తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కలియుగ భగవద్గీతకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు

నేపథ్యగాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన అందించిన సుమధుర గీతాలు ఈనాటికీ తెలుగు నాట మార్మోగుతూనే ఉంటాయి. ఆయన మాటలు అక్షర సత్యాలు.. ఆయన పాటలు సుమధుర గీతాలు.. ఆయన ఎవరో కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు. శుక్రవారం(డిసెంబరు 4) ఘంటసాల జయంతి సందర్భంగా ఆయన వ్యక్తిగత, సినీ ప్రయాణంలోని విశేషాలు మీకోసం.

The Great Music Director Ghantasala Venkateswara rao birth anniversary special story
కలియుగ భగవద్గీతకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు

By

Published : Dec 4, 2020, 5:30 AM IST

గీత.. అంటే భగవద్గీత అనే అనుకుంటారు సాధారణంగా, కానీ గీతలో చాలా రకాలున్నాయి. గురుగీత, అష్టావక్రగీత, హంస గీత, అనుగీత, వశిష్టగీత ఇలా చాలా ఉన్నాయి. కానీ వాటిలో మానవాళిని జీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను ఎదుర్కొనడానికి సమాయత్తం చేసే విజ్ఞానాన్ని, జీవన విధానాన్ని అందించిన వాటిలో అగ్రతాంబూలం సాక్షాత్తు శ్రీకృష్ణుడే బోధించిన గీత అయిన 'భగవద్గీత'కే దక్కుతుంది. దాదాపుగా ఈ గీతలన్నీ ఏదో ఒక సందర్భంలో అయోమయంలో పడిపోయిన శిష్యులకు గురువులు మార్గదర్శనం కావించినవే.. అయితే ఆధునిక కాలంలో ఆవిర్భవించిన మరో గీత కూడా ఉంది. అదే 'ఘంటసాల భగవద్గీత'.

ఘంటసాల వెంకటేశ్వరరావు

మనదేశంలో గుళ్లకు గోపులరాలకు కొదవేముంది? ముక్కోటి దేవతలకూ ముఫ్పైకోట్ల గుళ్లు ఉండనే ఉన్నాయి. కేవలం దైవాలకు, దైవాంశ సంభూతులకే కాకుండా మానవ మాత్రులకూ గుళ్లున్నాయి. అభిమానుల 'దేవుళ్లకే' ఆ గుడులు వెలిసాయి. మహాత్మాగాంధీకి, సోనియా గాంధీకీ గుళ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియాకు గుడి కట్టారట. ఇంకా రజనీకాంత్‌కు, ఖుష్బూకు, అమితాబ్‌కు, మోదీకి ఇలా రాజకీయ, సినిమా ప్రముఖలందరికీ గుళ్లు వెలిశాయి. కొన్ని సంవత్సరాల క్రితం హాయత్‌నగర్‌ దగ్గర కుంట్లూరులో వేగ్నేశ సంస్థ వంశీరామరాజు ఆధ్వర్యంలో శ్రీవిద్యానృసింహ భారతీచేత ఓ గుడి ప్రారంభించబడినది. ఆ గుడిలోని దేవుడు...'ఘంటసాల వెంకటేశ్వరరావు'. ఈ గాయకుడికి ఇంకా పశ్చిమగోదావరి జిల్లా అనంతపల్లిలోనూ, శ్రీకాకుళంలోనూ గుళ్లు నిర్మాణమయ్యామని తెలుస్తోంది. మరి శ్రీకృష్ణులవారు ఎక్కడో ఎప్పుడో బోధించిన గీతను మన డ్రాయింగ్‌ రూంలో వినబడేలా చేస్తూ 'ఘంటసాల భగవద్గీత'గా వెలయింప చేసిన వ్యక్తికి ఆ మాత్రం గౌరవం చూపడం అవసరమే కదా!

ఘంటసాల బాల్యం..

"లేని బాట వెతుకుతున్న పేదవానికి...

రాని పాట పాడుతున్న పిచ్చివానికి...

బ్రతుకూ పూలబాట కాదు...

