తెలంగాణలో నేటి నుంచి థియేటర్లు ఓపెన్
17:15 July 17
థియేటర్లు ఓపెన్
సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కోరింది. ఈ మేరకు ఛాంబర్ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను శనివారం కలిశారు. రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభానికి చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో విషయంలో పునరాలోచించాలని.. అలాగే పార్కింగ్ రుసుము, విద్యుత్తు ఛార్జీలు, పన్ను చెల్లింపు విషయాల్లో మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఎగ్జిబిటర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి సినిమా పరిశ్రమను కాపాడాలని కోరారు. థియేటర్ల పునఃప్రారంభం విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఆదివారం నుంచి థియేటర్ల పునః ప్రారంభానికి ఎగ్జిబిటర్లు సిద్ధమ్యారు. ఈనెల 23వ తేదీ నుంచి కొత్త సినిమాలు ప్రదర్శించాలని భావిస్తున్నారు. 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చేసిన వినతులు..
- 2017లో తీసుకొచ్చిన జీఓ.75 విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి.
- సినిమా థియేటర్‌కు వచ్చే వాహనదారుల నుంచి పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి.
- లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు అన్ని మూతపడి ఉన్నాయి. అయినా విద్యుత్తుశాఖ నామమాత్రపు ఛార్జీలు విధించింది. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలి.
- కరోనా వల్ల ఆదాయం లేకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు తీవ్రనష్టాలు చవిచూశారు. వాళ్లకు ఉపశమనం కలిగించేందుకు రెండేళ్ల పాటు మున్సిపల్/ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పించాలి.
- జీఎస్‌టీ తగ్గించి సినిమా థియేటర్లను కాపాడాలి.
కరోనా ప్రభావంతో సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. థియేటర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కరోనా ఫస్ట్‌వేవ్‌లో మూతపడ్డ థియేటర్లు ఇప్పటికీ తెరచుకోలేదు. కరోనాకు తోడుగా ఓటీటీల నుంచి థియేటర్లకు పోటీ ఎదురైంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ప్రేక్షకులకు ఓటీటీలవైపే చూస్తున్నారు. నిర్మాతలు సైతం తమ సినిమాను థియేటర్లకు బదులుగా డిజిటల్ విడుదలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో థియేటర్ల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే సేవ్ సినిమా.. సేవ్ థియేటర్స్ అంటూ ఫిల్మ్ ఛాంబర్ పోరాడుతోంది.