ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా పేరొంది... పలు భాషల్లో వచ్చిన ఎన్నో మాఫియా కథలకు నాందిగా నిలిచింది. మూడు ఆస్కార్‌లతో పాటు మరెన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు గెలుచుకుంది. మరో రెండు సీక్వెల్ సినిమాలకు మూలమైంది. 6.5 మిలియన్ డాలర్లతో నిర్మితమై, ఏకంగా 286 మిలియన్ డాలర్లను కొలగొట్టింది. ఆ సినిమానే 1972లో వచ్చిన 'ది గాడ్ ఫాదర్'.
అమెరికాకు చెందిన రచయిత, జర్నలిస్ట్ మారియో పుజో 1969లో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అమెరికా, ఇటలీలలో వేళ్లూనుకుపోయిన నేర సామ్రాజ్యాలు, నేరగాళ్ల ముఠాల నేపథ్యం ఈ సినిమా ఆద్యంతం. ప్యారమౌంట్ పిక్చర్స్ సంస్థ తీసిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా దర్శకత్వం వహించాడు.