అది పరవశించి పాడుకునే పాటకాదు" అంటూ పాడిన ఘంటసాల జీవితం... ముఖ్యంగా బాల్యం పూలబాట కాదు సరికదా.. 'ముళ్లకంపే'. ఆయన 1922 డిసెంబర్‌ 4న, కృష్ణా జిల్లా చౌటపల్లిలో ఓ బీద బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. ఊరూరా తిరుగుతూ గుళ్లల్లోనూ, ఉత్సవాలలోనూ పాటలు పాడుతూ పొట్ట పోసుకునే తండ్రి వెంట తిరగుతూ తండ్రి పాటలకు నృత్యం చేసేవారు.

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తండ్రి కోరిక మేర సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం పారిపోయి, సరైన ఆశ్రయం దొరక్క బిక్షాటన చేసి కడుపునింపుకొటూ అనేక కష్టాలను అనుభవించి, అంచెలంచెలుగా ఎదిగి గానగంధర్వుడిగా మిగిలిపోయిన ఘంటసాల జీవితాన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఓ బోధానాంశంగా చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. గుడికట్టడం కన్నా ఇటువంటివి చేయడం స్ఫూర్తిదాయకం.

అప్పట్లో ఏకైక సంగీత కళాశాల విజయనగరంలోనే ఉంది. అక్కడ సీటుకోసం, సీటు దొరికాక పూటగడవటం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఇళ్లలో ఊడిగం చేసారు... జోలె పట్టారు. వారాలబ్బాయిగా పొట్టపోసుకున్నారు. సత్రంలో, పార్కులో పడుకొన్నారు. ఎన్ని కష్టాలు పడినా సాధనని మానలేదు. సంగీత కళాశాల నుంచి పట్టాపుచ్చుకొని తిరిగొచ్చారు. పట్టావచ్చింది కానీ ఉపాధి దొరకలేదు. తనకు అలవాటైన పనే చేసారు. పండుగలలో పబ్బాలలో పాటలు పాడుతూ పాటగాడుగా గుర్తింపు పొందారు. నాటకాలూ ఆడారు.

ఆ క్రమంలో వారికి ఇంచుమించుగా అదే పరిస్థితిలో ఉన్న మరో అబ్బాయితో పరిచయం కలిగింది. అతను నాటకాలలో స్త్రీ పాత్రలు వేసే వాడు. అయితే అప్పుడు వారిద్దరూ సినిమాలలోకి వెళతారని కానీ, అతడో గొప్ప నటుడవుతాడు కానీ, అతడి విజయాలకు తన గాత్రం ప్రధాన కారణం అవుతుందని కానీ అనుకోలేదు. ఆ అబ్బాయే ఆ తర్వాత నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు.

ఘంటసాల వెంకటేశ్వరరావు

చిత్రరంగ ప్రవేశం...

అవి స్వాతంత్రోద్యమ రోజులు. దేశభక్తిని ప్రబోధించే పాటలతో ప్రజలలో చైతన్యాన్ని రగిలిస్తున్న ఘంటసాలను అరెస్టు చేశారు. 18 నెలలు కారాగారం తర్వాత విడుదలై బయటకు వచ్చారు. పరిస్థితి షరా మామూలే. అయినా ఘంటసాల కుదరుగా ఉండాలని ఆయన తల్లి బంధువుల అమ్మాయి సావిత్రితో వివాహం జరిపించారు. దానితో పరిస్థితి మరింత దుర్భరమైనది. అదృష్టవశాత్తు అదే సమయంలో దూరపు బంధువు సముద్రాలతో పరిచయం కలిగింది. ఘంటసాలలోని గంధర్వుని అందరి కన్నా ముందుగా పసిగట్టింది సముద్రాలవారే. ఆయన అప్పటికే సినిమాలలో పనిచేస్తున్నారు. ఆయన సలహా మీద ఘంటసాల మద్రాసు చేరారు.

సముద్రాల, ఘంటసాలను అప్పటి స్టార్‌ నాగయ్యకు, బి.ఎన్‌.రెడ్డికు పరిచయం చేశారు. వారి 'స్వర్గసీమ'లో భానుమతితో కలిసి పాడే అవకాశం ఇచ్చారు. అప్పట్లో ఎవరి పాటలు వారే పాడుకునేవారు. నటుడు నారాయణరావుకు గాత్రదానం చేశారు. కానీ అవకాశాలు అయితే ఎక్కువగా రాలేదు. చిన్నాచితకా వేషాలూ వేశారు. ఘంటసాలను గుర్తించిన భానుమతి తన సినిమాలకు సహాయ సంగీత దర్శకుడిగా తీసుకొన్నారు. హెచ్‌.ఎం.వి గ్రామఫోన్‌ కంపెనీ వారైతే ఘంటసాలను పాటలకు పనికి రావనేసారు.

