కరోనా రెండోదశ ఉద్ధృతికి పెద్ద సినిమాల నిర్మాతలు కొన్ని రోజులు ఆగి థియేటర్లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. సల్మాన్‌ఖాన్ 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మాత్రం తెగించి ముందుకెళ్లింది. ఈ చిత్రాన్ని అవకాశమున్న చోట థియేటర్లో విడుదల చేశారు. దీంతో పాటు 'పే పర్ వ్యూ' పద్ధతిలోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జయాపజయాల మాట ఎలా ఉన్నా సల్మాన్ సినిమా అనేసరికి అభిమానులు ఎగబడ్డారు. ఎంతలా అంటే ఈ సినిమాను జీ ప్లెక్స్‌లో రూ.249 పెట్టి చూడటానికి చాలామంది వెనకాడలేదు. దీంతో తొలి రోజు జీ ప్లెక్స్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. మొదటి రోజే 4.2 మిలియన్ మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించారు. మే 13న విడుదలైన ఈ చిత్రానికి వారాంతానికి 9.9 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు అంచనా. పేపర్ పర్ వ్యూ పద్ధతిలో ఇంత భారీ స్పందనను నిర్వాహకులు ఊహించలేదు.
డిజిటల్ బాటలో 'రాధే..' దుమ్ముదులిపే సరికి దర్శకనిర్మాతల్లో కొత్త ఉత్సాహం చేరింది. ముఖ్యంగా అగ్ర హీరోలతో సినిమాలు చేసి విడుదల కోసం వేచి చూస్తున్న దర్శకనిర్మాతలకు 'రాధే.. 'భరోసానిచ్చాడు. దీంతో మరిన్ని సినిమాలు ఇదే బాటలో వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సినిమా అంతగా బాగోలేక పోయినా సల్మాన్ ఖాన్ క్రేజ్‌తో 'రాధే' ఈ స్థాయిలో డిజిటల్ హిట్ అయ్యిందంటే సినిమా మరింత బాగుండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
చర్చల్లో నిర్మాతలు
అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ', రణ్వీర్ సింగ్ '83', అజయ్ దేవగణ్ 'మైదాన్', సల్మాన్ కీలక పాత్రలో నటించిన 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్' లాంటి చిత్రాలన్నీ 'పే పర్ వ్యూ' దారిలో వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా ఓటీటీ నిర్వాహకులతో దర్శక నిర్మాతలు గట్టిగానే చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం 'సూర్యవంశీ'. పోలీస్ కథతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో రణ్వీర్ సింగ్, అజయ్‌దేవగణ్ అతిథి పాత్రల్లో నటించారు. కత్రినా కైఫ్ నాయిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తై సంవత్సరం పైగానే అయ్యింది. కరోనా వల్ల విడుదలకు పరిస్థితులు అనుకూలించడం లేదు.