The Kashmir files OTT release: 'ది కశ్మీర్ ఫైల్స్'.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై ప్రస్తుతం బాలీవుడ్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తొలిరోజు సాధారణంగా ఉన్న ఈ సినిమా కలెక్షన్లు, రెండో రోజు రెండు రెట్లు, మూడో రోజు మూడు రెట్లు పెరిగాయంటే ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడీ చిత్రం కోసం ఓటీటీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. నిజానికి చిత్రం రిలీజ్ అయినా నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్‌కు నిర్ణయాన్ని మార్చుకున్నారట మూవీమేకర్స్. ఏప్రిల్‌లో కాకుండా మే 6న స్టీమింగ్ అయ్యేటట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయించాయి. అసోం గవర్న్మెంట్ అయితే తమ ఉద్యోగులకు హాలీడే కూడా ప్రకటించింది.
కథేంటంటే..
1990లో కశ్మీర్లో హిందూ పండిట్స్పై జిహాదీలు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని స్వదేశంలోనే శరణార్థులుగా అయ్యేలా చేశారు. మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలను భావోద్వేగభరితంగా చూపించారు. ఇక ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
వరి పంటతో సుకుమార్ చిత్రం..
Sukuamar photos on paddy field: హీరో, హీరోయిన్లకే కాదు కొందరు దర్శకులకూ విశేష అభిమానగణం ఉంటుంది. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ ఉంటుంది. ఈ కోవకి చెందిన వారిలో సుకుమార్ ఒకరు. 'ఆర్య' సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన ‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. వారిలో ఒకరైన సువీక్షిత్ బొజ్జా.. సుకుమార్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సొంతూరు బోరెడ్డిగారిపల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో వరి పంటతో సుకుమార్ రూపం, ‘పుష్ప 2’ లోగోను తీర్చిదిద్దారు. చూడగానే ఆకట్టుకునే ఈ చిత్రాన్ని డ్రోన్ కెమెరా సాయంతో షూట్ చేసి సంబంధిత వీడియోను సుకుమార్‌కు చూపించారు. ఈ వీడియో, తనపై ప్రత్యేకంగా రూపొందించిన పాటను విన్న సుకుమార్.. ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. అటు సుకుమార్ అభిమానులతోపాటు, ఇటు ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్ అభిమానులు సువీక్షిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన అభిమాన దర్శకుడి చిత్రాన్ని రూపొందించేందుకు సువీక్షిత్ సుమారు 50 రోజులు శ్రమించారు. మరోవైపు ‘దూరదర్శని’ అనే సినిమాతో సువీక్షిత్ హీరోగా పరిచయం కానున్నారు.
వరి పంటతో సుకుమార్ చిత్రం
'బీస్ట్' నుంచి సెకెండ్ సింగిల్
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'బీస్ట్'. పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని 'అరబిక్ కుతు' సాంగ్ ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా శ్రోతలను ఓ ఊపు ఊపేసింది. సోషల్‌మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో సాంగ్ వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 19న 'జాలీ ఓ జిమ్ఖానా' పేరుతో ఈ గీతాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది. హీరో విజయ్ స్వయంగా ఆలపించడం విశేషం. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ఈ మూవీకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహించారు. వచ్చే నెలలో విడుదల కానుందీ చిత్రం.
ఇదీ చూడండి: రాజమౌళి 'నాటు' డాన్స్.. ఆ రోజు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్