చిటపట చినుకుల కాలమిది. దేశమంతటా ముసురు పట్టుకుంది. ఎక్కడ చూసినా వానే.. వారం రోజులుగా వీధుల్ని, నగరాల్ని తడిపేస్తోంది. వాన చుట్టూ అల్లుకున్న సినిమాలు చూస్తే ఈ సమయం మరింత 'వర్ష 'రంజితమవుతుంది.. ఆరుబయట జోరు వాన సినిమాలో వాన కలిస్తే చూసే ప్రేక్షకుడి హృదయం తడిసి ముద్దవ్వాల్సిందే. బాలీవుడ్, టాలీవుడ్లో వచ్చిన వాన సినిమాల వైపు ఈ వారాంతంలో ఓ లుక్కేయండి.
ప్రేమ కోట.. రెయిన్ కోట్
అజయ్ దేవగణ్, ఐశ్యర్యరాయ్ నటించిన ఈ సినిమా వానకాలం ఆత్మను ఆవిష్కరించిందనడంలో సందేహం లేదు. ప్రముఖ ఆంగ్ల రచయిత హెన్రీ రాసిన 'ది గిఫ్ట్ ఆఫ్ మ్యాగి' ఆధారంగా తెరకెక్కిందిది. ఓ వానకాలపు మధ్యాహ్నం వేళ తన మాజీ ప్రేయసి నీర్జాను కలుసుకుంటాడు మనోజ్. కొన్ని కారణాల కారణంగా జీవితం పంచుకోలేక పోయిన ఈ ప్రేమజంట ఆ సాయంకాలం ఏం చేసిందనేది చాలా హృద్యంగా తెరకెక్కించారు. వలపు వర్షంలో ముంచేస్తూ తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందీ సినిమా. కథనం నెమ్మదిగా సాగినా, సినిమాలోని సంభాషణలు, ప్రేమలోని గాఢత, అజయ్, ఐష్ నటన కట్టిపడేస్తాయి.
చినుకుల తలంబ్రాలు
ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ భారతీయుల వివాహంపై తీసిన ఫ్యామిలీ డ్రామా 'మాన్సూన్ వెడ్డింగ్'. నసీరుద్దిన్ షా నటించిన ఈ చిత్రం చూస్తున్నంత సేపు వర్షాకాలంలో సమీప బంధువుల వివాహానికి హాజరైన అనుభూతినిస్తుంది. కథనాన్ని ఫీల్‌గుడ్‌గా కొనసాగిస్తూనే సమాజంలో పలు సమస్యలను లేవనెత్తారామె. లింగవివక్ష, చిన్నపిల్లల ప్రవర్తన, కుటుంబంలో బయటకు కనిపించని కోణాలను చాలా సున్నితంగా చూపించారు. పనిమనిషి అలీస్, వెడ్డింగ్ ప్లానర్ అయిన దూబేల మధ్య నడిచే ప్రేమకథ మరింతగా ఆకట్టుకుంటుంది.
భయం వరద.. తుంబడ్
హిందీలో 2018లో వచ్చిన పిరియాడిక్ హారర్ చిత్రం 'తుంబడ్'. బ్రిటీష్ కాలంలో సాగే ఈ కథ బంగారు నాణేల వేట నేపథ్యంలో తెరకెక్కింది. చిత్ర కథతోపాటు, కథనం విభిన్నంగా సాగడం వల్ల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందీ చిత్రం. తెర చినుకుల తడితో నిండిపోతుంది. అలాంటి వాతావరణం కనిపించేందుకు నాలుగైదు సంవత్సరాల పాటు వర్షాకాలంలోనే ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం. ప్రేక్షకుడిని సరికొత్త హారర్ సినిమాను చూసిన అనుభూతినిస్తుంది చిత్రం.