తెలంగాణలో నేటి నుంచి సినిమా థియేటర్లు పాక్షికంగా మూతపడనున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో సినిమా ప్రదర్శనలపై సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాల్స్‌ను పాక్షికంగా బంద్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
కరోనా సెగ.. నేటి నుంచి థియేటర్లు బంద్ - Theatres corona
17:46 April 20
ఈ నెలలో విడుదల కావల్సిన సినిమాలన్నీ వాయిదా పడటం, ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల నష్ట నివారణ చర్యల్లో భాగంగా బంద్ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు. అయితే థియేటర్ల బంద్ విషయంలో నిర్మాత దిల్ రాజు అంగీకరించలేదని, 'వకీల్ సాబ్' ప్రదర్శితమవుతున్న థియేటర్లు యథాతథంగా కొనసాగుతాయని ఆయన వివరించారు. ప్రేక్షకుల రాకను అనుసరించి ఆయా థియేటర్లు కూడా వారంలో మూసివేస్తారని విజయేందర్ రెడ్డి వెల్లడించారు.
రాత్రి 8 తర్వాత థియేటర్లు మూసివేయాలి
రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు. రాత్రి ఎనిమిది గంటల వరకే అన్ని సినిమా థియేటర్లు మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు థియేటర్లలో అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలని.. ప్రవేశద్వారాలు, బయటకు వెళ్లే మార్గాలు, ఇతర ప్రాంతాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. భౌతికదూరం విధిగా పాటించాలన్న ప్రభుత్వం.. ప్రతి ప్రదర్శన తర్వాత విధిగా శానిటైజేషన్ చేయాలని పేర్కొంది. థియేటర్లలోని ఏసీల ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య, తేమ 40 నుంచి 70 శాతం మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. వీలైనంత ఎక్కువ గాలి ధారాళంగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రదర్శనల మధ్య విరామం ఉండేలా సమయాలు మార్చాలని తెలిపింది. అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రభుత్వం.. ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలిస్ కమిషనర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.