1950-60 దశకాల్లో విజయ, అన్నపూర్ణ, జగపతి సంస్థలు కుటుంబసమేతంగా చూసి వినోదాన్ని ఆస్వాదించగలిగిన సినిమాలు నిర్మించి మంచి నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్నాయి. ఆధునిక సినీ చరిత్రలో నిర్మాత అచ్చిరెడ్డి- దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మిత్ర ద్వయం కూడా మనీషా ఫిలిమ్స్ పతాకం మీద ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలు నిర్మించి పేరు గడించారు. ఈ సంస్థ నిర్మించిన చిత్రాల వెనుక కృష్ణారెడ్డి అవిరళ కృషి, అసామాన్య ప్రతిభ అనన్యం. అలాగే కృష్ణారెడ్డి వేసిన ప్రతి అడుగు వెనకే అచ్చిరెడ్డి, కిశోర్ రాఠీలు నడిచి ఆయనకు సహకారం, ఆత్మబలం చేకూర్చారు. నేడు కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ జర్నీపై ఓ లుక్కేద్దాం...
పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా సినిమాల పిచ్చే...
సంచలన దర్శకుడు కృష్ణారెడ్డి పూర్తి పేరు సత్తి వెంకట కృష్ణారెడ్డి. పుట్టింది జూన్ 1, 1961న తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి దగ్గరలో ఉన్న కొంకుదురులో. బాల్యం గడిచింది కూడా అక్కడే. తండ్రి వెంకటరెడ్డి మోతుబరి రైతు. తల్లి సుబ్బాయమ్మ గృహిణి. తండ్రి వ్యవసాయంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసేవారు. ప్రాథమిక విద్యాభ్యాసం పుట్టిన ఊళ్లోనైనా, హైస్కూలు చదువుకు ఎదిగేనాటికి కృష్ణారెడ్డి కుటుంబం తణుకు పట్టణానికి దగ్గరలో ఉన్న ఆరవల్లికి మకాం మార్చింది. కృష్ణారెడ్డి హైస్కూలు చదువు ఆ ఊళ్లోనే కొనసాగింది. తర్వాత అక్కడకు దగ్గరలో ఉన్న భీమవరం డి.ఎన్.ఆర్.కాలేజిలో ఎం.కాం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుతోపాటు సినిమాలంటే కృష్ణారెడ్డికి చాలా ఇష్టం. సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా హీరో కావాలని కలలు కనేవారు. ముఖ్యంగా సినిమాలు చూశాక వాటి లోటుపాట్లను గుర్తించడం, వాటి విలువలను తెలుసుకోవడం వంటి విషయాలను మిత్రులతో చర్చిస్తూ విశ్లేషణ జరపడం కృష్ణారెడ్డికి అలవాటుగా మారింది. హీరో కావాలనే తపన అయితే ఉండేదే గాని ఏనాడు కాలేజి స్థాయిలో నాటకాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.
సినిమా అవకాశాలకోసం చెన్నపురికి...
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తవగానే సినిమాల్లో అవకాశాల అన్వేషణ కోసం కృష్ణారెడ్డి మద్రాసు పయనమయ్యారు. అందరిలాగే చాలాచోట్ల తిరిగారు.. ఎందరినో కలిశారు. అవకాశాలు రాలేదు. చివరికి "మనమే ఒక సినిమా తీస్తే పోలా" అనే నిర్ణయానికి వచ్చారు. తన మిత్రులు కొందరిని సంప్రదించి కొద్ది పెట్టుబడి పెట్టి 'పగడాల పడవ' అనే సినిమా నిర్మించారు. కృష్ణారెడ్డి అందులో హీరో. సినిమా అయితే పూర్తయింది... కానీ విడుదల చేయడం అంత సులభమా? తను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుడు బోధపడింది... చిత్రసీమ గురించి చాలా నేర్చుకోవాలనే సంగతి. 'పగడాల పడవ' నీట మునిగింది. డబ్బులూ పోయాయి. లాభంలేదనుకొని కృష్ణారెడ్డి హైదరాబాద్ వచ్చేశారు. అప్పుడే ఆరవల్లిలో తన మిత్రుడైన అచ్చిరెడ్డి తనతో కలిశారు.
గతంలో తన తండ్రి సాగించిన స్వీట్స్ వ్యాపారంలో అడుగెట్టాలని నిశ్చయించి, ఇద్దరూ కలిసి కొంత శిక్షణ తీసుకున్నారు. వినూత్న రీతిలో ఇరానీ హోటళ్లలో అంధ్రా స్వీట్స్ అంటూ సంప్రదాయ ఆంధ్రాస్వీట్స్‌ను ఇరానీ హోటళ్ల ద్వారా అమ్మకాలు సాగించారు. ఈ కొత్త విధానం బాగా క్లిక్ అయింది. చేతిలో కొంత సొమ్ము చేకూరింది. స్వీట్స్‌తోపాటు మంచి రుచికరమైన టీ పొడి తయారు చేసి ఇరానీ టీ దుకాణాలకు సరఫరా చేయడం మొదలెట్టారు. తీరిక సమయాల్లో కృష్ణారెడ్డి మాత్రం నటరాజ రామకృష్ణ వద్ద నాట్యంలో శిక్షణ తీసుకునేవారు. అలా రెండేళ్లు గడిచాయి. మరలా మకాం మద్రాసుకు మారింది. సినిమా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిన్న చితకా అవకాశాలు వచ్చినా, చేస్తే హీరోగానే చేయాలనే ధృడ సంకల్పంతో ఆ వైపు మొగ్గలేదు. అచ్చిరెడ్డిని కూడా మద్రాసు పిలిపించి ప్రత్యామ్నాయం ఆలోచించారు. డబ్బింగ్ చిత్రాలు నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు కార్యరూపమిచ్చారు.
