The Kashmir Files: ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై జరిగిన హత్యకాండకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 100 కోట్ల వసూళ్లు సాధించి విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ 'ఈటీవీ భారత్'తో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
"కరోనా వల్ల చిత్రీకరణకు నాలుగేళ్ల సమయం పట్టింది. సినిమాను చూసిన అభిమానులు దిల్లీ నుంచి వచ్చి భావోద్వేగానికి గురై ధన్యవాదాలు తెలుపుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే భావన రాకుండా భారతీయ సినిమాగా ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తీర్చిదిద్దాం. తమ చిత్రానికి దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు అందరూ ఆదరించారు. ఈ చిత్రంతో కశ్మీరీ పండిట్లకు కాస్త న్యాయం జరిగిందని భావిస్తున్నాం. మేము ఈ చిత్రానికి పెద్దగా ప్రొమోషన్స్ నిర్వహించలేదు. ప్రజలే ఈ సినిమాను ఆదరించి ఘన విజయాన్ని అందించారు. "
- అభిషేక్ అగర్వాల్, చిత్ర నిర్మాత
త్వరలోనే తెలుగులోకి డబ్బింగ్ చేస్తామని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. సినిమా ఆదరించిన ప్రతీ ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని ఆయన అన్నారు.