ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ మాల్యా జీవితాన్ని ఓ వెబ్‌సిరీస్ రూపంలో రూపొందించనుంది నిర్మాణసంస్థ అల్మైటీ మోషన్ పిక్చర్స్. దీనికి సంబంధించిన కథ కోసం 'ది విజయ మాల్యా స్టోరీ' పుస్తక రచయిత నుంచి హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించింది నటి, నిర్మాత ప్రబ్లీన్ కౌర్.
"విజయమాల్యా జీవితాన్ని ఓ వెబ్‌సిరీస్‌గా రూపొందించడానికి హక్కులు పొందామని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే మెగా వెబ్‌సిరీస్‌ను అల్మైటీ నిర్మాణసంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది".
-ప్రబ్లీన్ కౌర్, బాలీవుడ్ నటి, నిర్మాత
'ది విజయమాల్యా స్టోరీ' పుస్తకాన్ని ప్రఖ్యాత రచయిత కే గిరిప్రకాశ్ రాయగా.. పెంగ్విన్ఇండియా ప్రచురించింది. విజయమాల్యా పుట్టుక దగ్గర నుంచి అతడు యూకే వెళ్లేంత వరకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి.
సెప్టెంబరులో షూటింగ్..
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. విజయమాల్యా పాత్రధారి కోసం బాలీవుడ్ నుంచి ఓ నటుడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఈ వెబ్‌సిరీస్‌ను ఎమ్ఎక్స్ ప్లేయర్లో విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అల్మైటీ మోషన్ పిక్చర్స్ నిర్మాణసంస్థ.