తమిళ సర్వర్ సుందరం తెలుగులోకి...
ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం వారు 1964లో కృష్ణన్-పంజు దర్శకత్వంలో నగేష్, ముత్తురామన్, కె.ఆర్.విజయ ముఖ్య తారాగణంగా 'సర్వర్ సుందరం' సినిమా నిర్మించి అఖండ విజయం సాధించారు. ఇదే చిత్రాన్ని టైగర్ ప్రొడక్షన్స్ నిర్మాత పహిల్వాన్ నెల్లూరు కాంతారావు 1966లో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తే ఆ సినిమా బాగా కాసులు రాల్చింది. ఆ సినిమా హక్కులు కొని దానినే మరలా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని సంకల్పించారు. అయితే ఆ సినిమా ఆడియో బాగా దెబ్బతినడం వల్ల, దానిని సరిచేసి అనిసెట్టి రాసిన స్క్రిప్టుతోనే డబ్బింగ్ పూర్తిచేసి విడుదల చేశారు. సినిమాకు లాభాలొచ్చాయి. అదే ఊపులో దర్యాప్తు, సూర్య ది గ్రేట్ వంటి కొన్ని డబ్బింగ్ సినిమాలను కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి ద్వయం విడుదల చేసి కాస్త డబ్బులు సంపాదించింది. హైదరాబాద్లో మనీషా సంస్థ అధిపతి కిశోర్ రాఠీ వీడియో క్యాసెట్ల వ్యాపారం చేసేవారు. వారితో అచ్చిరెడ్డికి బాగా పరిచయం కావడం వల్ల కొన్ని సినిమాల వీడియో హక్కులు కొని వాటిని వీడియో క్యాసెట్ల కింద మార్చి వ్యాపారం చేయడం, దూరదర్శన్‌లో ప్రసారమయ్యే సినిమాలకు నిర్మాతలతో మాట్లాడి మధ్యవర్తిత్వం నిర్వహిస్తూ కొంత వ్యాపారం వంటివి చేశారు ఇద్దరూ. అయితే ఈ వ్యాపార కార్యకలాపాలన్నీ అప్పట్లో మద్రాసు కేంద్రంగానే జరిగేవి. అది ఈ మిత్రద్వయానికి కలిసొచ్చిన అంశం.
'కొబ్బరి బొండాం'తో సినీ నిర్మాణం...
కృష్ణారెడ్డికి సొంతంగా సినిమా నిర్మిద్దామనే ఆలోచన రావడం వల్ల ఒక కొత్తరకం కథకు రూపకల్పన చేశారు. కథాచర్చలు అచ్చిరెడ్డితో పూర్తిచేసి దానికి అవసరమైన స్కీన్ర్ ప్లే స్వయంగా సమకూర్చి సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. సంభాషణలను దివాకరబాబు సమకూర్చగా మనీషా ఫిలిమ్స్ పతాకం మీద సినిమా నిర్మాణం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అచ్చిరెడ్డి నిర్మాతగా, కాట్రగడ్డ రవితేజ దర్శకుడిగా ఆ చిత్రం పూర్తిచేశారు. రాజేంద్రప్రసాద్, నిరోషా హీరో హీరోయిన్లు. కథ, స్క్రీన్ ప్లేతోపాటు కృష్ణారెడ్డి సంగీతం కూడా సమకూర్చారు. పిరికివాడైన ఒక యువకుడికి ఒక ప్రొఫెసర్ ఆత్మవిశ్వాసం కలిగేలా చేసి, అతడిని ఇబ్బందుల నుంచి గట్టేక్కించడం ఈ చిత్ర నేపథ్యం. క్రమబద్ధమైన ప్రణాళిక, అశ్లీలంలేని కథారచన, వినోద ప్రధానమైన సినిమాగా రూపొందించడం వల్ల 'కొబ్బరి బొండాం' సినిమా 1991లో విడుదలై విజయాన్ని సాధించింది.
అయితే హీరో కావాలన్న కృష్ణారెడ్డి కల కలలాగే మిగిలిపోయింది. 'కొబ్బరి బొండాం' సినిమా తర్వాత తనే హీరోగా నటించాలని ఒక మంచి కామెడీ కథను తయారుచేసుకున్నారు కృష్ణారెడ్డి. కొన్ని పాటలు కూడా రాయించి వాటికి ట్యూన్లు కట్టుకున్నారు. కాస్త అనుభవమున్న దర్శకుడిని పెట్టుకుంటే సినిమాకు పేరోస్తుందని కొందర్ని కలిశారు. వారంతా కథలో మార్పులు సూచించడం మొదలెట్టారు. అప్పుడు అచ్చిరెడ్డి కలిపించుకొని "తొలి సినిమాకు కథ, స్కీన్ర్ ప్లే నువ్వే రాశావు. సంగీతం కూడా సమకూర్చావు. తొలి సినిమా నిర్మాణం అనుభవం నీకు ఎంతైనా ఉంది. నువ్వే ఎందుకు దర్శకత్వం వహించకూడదూ" అంటూ కృష్ణారెడ్డిని ప్రోత్సహించడం వల్ల దర్శకత్వం వైపు కృష్ణారెడ్డి రూటు మార్చుకున్నారు.