అయితే ఘంటసాలను గుర్తించిన మరొక వ్యక్తి నటుడు పేకేటి. ఆ కంపెనీలో చేరాక ఘంటసాలను పిలిపించి ప్రైవేట్‌ ఆల్బమ్‌ చేయించారు. ఈలోగా గాలిపెంచల నరసింహారావు, సి.ఆర్‌.సుబ్బరామన్‌ సహాయకుడిగా చేసిన ఘంటసాలకే 'కీలుగుర్రం', 'బాలరాజు' సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ రెండు విజయవంతమవ్వడం వల్ల 'మనదేశం', 'లక్ష్మమ్మ' చిత్రాలకు పనిచేశారు. ఒక విధంగా మొదట్లో ఆయన గాయకుడిగా కన్నా సంగీత దర్శకుడిగానే తన స్థానాన్ని సుస్థిరపరచుకొన్నారు.

విజయావారి 'పాతాళభైరవి'తో అటు సంగీత దర్శకుడిగా, ఇటు గాయకుడిగా విజయకేతనం ఎగురవేశారు. పైగా నటసామ్రాట్, నటరత్నలకు ఆయనే నేపథ్యగాయకుడు కావడం వల్ల ఇక ఘంటసాల వెనుదిరిగి చూడలేదు. ఒక విధంగా వారిద్దరూ తెలుగు సినిమాకు రెండు 'కళ్లైతే' ఘంటసాల కంఠమయ్యారు. వారికి 'దేవదాసు', 'మల్లీశ్వరి'లు చలనచిత్ర సామ్రాజ్యాన్ని పంచి ఇస్తే ఆ రెండు సామ్రాజ్యాలలోనూ ఘంటసాలదే కీలకపాత్ర అవడం విశేషం.

అద్వితీయం...

చిత్రరంగంలో పోల్చిచూడటం మామూలే. ఘంటసాలను అసలు పోల్చాలంటే రఫీస్థాయి గాయకుడే ఉండాలనుకోవాలి. కానీ పోల్చాలంటే సమానమైన అంశాలుండాలి. ఘంటసాల కర్నాటక సంగీతంలోనూ, రఫీ హిందుస్థానీ సంగీతంలోనూ ఉద్దండులే అయినా రఫీ సంగీత దర్శకుడు కాదు. కానీ ఘంటసాల, సుబ్బరామన్, పెండ్యాల, రాజేశ్వరరావు, సుసర్ల, కే.వి.మహదేవన్‌ వంటి సంగీత దర్శకులు ఏలుతున్నప్పుడు వారిలో ఒకరిగా గుర్తింపు పొందారు.

ఘంటసాల వెంకటేశ్వరరావు

ఆయన సంగీత దర్శకత్వం వహించిన 'పాతాళభైరవి', 'మాయాబజార్‌', 'గుండమ్మకథ', 'పెళ్లిచేసిచూడు' వంటి ఎన్నో చిత్రాలు కేవలం సంగీత దర్శకుడిగా తిరుగులేని స్థానం సంపాదించిపెట్టాయి. ఇంక 'లవకుశ'లో విశ్వరూపం చూపారు. 'రహస్యం' సంగీత శ్రేష్టుల మన్ననలందుకొన్నది. కాబట్టి అటు గాయకుడిగా ఇటు సంగీత దర్శకుడిగా అగ్రస్థానాన మూడు దశాబ్దాల పాటు వీరవిహారం చేసిన వారితో మాత్రమే పోల్చాలి. అలాంటివారు మరొకరు లేరు. వందకుపైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి పదివేల పాటలకు పైగా పాడిన మరొక వ్యక్తి లేరు.

మూడు దశాబ్దాల పారవశ్యం...

