తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కలిసి నటిస్తే కలదు విజయం' - కలిసి నటిస్తే కలదు విజయం

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉమ్మడి వాతావరణం కనిపిస్తోంది. వేరే ఇండస్ట్రీలకు చెందిన నటులు మరో ఇండస్ట్రీలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణం పాన్ ఇండియా చిత్రాలే.

cinema
సినిమా

By

Published : Jun 3, 2021, 7:50 AM IST

'కలిసి ఉంటే కలదు సుఖం'.. అనేది నానుడి. 'కలిసి నటిస్తే కలదు.. విజయం'.. అనేది సినిమా నానుడి. కుటుంబమంతా కలిసి థియేటర్‌కి వస్తే ఆ సందడే వేరు. పిల్లలు పెద్దలు కలిసి ఆస్వాదించే సినిమాలకి దక్కే వసూళ్లు.. అవి అందుకునే విజయాల స్థాయే వేరు. మరి ఆ స్థాయిలో మన సినిమాకు పక్క రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులు కుటుంబంతో కలిసి రావాలంటే.. ఏం చేయాలి? అక్కడి తారలు చిత్రంలో కన్పించాలి. కీలక పాత్రల్లో మెరవాలి. అప్పుడు పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలకు ఆశించిన ఫలితాలొస్తాయి. అందుకే ఒక భాషలో తెరకెక్కుతున్న సినిమా కోసమని.. ఇతర భాషల నుంచీ తారాగణం కలిసొస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమంతా ఓ కుటుంబంలా మారుతోంది.

ఆర్ఆర్ఆర్

అగ్ర దర్శకుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు హాలీవుడ్‌ తారాగణం వరకు భిన్న పరిశ్రమలకి చెందినవాళ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఎక్కుపెట్టిన లక్ష్యాలూ అదే స్థాయిలో ఉన్నాయి మరి! రాజమౌళి గత చిత్రం 'బాహుబలి' (Bahubali) ప్రపంచంలోని పలు భాషల్లో విడుదలై విజయవంతమైంది. ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అందుకు తగ్గట్టుగా ఉండటం కోసం.. మార్కెట్‌ వ్యూహాల్ని అనుసరించి ఆయన తారల ఎంపిక కోసం హాలీవుడ్‌ వరకు వెళ్లారు. తెలుగు హీరోలు ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram Charan) ప్రధాన పాత్రధారులు కాగా.. అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌ (Alia Bhatt), ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్సన్‌, అలిసన్‌ డూడీ, శ్రియ, సముద్రఖని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 12 భాషల్లో ఆ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది.

ఆదిపురుష్

'బాహుబలి' చిత్రాల తర్వాత ప్రభాస్‌(Prabhas) సినిమాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. ప్రభాస్‌కి అన్ని భాషల్లోనూ ఇప్పుడు అభిమానగణం ఉంది. అయినా సరే.. ఆయన సినిమాల్లో భిన్న పరిశ్రమలకి చెందిన తారలు మెరుస్తుంటారు. 'ఆదిపురుష్‌' (Adipurush)లో బాలీవుడ్‌ తారలు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan), కృతిసనన్‌ (Kriti Sanan), సన్నీసింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'రాధేశ్యామ్‌' (RadheShyam)లోనూ భాగ్యశ్రీ, కునాల్‌ రాయ్‌కపూర్‌ తదితర బాలీవుడ్‌ తారలు ఉన్నారు. 'సలార్‌' (Salaar)లో కన్నడ తారలకీ చోటుందని తెలుస్తోంది. ఇక నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె (Deepika Padukone) సంతకం చేసేశారు.

ఆ పవనాలే..

హరిహర వీరమల్లు
  • పవన్‌కల్యాణ్‌ (pawan Kalyan) 'హరి హర వీరమల్లు' (Harihara Veeramallu) పాన్‌ ఇండియా స్థాయి చిత్రం కాబట్టి ఇందులో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌ తారలు అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌(Jacqueline fernandez)ని ఎంపిక చేశారు.
  • అల్లు అర్జున్‌ 'పుష్ప' (Pushpa) చిత్రం కోసం మలయాళం కథానాయకుడు ఫాహద్‌ ఫాజిల్‌ని ఎంపిక చేశారు.
  • సమంత (Samantha) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న 'శాకుంతలం' సినిమా పాన్‌ ఇండియా స్థాయి ప్రాజెక్టే కాబట్టి ఇందులోనూ భిన్న పరిశ్రమలకి చెందిన తారలు నటిస్తున్నారు.
  • మన సినిమాల్లోనే కాదు.. ఇతర భాషల్లో రూపొందుతున్న చిత్రాల్లోనూ పొరుగు పరిశ్రమలకి చెందిన తారలుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్‌ చిత్రం 'బ్రహ్మాస్త్ర'(Brahmastra) లో నాగార్జున ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 'లాల్‌సింగ్‌ చద్దా'లో నాగచైతన్య ఓ పాత్ర చేస్తున్నారు. 'కేజీఎఫ్‌2' (KGF chapter 2), 'లైగర్‌', 'మేజర్‌' తదితర పాన్‌ ఇండియా సినిమాల్లోనూ భిన్న పరిశ్రమలకి చెందిన నటులున్నారు.
    బ్రహ్మాస్త్ర

సొంతం చేసుకోవాలంటే..

ఇది అన్ని చోట్లా చెప్పాల్సిన కథ అనిపించిందంటే చాలు.. సినీ రూపకర్తలు దాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తీయడం కోసం రంగం సిద్ధం చేస్తుంటారు. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చినా ప్రేక్షకులు ఆదరించేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే కాస్త ఎక్కువ ఖర్చయినా దాన్ని పాన్‌ ఇండియా లక్ష్యంగా రూపొందిస్తుంటారు. అయితే ఇది మా సినిమానే అని ప్రేక్షకులు సొంతం చేసుకోవాలంటే మాత్రం అందులో తెలిసిన తారలు ఒకరిద్దరైనా ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడే ప్రేక్షకులు ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్‌కి వచ్చే వీలు ఉంటుంది. ఆ కారణంతోనే సినీ రూపకర్తలు అందులో కొన్ని పాత్రలకైనా స్థానిక నటుల్ని ఎంపిక చేసుకోవాలని తపిస్తుంటారు. అలా అన్ని భాషలకి చెందిన పరిశ్రమలూ ఒక్కటైపోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details