మూడోసారి

మంచి కథ పడితే చాలు ఖాకీ దమ్ము చూపించడానికి సిద్ధంగా ఉంటారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఇప్పటికే ఆయన 'తుఫాన్‌', 'ధృవ' చిత్రాల్లో పోలీస్‌గా అలరించారు. వీటిలో 'ధృవ' విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంతో మరోసారి పోలీస్‌ డ్రెస్​లో కనువిందు చేయనున్నారు.

'ధృవ' చిత్రంలో పోలీస్​ పాత్రలో రామ్​చరణ్

స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితకథల ఆధారంగా అల్లుకున్న ఓ ఫిక్షనల్‌ కథాంశంతో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లూరి పాత్ర టీజర్‌ను విడుదల చేయగా.. అందులో చెర్రి పోలీస్‌ లుక్‌తోనే దర్శనమిచ్చారు. పోలీస్‌గా ఉన్న అల్లూరి.. స్వాతంత్య్ర యోధుడిగా ఎలా మారారు? కొమురం భీమ్‌తో ఎలా చేతులు కలిపాడు అన్నది 'ఆర్‌ఆర్‌ఆర్‌' చూసి తెలుసుకోవాల్సిందే.

ఎన్‌ఐఏ అధికారిగా నాగ్‌..

అగ్ర కథానాయకుడు నాగార్జున, తన కెరీర్‌లో ఎన్నో పోలీస్‌ కథల్లో నటించినా.. ఆయనకెక్కువ పేరు తెచ్చిపెట్టింది పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'శివమణి'నే. ఆ తర్వాత ఆయన 'గగనం'లో మేజర్‌గా, ఇటీవల వచ్చిన 'ఆఫీసర్‌'లో ఐపీఎస్‌ అధికారిగా తుపాకీ పట్టారు. ప్రస్తుతం 'వైల్డ్‌డాగ్‌' చిత్రం కోసం మరోసారి యూనీఫాం వేసుకున్నారు.

'వైల్డ్​డాగ్​' సినిమాలో నాగార్జున

ఇందులో ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మగా నాగ్​ కనిపించనున్నారు. పదేళ్ల క్రితం జరిగిన కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నూతన దర్శకుడు సాల్మన్‌ రూపొందిస్తున్న చిత్రమిది.

ఇదీ చూడండి:సినిమాల్లో 'రాజకీయం'.. చిరుతో పాటు ఆ హీరోలు

ABOUT THE AUTHOR

...view details