ఘంటసాలలో రచయితతో పాటు నిర్మాతగానూ చేశారు. మిగిలిన అంశాల కన్నా ఎక్కువగా ప్రేక్షకులు ఆయనను గాయకుడిగానే ఆరాధించారు. నేపథ్య సంగీతం జనరంజకమయినది ఆయనతోనే. విషాదం, హాస్యం, సరసం, కరుణ, వైరాగ్యం భావమేదైనా, సందర్భమేదైనా సరే ఆయన పాట లేకుండా చిత్రపరిశ్రమలో మూడు దశాబ్దాలు గడవలేదు.

ఘంటసాల ఉన్నప్పుడే ఎంతోమంది గాయకులు ఉన్నారు. అగ్ర హీరోల సినిమాలకు సరేసరి. సాదాసీదా సినిమాలలోనూ ఆయనతో ఒక పాటైనా పాడించుకొనేవారు. ఆయనలో లోపమేదైనా ఉన్నదంటే అది ఆయన అనారోగ్యం మాత్రమే. మూడు పదుల వయసులోనే చక్కెర వ్యాధి రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు.

1974 ఫిబ్రవరి 11న కన్నుమూయడానికి అయిదు సంవత్సరాల ముందు నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. కంఠం బరువుగా (ఎగ ఊపిరి) వినవచ్చేది. అయితే అది విషాద గీతాలకు బాగానే సరిపోయేది. లలితమైన పాటలకు ఆయన సరిపోరనే కొంతమంది అభిప్రాయానికి కారణం ఆయన అనారోగ్యం కానీ ఆయన కాదు. ఆయనది కంచుకంఠం.. గాంభీర్యం ఎక్కువే అయినా తగ్గించుకొని మృదువైన పాటలు ఎన్నో పాడారు. కానీ చివరలో ఆరోగ్యం సహకరించలేదు.

వ్యక్తిత్వం...

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందరిని 'బాబూ', 'నాన్న' అని పలకరిస్తారు. విజయనగరంలోని తనకు ముద్దపెట్టిన తల్లినీ, ఆదరించిన గురువుని తలచుకోని రోజులేదు. ఆ గురువు కుమారుడిని తన దగ్గరే సహాయకుడిగా పెట్టుకొన్నారు. నా తొలిరోజులలో నాతో ఓ చిన్న పాట పాడించడానికి కాకితో కబురుంపితే సరిపోయేదానికి ఆయన స్వయంగా నా గదికి వచ్చి పిలుచుకొని వెళ్లారని... ఆయన చేత తన వారసుడిగా ప్రకటించుకోబడ్డ బాలసుబ్రహ్మణ్యం చెబుతారు.

కుటుంబంతో ఘంటసాల వెంకటేశ్వరరావు

చిత్ర విజయాలలో తన పాత్ర గణనీయమైనదైనా ఎప్పుడైనా ఇంత ఇస్తేనే పాడతాను అనలేదు. నిర్మాతలే చూసి ఇచ్చే వాళ్లు. ఆయనకు కావల్సినవి సమకూర్చేవాళ్లు. ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్‌వాల్‌ చక్రపాణి కట్టించారు. తొలికారును భానుమతి బుక్‌ చేశారు. భక్తితత్పరతకు ఆయన గానం మారుపేరు. 'నమో వేంకటేశా' ప్రైవేట్‌ సాంగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో కచేరి చేసింది అలనాడు అన్నమయ్య అయితే, ఆ తర్వాత ఘంటసాల వెంకయ్యే చేశారు. తెలుగులో పాడవలసి వస్తే రఫీ తొలుతగా ఘంటసాలను సంప్రదిస్తే సాదరంగా ఆహ్వానించారు.

తను చేసిన భగవద్గీత ఆల్బమ్‌ ఆవిష్కరణకు లతామంగేష్కర్‌ ఘంటసాలను పిలిచినప్పుడు ఆయనలో భగవద్గీత చెయ్యాలనే సంకల్పం కలిగింది. అప్పటికే ఆరోగ్యం చెడిపోయింది. గీత పాడటం పూర్తయ్యాక ఇంక సినిమా పాటలు పాడకూడదనుకొని కాషాయ వస్త్రాలు ధరిస్తూ అతి కష్టం మీద భగవద్గీత రికార్డింగ్‌ పూర్తి చేసారు. కానీ రికార్డు విడుదల నాటికి ఆయన భౌతికంగా లేరు. కానీ భగవద్గీత ఎప్పటికీ ఉంటుంది. గీత ఉన్నంత కాలం ఘంటసాల భగవద్గీత ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details